America: అమెరికాలో భారతీయ పిల్లలకు కష్టాలు.. 21 ఏళ్లు నిండితే వెళ్లిపోవాలంటున్న అగ్ర రాజ్యం!

వారంతా.. పెద్దగా ఊహ తెలియనప్పుడే తల్లిదండ్రులతో అమెరికాలో అడుగుపెట్టారు. అక్కడే పెరిగారు. చదువుకున్నారు. కొంత మందికి ఉద్యోగాలూ వచ్చాయి. ఇదంతా చట్టబద్ధమే. ఇప్పుడు ఉన్నట్లుండి ఆ దేశం వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Written By: Raj Shekar, Updated On : July 29, 2024 9:29 am

America

Follow us on

America: అగ్రరాజ్యం అమెరికాలో స్థిర పడిన భారతీయుల పిల్లలపై దేశం వీడాల్సిన కత్తి వేలాడుతోంది. ఊహ తెలియని వయసులో కొందరు అక్కడికి తల్లిదండ్రులతో వెళ్లగా, కొందరు అక్కడకు వెళ్లాక పుట్టారు. ఇలాంటి వాళ్లు అమెరికాలో 2.5 లక్షల మంది వరకు ఉన్నారు. అక్కడే పెరిగారు. చదువుకున్నారు. కొంత మందికి ఉద్యోగాలూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి దేశం వీడాల్సిన పరిస్థితి నెలకొంది. 21 ఏళ్లు నిండిన భారతీయుల పిల్లలు దేశం వీడాలని బైడెన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇన్నాళ్లు తమదే అనుకున్న అమెరికాను అక్కడే ఉన్న తల్లిదండ్రులను, బంధువులను విడిచి తిరిగి ఇండియాకు రావాల్సిన పరిస్థితి తలెత్తింది. జనాభా పెరుగుదల, అక్కడి వారికి దక్కాల్సిన ఉద్యోగాలను భారతీయ పిల్లలు సాధించడం వంటి కారణాలతో అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ మేరకు హెచ్‌1బి వీసాపై అమెరికాలో ఉంటున్న ఉద్యోగుల పిల్లలకు హెచ్‌4 వీసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది పిల్లలకు 21 ఏళ్లు వచ్చేవరకూ ఉపయోగపడుతుంది. తర్వాత వాళ్లు దేశం వీడాల్సిందే. అక్కడే ఉండాలంటే స్టూడెంట్‌ వీసా సాధించాలి లేదంటే కొత్త తాత్కాలిక స్థితికి మారాలి. అదీ కాకుంటే భారత్‌కు తిరిగి వచ్చేయాలి.

వీరంతా ఎవరు..
జెఫ్రేనాకు ఏడేళ్ల వయసున్నప్పుడు… తల్లిదండ్రులు భారత్‌ నుంచి ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లారు. తల్లిదండ్రులపై ఆధారపడ్డ బిడ్డగా ఆమె హెచ్‌–4 (డిపెండెంట్‌) వీసాపై వెళ్లింది. హెచ్‌–1బీ వీసాపై ఉన్న ఆమె తల్లిదండ్రులు… అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్‌Œ∙కార్డు) కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అదింకా పెండింగ్‌లోనే ఉంది. ఇంతలో జెప్రేనాకు 21 ఏళ్లు నిండాయి. అమె ఇప్పుడు బలవంతంగా అమెరికాను వదిలి భారత్కు వెళ్లాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులతో చిన్న పిల్లాడిగా వెళ్లిన రోషన్‌ అమెరికాలోనే పెరిగాడు. అక్కడే చదువుకున్నాడు. ఇటీవలే 21 ఏళ్లు నిండాయి. తల్లిదండ్రులింకా హెచ్‌–1బీ వీసాలపైనే ఉన్నారు. దీంతో ఎలా ఉంటుందో తెలియని భారత్‌కు తిరిగి వచ్చి బంధువులవద్ద ఉంటున్నాడు. 8 ఏళ్ల వయసులో తల్లితండ్రులతో కలసి టెక్సాస్‌ వచ్చిన ప్రణీత అమెరికన్‌ సెమీకండక్టర్‌ కంపెనీలో క్లౌడ్‌ ఇంజినీరుగా పని చేస్తోంది. 15 ఏళ్ల తర్వాత ఆమె అమెరికా నివాసం ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.

ఎందుకంటే..
ఉద్యోగాల మీద అమెరికా వచ్చే తల్లిదండ్రుల వెంట వారి పిల్లల్ని (నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా కేటగిరీలో తాత్కాలికంగా) అనుమతిస్తారు. పిల్లలకు 21 ఏళ్లు నిండేలోపు తల్లిదండ్రులకు గ్రీన్‌కార్డు వస్తే వారికి శాశ్వత నివాసం దొరికినట్లే అలాకాకుండా 21 ఏళ్లు నిండేలోపు గ్రీన్‌కార్డు ్డ రాకుంటే వారి తాత్కాలిక డిపెండెంట్‌ వీసా హోదా రద్దవుతుంది. దీన్నే ’ఏజ్‌ ఔట్‌’ అంటారు. వారి పేరు తల్లిదండ్రుల గ్రీన్‌కార్డు దరఖాస్తు నుంచి తొలగిపోతుంది. ఫలితంగా అమెరికా నుంచి పంపించేస్తారు. లేదంటే అక్కడే ఉండటానికి మరోరకం తాత్కాలిక వీసాలకు దరఖాస్తు చేసుకోవాలి. అందుకు వీలు లేకుంటే అమెరికాను వదిలి వెళ్లాల్సిందే. అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్‌ సేవల గణాంకాల ప్రకారం… గత నవంబరు నాటికి 10 లక్షల మందికి పైగా భారతీయులు.. గ్రీన్‌ కార్డు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.