Homeప్రవాస భారతీయులుTANA: తానాలో లొల్లి.. కోర్టుకు ఎక్కిన వ్యవహారం.. ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం!

TANA: తానాలో లొల్లి.. కోర్టుకు ఎక్కిన వ్యవహారం.. ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం!

TANA: “అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని” మాదిరిగా తయారైంది తానా కార్యవర్గ పరిస్థితి. అహంకారాలకు, పట్టింపులకి పోయి పెద్దమనుషుల అంగీకారానికి తూట్లు పొడిచి నేడు తమ సీటుకే ఎసరు తెచ్చుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు నిరంజన్‌ను 2023 ఏప్రిల్ 30 నాటికి ఉన్న తానా కార్యవర్గం, బోర్డు, ఫౌండేషన్లే ప్రస్తుతం కూడా కొనసాగాలని, 90రోజుల్లో ఎన్నికలు జరిపి తదుపరి కార్యవర్గ సభ్యులను నియమించుకోవల్సిందిగా మేరీల్యాండ్ కోర్టు గురువారం నాడు తీర్పునిచ్చినట్లు సమాచారం. జులై 10 తర్వాత తానా బోర్డు తీసుకున్న అన్ని నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తాళ్లూరి మురళీ, చావా శ్రీధర్, పరుచూరి చక్రధర్‌ తానా బోర్డు తన నైతిక విధులను నిర్వహించట్లేదని, రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన పదవుల పంపకాన్ని నిలువరించాలని దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

అసలు ఏమిటీ గొడవ?
తానాలో డీసీ, డెట్రాయిట్-న్యూయార్క్, అట్లాంటాల నుంచి మూడు గ్రూపులు ఉన్నాయి. 2023 తానా మహాసభల అనంతరం తానా ఫౌండేషన్, బోర్డు, కార్యవర్గాలకు ఈ మూడు గ్రూపులకు చెందిన నూతన ప్రతినిధులను పెద్దమనుషుల అంగీకారం ఆధారంగా ఎంపిక చేసుకుని పదవులను పంపిణీ చేసుకున్నారు. ఈ పంపిణీ చెల్లదని, బోర్డు తన నైతిక విధులను నిర్వహించట్లేదని, కార్యవర్గ సభ్యులకు సహకారం అందించట్లేదని ముగ్గురు తానా జీవితకాల సభ్యులు కోర్టును ఆశ్రయించారు.

1. పెద్దమనుషుల అంగీకారం ప్రకారం ఫౌండేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి పదవులు మూడు గ్రూపులకు చెందిన ఒక్కొక్కరికి పంపకం చేయవల్సి ఉండగా, డెట్రాయిట్-న్యూయార్క్‌కు చెందిన గ్రూపుకు మిగతా రెండు గ్రూపులు మొండిచేయి చూపారు. ఫౌండేషన్‌లోని ఈ ముగ్గురు తానా రాజ్యాంగం ప్రకారం బోర్డులో సభ్యత్వానికి అర్హులవుతారు. డెట్రాయిట్-న్యూయార్క్ గ్రూపునకు చెందిన వ్యక్తికి మొండిచేయి చూపడం ద్వారా మిగతా రెండు గ్రూపులకు తానా బోర్డులో మెజార్టీ లభిస్తుంది. బోర్డులో ఈ అప్రజాస్వామిక మెజార్టీ కోర్టు కేసుకు మొదటి కారణమని వినికిడి.

2. జులైలో నూతన కార్యవర్గ సభ్యులు పదవీస్వీకారం చేసినప్పటికీ సంస్థ అధ్యక్షుడికి, కార్యదర్శికి తానా వెబ్‌సైట్, ఈమెయిల్‌లకు సంబంధించిన సమాచారాన్ని అందజేయలేదు. బోర్డులో ఎన్నోసార్లు ఈ విషయంపై చర్చలు, వాదోపవాదాలు, తీవ్ర వాగ్వివాదాలు జరిగినప్పటికీ సమాచారాన్ని మాత్రం గత కార్యవర్గ బృందం ప్రస్తుత కార్యవర్గానికి బదిలీ చేయలేదని సమాచారం. తానా కార్యవర్గం సజావుగా తన విధులను నిర్వహించేలా చూడటం బోర్డు మౌలిక బాధ్యత. కానీ దానికి తూట్లు పడుతున్నప్పటికీ మెజార్టీ సభ్యులు పంతానికి పోయి, బాధ్యత విస్మరించి, తెగేదాకా లాక్కుని తమ పదవులు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారని ప్రవాసులు అభిప్రాయపడుతున్నారు. ఇది కోర్టు కేసుకు రెండో కారణం.

సేవా స్ఫూర్తితో 46 ఏళ్ల కిందట స్థాపించబడిన తానాలో సభ్యుల సంఖ్యా పరంగా, ఆర్థిక వనరుల పరంగా ఎన్నో ఆరోగ్యకరమైన మార్పులు సంభవించినా నాయకుల ఆలోచన ధోరణిలో అదే విధమైన మార్పు కొరవడిన కారణంగా తానా ప్రతిష్ఠకు మచ్చలు ఏర్పడుతున్నాయి. ఎన్నికైన కార్యవర్గం రద్దు కావడం లాంటి వింత పరిస్థితులు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించి నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యతను తానా నేతలు ఎలా నిర్వర్తిస్తారో వేచి చూడాల్సిందే. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version