Telugu Speakers: అమెరికాలో తెలుగు లెస్స.. తెలుగువాళ్లు తల ఎగరేయాల్సిన సమయమిది..

ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీష్ బోధన, చదవడాన్ని ప్రవేశపెట్టడంతో తెలుగు పూర్తిగా దూరమవుతోంది.. ఒక నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాలలో తెలుగు చదివే వారి సంఖ్య గత 10 సంవత్సరాలతో పోల్చితే దాదాపు 35% తగ్గినట్టు తెలుస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 27, 2024 12:07 pm

Telugu Speakers

Follow us on

Telugu Speakers: “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్.. దేశభాషలందు తెలుగు లెస్స.. అజంతా భాష..” ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని.. తెలుగు భాషకు ఎన్నో ఉపమానాలున్నాయి. మరెన్నో అన్వయాలున్నాయి..
అద్భుతమైన నుడికారం.. అనన్య సామాన్యమైన వర్ణమాల.. ఆసక్తి కలిగించే చందస్సు.. మైమరిపించే వర్ణాల వర్చస్సు తెలుగు భాషకే సొంతం.. అందుకే కాలోజీ నారాయణరావు లాంటివారు.. తెలుగు భాష గొప్పదనాన్ని.. ఆంగ్లం మోజులో విస్మరించడాన్ని నేరుగానే ఎత్తి చూపారు.

” ఈ భాష వేషం ఎవరి కోసము రా
ఆంగ్లమందున మాటలు అనగానే
ఇంత కుల్కెదవెందుకురా?
తెలుగువాడి వై తెలుగు రాదనుచు
సిగ్గు లేక ఇంకా చెప్పుట ఎందుకురా?
అన్య భాషలు నిలిచి ఆంధ్రము రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా”?

అంటూ చర్నాకోల్ తో కొట్టినట్టు నాటి రోజుల్లోనే ప్రశ్నించారు.. కాలం మారుతున్నా కొద్దీ తెలుగు రాష్ట్రాలలో.. తెలుగు చదివే వారి సంఖ్య తగ్గిపోతుంది. పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు భాష అనేది కనుమరుగైపోతుంది. దీంతో తెలుగు రాసే వారి సంఖ్య పూర్తిగా మాయమవుతోంది. ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీష్ బోధన, చదవడాన్ని ప్రవేశపెట్టడంతో తెలుగు పూర్తిగా దూరమవుతోంది.. ఒక నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాలలో తెలుగు చదివే వారి సంఖ్య గత 10 సంవత్సరాలతో పోల్చితే దాదాపు 35% తగ్గినట్టు తెలుస్తోంది.

తెలుగు మాట్లాడే వారి సంఖ్య పెరిగింది

ఇలాంటి సమయంలో శ్వేత దేశమైన అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అమెరికా గణాంకాల విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. 2016లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 3.2 లక్షలు ఉండగా.. 2024 జూన్ నాటికి అది 12.3 లక్షలకు చేరుకుంది. కాలిఫోర్నియాలో తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా 2 లక్షల మంది దాకా ఉన్నారు. టెక్సాస్ లో 1.5 లక్షలు, న్యూ జెర్సీలో 1.1 లక్షల మంది తెలుగు మాట్లాడతారు.. ఇల్లి నాయిస్ లో 83,000 లో మంది, వర్జినియాలో 78,000, జార్జీయాలో 52,000 మంది తెలుగు మాట్లాడే వారు ఉన్నారు.. అమెరికాలో పదివేల మంది తెలుగువారు H1B వీసా లు కలిగి ఉన్నారు. మీరు మాత్రమే కాకుండా ప్రతి ఏడాది 60,000 నుంచి 70,000 మంది దాకా తెలుగు విద్యార్థులు అమెరికాకు వెళ్తున్నారు.. అయితే వీరిలో 75% మంది అమెరికాలో స్థిరపడుతున్నారు ఎక్కువగా డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూ జెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్ విల్లే ప్రాంతాలలో నివసిస్తున్నారు.

తెలుగు భాషకు 11వ స్థానం

అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్లలో 80 శాతం మంది ఐటీ, ఫైనాన్స్ విభాగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు.. అత్యధికంగా మాట్లాడే 350 విదేశీ భాషలలో తెలుగు 11వ స్థానంలో ఉందంటే.. అక్కడ తెలుగువారి ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో హిందీ, గుజరాతి కంటే అత్యధికంగా ప్రజలు మాట్లాడే మూడో భాషగా తెలుగు కొనసాగుతోంది. “మొదటిసారి మేము అమెరికా వెళ్ళినప్పుడు నాలుగైదు తెలుగు కుటుంబాలు మాత్రమే ఉండేవి. కానీ కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారి సంఖ్య పెరుగుతోంది.. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల తర్వాత తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్నది అమెరికాలోనే. దేవాలయాలు కూడా నిర్మితమవుతున్నాయి.. కమ్యూనిటీ స్పేస్ లు కూడా పెరిగాయని” న్యూ జెర్సీలో నివసిస్తున్న తెలుగు వ్యాపారవేత్త, 63 సంవత్సరాల రాఘవేంద్రరావు చెబుతున్నారు.. ఇక ఇండియన్ మొబిలిటీ -2024 రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తర్వాత తెలుగు విద్యార్థులు అమెరికా లోనే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో 12.5 శాతం మంది తెలుగు విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. వారిలో ఎక్కువగా కంప్యూటర్ సైన్స్, డేటా అనలటిక్స్, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, ఫైనాన్స్, వైద్య విద్యలో పీజీ వంటి కోర్సులను చదివేందుకు అమెరికా వెళ్తున్నారు.