Largest Hindu Temple In America: అమెరికాలోని అతిపెద్ద హిందూ దేవాలయం స్వామినారాయణ్ అక్షరధామ్ సిద్ధమైంది. అక్టోబర్ 8న న్యూజెర్సీలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. టైమ్స్ స్క్వేర్‌కు దక్షిణాన 90 మీటర్ల దూరంలో 183 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇందుకు దాదాపు 12 సంవత్సరాలు పట్టింది. 12,500 మంది వాలంటీర్లు దీని నిర్మాణంలో పాల్గొన్నారు.
ప్రపంచలోనే రెండో పెద్దది..
న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో ఉన్న ఈ దేవాలయం బహుశా ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది. 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ ప్రపంచంలో అతిపెద్ద ఆలయంగా గుర్తింపు పొందింది. ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
భారతీయ సంస్కృతిని ప్రతిభింభించేలా..
యునైటెడ్ స్టేట్స్‌లోని స్వామినారాయణ్ అక్షరధామ్ దేవాలయం ప్రాచీన భారతీయ సంస్కృతికి అనుగుణంగా చాలా సూక్ష్మంగా రూపొందించబడింది. ఇది భారతీయ సంగీత వాయిద్యాలు, నృత్య రూపాలను వర్ణించే 10 వేలకన్నా ఎక్కువ విగ్రహాలు, క్లిష్టమైన శిల్పాలు ఈ ఆలయంలో ఏర్పాటు చేశారు. ప్రధాన మందిరంతోపాటు, ఈ ఆలయంలో 12 ఉప-క్షేత్రాలు, తొమ్మిది శిఖరాలు(శిఖరం లాంటి నిర్మాణాలు), తొమ్మిది పిరమిడ్ శిఖరాలు ఉన్నాయి. ఒక నిర్మాణ అద్భుతం, ఇది సంప్రదాయ రాతి నిర్మాణంలో అతిపెద్ద దీర్ఘవృత్తాకార గోపురం కలిగి ఉంది.
అరుదైన రాళ్లతో నిర్మాణం..
ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణానికి సున్నపురాయి, గ్రానైట్, గులాబీ ఇసుకరాయి, పాలరాయి ఉపయోగించారు. సుమారు రెండు మిలియన్ క్యూబిక్ అడుగుల రాయి ఆలయ నిర్మాణానికి వాడారు. ఈ రాళ్లను భారతదేశం, టర్కీ, గ్రీస్, ఇటలీ, చైనాతోపాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించారు. ఆలయం యొక్క విశేషమైన లక్షణం ‘బ్రహ్మ కుండ్’ అని పిలువబడే సంప్రదాయ భారతీయ మెట్ల బావి, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 నీటి వనరుల నుంచి నీటిని కలిగి ఉంటుంది. విస్మయం కలిగించే ఈ ఆలయం అక్టోబర్ 18న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.