Tana: అమెరికాలోని తెలుగు వారి ఐక్యతను చాటేందుకు.. తెలంగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు, తెలుగువారి హక్కులను అగ్రరాజ్యంలో పరిరక్షిచేందుకు ఏర్పాటు చేసిన సంస్థ తానా. 1977లో దీని తొలి జాతీయ సమావేశం జరిగింది. లాభాపేక్షలేని సంస్థగా 1978లో అధికారికంగా ఏర్పాటైంది. 30 వేలకుపైగా సభ్యులు ఉన్న తానా అతి పెద్ద ఇండో–అమెరికా సంఘాల్లో ఒకటి. తెలుగు పండుగలను, ఉత్సవాలను సంఘం ఏటా నిర్వహిస్తోంది. ఇక తెలుగు వారిని ప్రోత్సహించేందుకు అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలుగు విద్యార్థులకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పిస్తోంది. అమెరికా పిల్లలతో పోటీపడేలా తీర్చిదిద్దుతోంది. ప్రతిభావంతులైన తెలుగువారిని ప్రోత్సహిస్తోంది. కొత్తగా అమెరికాకు వెళ్లే తెలుగువారిని గైడ్ చేస్తోంది. ఈ సంస్థ ఉత్తర అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలలో వివిధరంగాలలో రాణిస్తున్నవారిని గుర్తించి వారిని పురస్కారాలతో సత్కరిస్తుంది. ఇక పేద విద్యార్థులకు అనేక సహాయ సహకారాలు అందిస్తోంది. భారతీయులు, అమెరికన్లు అని భేదం చూపకుండా కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తోంది. ఉదారతను చాటుకుంటోంది. తాజాగా షార్లెట్‌లో బ్యాక్ ప్యాక్ పేరిట కార్యక్రమం నిర్వహించింది. ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది 300 మంది పేద విద్యార్థులకు సాయం అందించింది.
స్కూల్ బ్యాగులు పంపిణీ..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతి ఏటా బ్యాక్‌ప్యాక్ పేరుతో చిన్నారులకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆగస్టు 22న షార్లెట్‌లోని క్లియర్ క్రీక్ ఎలిమెంటరీ స్కూల్లో సుమారు దాదాపు 300కు పైగా పిల్లలకు బ్యాగ్‌లను అందజేశారు. బ్యాగులతో పాటూ క్రేయాన్స్, ఎరేజర్స్, పెన్సిల్, షార్పనర్స్, పెన్నులు తదితర వస్తువులను కూడా అందజేశారు. బ్రన్స్ ఎవెన్యూ ఎలిమెంటరీ స్కూల్లోని పిల్లలకు కూడా స్కూల్ బ్యాగ్‌లను అందజేశారు.
కార్యక్రమంలో తానా క్రీడల సమన్వయకర్త నాగ పంచుమర్తి, తానా అంతర్జాతీయ సమన్వయకర్త ఠాగూర్ మల్లినేని, తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, పట్టాభి కంఠమనేని, రమణ అన్నే, సతీష్ నాగభైరవ, పార్ధ సారధి గునిచెట్టి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, విద్యా సామగ్రి అందించిన తానాకు క్రీక్ ఎలిమెంటరీ స్కూల్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవలే అంధ క్రికెటర్లకు చేయూత..
ఇదిలా ఉంటే.. తానా ఇటీవలే భారత అంధ క్రికెటర్లకు తన వంతు సహకారం అందించింది. త్వరలో జరిగే పారాల ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అంధ క్రికెట్ జట్టు క్రీడాకారులు.. ఇటీవల అమెరికాలో విరాళాల కోసం పర్యటించారు. తానా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి క్రీడాకారులు హాజరయ్యారు. జట్టులో ఎక్కువ మంది తెలుగు, గుజరాత్‌కు చెందినవారు ఉండడంపై తానా సంతోషం వ్యక్తం చేసింది. అనంతరం తానా కల్చరల్ సెక్రెటరీ ఉమ కటిక ఆధ్వర్యంలో చెక్కు అందించారు.