
TANA: తానా.. అమెరికాలో తెలుగు వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఈ సంస్థ.. సామాజికసేవలో నేను సైతం అంటూ ముందుంటోంది. ఇప్పటికే తెలుగు వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఈ సంస్థ తాజాగా మరోసారి ముందుకొచ్చింది. ఈసారి ప్రప్రధమంగా ఉత్తర అమెరికాలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి ప్రవాసుల సమస్యలు తీర్చింది.
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని బొలింగ్ బ్రూక్ ఐఎల్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘము (తానా) ఆధ్వర్యంలో ఈనెల 18న శనివారం ‘ఉచిత కంటి వైద్య శిబిరాన్ని’ విజయవంతంగా నిర్వహించారు. ఈ క్లినిక్ కు చాలా మంది ప్రవాసులు వచ్చి తమ కంటి పరీక్షలు చేయించుకున్నారు.

ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ శ్రీరాం సొంటి, ఆస్పత్రికి వచ్చిన వారికి తమ సేవలను అందించారు. తానా సర్వీసెస్ మహిళా కోఆర్డినేటర్ డా. ఉమా ఆరమండ్ల కటికి ఆధ్వర్యంలో ఈ క్లినిక్ నిర్వహించారు. ఈ క్లినిక్ ను బొలింగ్ బ్రూక్ మేయర్ ‘మ్యారీ అలెక్సాండ్రా బస్తా’ సందర్శించి ‘తానా’ సేవలను, నిర్వాహకులను, వీరు చేస్తున్న సేవలను ప్రశంసించారు.

ఈ క్లినిక్ కు సిమోనా రాచపల్లి, సంధ్య అద్దంకి, శాంతి లక్కసాని, సీత మెర్ల, సత్యశ్రీ ,శ్రీ వాసంశెట్టి సహకారం అందించారు.

