TANA : అమెరికాలో ఉద్యోగాలు, చదువులు, బిజీ జీవితాల మధ్య కుటుంబ బంధాలు క్రమంగా దూరమవుతున్నాయనే ఆందోళన తరచూ వినిపిస్తుంది. ముఖ్యంగా మనవలు, మనవరాళ్లతో తాతయ్యలు, నానమ్మలు లేదా అమ్మమ్మలు కలిసి గడిపే సమయం తగ్గిపోతున్న ఈ తరుణంలో, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చేపట్టిన ఓ కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంటోంది.

అట్లాంటాలో “తరాలను అనుసంధానించడం” (Reconnecting Generations) అనే భావోద్వేగ థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలను ఘనంగా సన్మానించి, కుటుంబ బంధాల విలువను మరోసారి గుర్తు చేసింది. ఉత్తర అమెరికాలో ఒక తెలుగు సంస్థ ప్రత్యేకంగా పెద్దల కోసం ఇలాంటి వేడుక నిర్వహించడం అరుదైన విషయంగా చెప్పొచ్చు.

ఈ కార్యక్రమం కేవలం సన్మానానికి మాత్రమే పరిమితం కాలేదు. పెద్దల కోసం సంప్రదాయ ఆటలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసి, చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేశారు. వేసవి ఎండను దృష్టిలో పెట్టుకుని అతిథులకు చల్లని మజ్జిగ, పుచ్చకాయ ముక్కలు అందించగా, అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాల్లో పాల్గొని కుటుంబ వాతావరణాన్ని ఆస్వాదించారు.

ఈ సందర్భంగా తానా పాఠశాలలో తెలుగు భాష, సంస్కృతి నేర్చుకుంటున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. విదేశాల్లో పెరుగుతున్న పిల్లలకు మాతృభాషతో పాటు కుటుంబ విలువలను అందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పలువురు తల్లిదండ్రులు, పెద్దలు అభిప్రాయపడ్డారు.

తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. ఈ వేడుక విజయవంతం కావడానికి పులానీ జాస్తి, మాలతీ నాగభైరవ, వినయ్ మద్దినేని, శ్రీనివాస్ ఉప్పు, కోటి కందిమల్లు, చైతన్య కోరపాటి, మహేష్ కొప్పు, శ్రీను రామానందం, మురళి బొద్దు, రాజేష్ జంపాల, అనిల్ యలమంచాలి, శిరీష కాట్రగడ్డ, హరి అడ్డంకి, శరత్ పుట్టి, సంజీవ్ ఎక్కలూరి, ముఖర్జీ వేములపల్లి, విజయ మద్దిపట్ల, శ్రీధర్ వీ, సుజాత దేవరపల్లి, స్వప్నా యార్లగడ్డ, సుశ్మా కొర్రపాటి, తానా పాఠశాల అట్లాంటా కోఆర్డినేటర్ వాణి రెడ్డి తదితరులు విశేషంగా కృషి చేశారు.

సోహిని అయినాల స్వాగత ప్రసంగంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పులానీ జాస్తి, మాలతీ నాగభైరవ పెద్దలను ఆహ్వానించగా, మధుకర్ యార్లగడ్డ వాలంటీర్ల సేవలను కొనియాడారు. శేఖర్ కొల్లు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు.

నిర్వాహకుడు సునీల్ దేవరపల్లి మాట్లాడుతూ, “పెద్దలను గౌరవించడం అంటే మన మూలాలను గౌరవించినట్టే. వారితో గడిపే ప్రతి క్షణం కుటుంబ విలువలను తర్వాతి తరానికి చేరవేస్తుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం” అని తెలిపారు.

ఈ కార్యక్రమానికి బిర్యానీ పాట్, మన విందు, ఎపిక్ ఈవెంట్స్, మారుతి ఫుడ్స్, మిస్టిక్ ఫ్లేవర్స్, సాయిబాబు మద్దినేని, ఓమ్స్ క్లీనర్స్, ఇండిఫ్రెష్ సంస్థలు ఆర్థిక సహకారం అందించాయి. అలాగే యువ వాలంటీర్లు, మైత్రి కమ్యూనిటీ సభ్యులు విజు చిలువేరు మరియు వారి బృందం అందించిన సహకారాన్ని తానా ప్రత్యేకంగా అభినందించింది.

చివరగా శ్రీనివాస్ లావు మాట్లాడుతూ, “పెద్దలను ఒక రోజు సన్మానించడం కంటే, జీవితాంతం ప్రేమతో, గౌరవంతో చూసుకోవడమే నిజమైన భారతీయ సంస్కృతి” అని సందేశమిచ్చారు.
ఒక వేడుకతో ముగిసే కార్యక్రమం కాదు… కుటుంబ బంధాలను, తెలుగు సంస్కృతిని, తరాల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే సందేశాన్ని సమాజానికి అందించిన కార్యక్రమంగా తానా అట్లాంటా ఈ ప్రయత్నం నిలిచింది.
