Homeప్రవాస భారతీయులుTANA 23rd Mahasabalu : 23వ మహాసభలు : అంబరాన్నంటిని తానా సంబరాలు..

TANA 23rd Mahasabalu : 23వ మహాసభలు : అంబరాన్నంటిని తానా సంబరాలు..

TANA 23rd Mahasabalu : ప్రవాస తెలుగు వారంతా ఒక్కచోట చేరి పండుగ చేశారు. ఉత్తర అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరం పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో జులై 7,8,9వ తేదీలలో తానా 23వ మహాసభలు వైభవంగా జరిగాయి. మూడ్రోజుల పాటు ఆటపాటలు, ప్రముఖుల ప్రసంగాలతో ఈ వేడుకలు అందరినీ అలరించాయి. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతోపాటు సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్త నూతనపాటి వెంకట రమణ గారు, ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ గారు తదితరులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.

దశాబ్ద కాలంగా ఉత్తర అమెరికాలో ఎటువంటి తెలుగు సంస్థలకు హాజరుకానటువంటి రీతిలో మొదటి రోజు బాంకెట్ కార్యక్రమానికి సుమారు ఎనిమిది వేల మందితో మహాసభల కిక్ ఆఫ్ మొదలైంది. మరుసటి రెండు రోజులు ఇరవై వేల పై చిలుకు ప్రవాస తెలుగువారితో మహాసభల ప్రాంగణం అంతటా సందడి వాతావరణం నెలకొంది.

తొలి రోజు మొదలైన బాంకెట్ డిన్నర్ వేదికపై 23వ మహాసభల సావనీర్‌ను విడుదల చేశారు. ఈ క్రమంలోనే వెంకయ్య నాయుడు గారికి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, చైర్మన్ శ్రీనివాస్ లావు తదితరులు సన్మానం చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పలువురికి తానా ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు. ఆ తర్వాత ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణను కూడా తానా ప్రతినిధులు సత్కరించారు. ఆయన చేతుల మీదుగా పలువురికి తానా మెరిటోరియస్ అవార్డులను అందజేశారు. అదే వరుసలో తానా ప్రెసిడెన్షియల్ స్పెషల్ అవార్డులు, రికగ్నిషన్ అవార్డులు కూడా అందజేశారు.

ఇదే వేదికపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తెలంగాణ కేబినెట్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ నేత సీతక్క, హీరోయిన్ శ్రీలీల, కథానాయకుడు నిఖిల్ తదితరులను కూడా సత్కరించారు. ఈ క్రమంలోనే బాంకెట్, అవార్డ్ కమిటీ, ఆర్గనైజేషన్ల రికగ్నిషన్ కార్యక్రమం కూడా చక్కగా జరిగింది. ఆ తర్వాత కవీస్ స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌ విద్యార్థులు టాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఆ తరువాత కాప్రికో బ్యాండ్ తమ లైవ్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంది. చివర్లో ప్రముఖ నేపథ్య గాయని చిత్ర, సింహా, కౌసల్య తదితరులు తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు.

ఇక రెండో రోజు ఉదయాన్నే కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తానా నాయకులంతా పూజలు చేశారు. అనంతరం తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ బండ్ల హనుమయ్య ప్రసంగాలతో వేడుకలు మొదలయ్యాయి. తానా మహాసభల కోసం ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగ శాస్త్రి రచించిన ‘తెలుగు వైభవం’ పాటకు స్థానిక నృత్య పాఠశాలలకు చెందిన విద్యార్థులంతా కలిసి అద్భుతమైన నాట్యం చేశారు. అనంతరం జొన్నవిత్తులను తానా నేతలు సత్కరించారు. అక్కడి నుంచి ఒకదాని తర్వాత మరొకటిగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఆ తర్వాత ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ ఎస్, ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ప్రైమ్ హాస్పిటల్స్ వ్యవస్థాకులు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ (టాటా) వ్యస్థాపకులు పైళ్ల మల్లారెడ్డి తదితరులకు తానా నాయకులు సన్మానం చేశారు. రంగ రంగ వైభవంగా ఫ్యాషన్ షో కూడా ప్రేక్షకులను అలరించింది. అనంతరం ఆధ్యాత్మిక జీవితం గురించి, మనం చేసే పొరపాట్ల గురించి సద్గురు జగ్గీ వాసుదేవ్ అద్భుతంగా వివరించారు. ఇదే క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును తానా నేతలు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు. చివర్లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ అండ్ టీం మ్యూజికల్ కాన్సర్ట్ కూడా అందరినీ అలరించింది.

మూడో రోజు వేడుకలు కూడా ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సాంస్కృతిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ ఆటపాటలు, కళానైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ధీంతానా బృందాన్ని తానా నేతలు సత్కరించారు. అనంతరం వేదమంత్రాల నడుమ సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీ రమణకు ఘనసత్కారం చేశారు. ఆయన ప్రసంగంలో తానా సేవలను చాలా మెచ్చుకున్నారు. అనంతరం సీనియర్ నటులు మాగంటి మురళీ మోహన్ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు చేసిన సేవలను గుర్తిస్తూ తానా-ఎన్టీఆర్ అవార్డుతో ఆయన్ను గౌరవించారు. ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ ఈ అవార్డును అందజేశారు. భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్ల గారిని కూడా తానా లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డుతో గౌరవించింది. అనంతరం రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులను కూడా తానా నేతలు ఈ వేదికపై సత్కరించారు. ఆ తర్వాత తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ప్రసంగించారు. అనంతరం బాలకృష్ణ దంపతులను తానా నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా తానా సేవలను బాలకృష్ణ కొనియాడారు. అనంతరం సంగీత రారాజు మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా మ్యూజికల్ నైట్ కార్యక్రమం తెలుగు సంగీత ప్రేమికులను మంత్రముగ్ధులను చేసింది.

ఇతర గదుల్లో ధీంతానా పాటల, నృత్య పోటీలు, అగ్రికల్చరల్ ఫోరమ్, జొన్నవిత్తుల ఆధ్వర్యంలో భుజనశతకం, ఎన్నారై మీట్స్, ఐటీ సర్వ్ అలయన్స్ మీట్ అండ్ గ్రీట్, వివిధ అంశాలపై చర్చలు, మాట్రిమొనీ, పాఠశాల కాంపిటీషన్, సీనియర్ సిటిజన్ ఫోరమ్, రీల్స్ అండ్ షార్ట్ ఫిలిం పోటీలు, టీటీడీ శ్రీనివాస కల్యాణం, ఉమెన్స్ ఫోరమ్, యూత్ యాక్టివిటీస్ తదితర కార్యక్రమాలు కూడా ఉత్సాహంగా జరిగాయి.

తానా సభల చివరి రోజునే అధ్యక్షులు అంజయ్య చౌదరి పదవీ కాలం కూడా ముగిసింది. ఈ క్రమంలో నూతన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు ఈ వేదికపైనే ప్రమాణం చేశారు. ఆయన 2023-2025 వరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా మహాసభలను విజయవంతం చేసిన ఆయా కమిటి సభ్యులందరినీ వేదిక పైకి ఆహ్వానించి మహాసభల ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఏమైనా అసౌకర్యాలు జరిగి ఉంటే, తమని మన్నించాలి అని, అక్కడకు విచ్చేసిన ప్రవాస తెలుగువారిని మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి కోరేరు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular