America
America: అమెరికాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ తెలుగు యువకుడ్ని ఏడు నెలల పాటు చిత్రహింసలు పెడుతూ ముగ్గురు యువకులు పైశాచిక ఆనందం పొందారు. అయితే హింసిస్తున్న ఆ ముగ్గురు కూడా తెలుగు వారే కావడం గమనార్హం. అయితే అందులో ప్రధాన నిందితుడు వైసిపి నేతగా చలామణి కావడం చర్చకు దారితీసింది.ప్రస్తుతం ఆ ముగ్గురు యువకులను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువకుడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
సెయింట్ లూయిస్ నగరంలో ఓ రెస్టారెంట్ లో తెలుగు యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అమెరికా పౌరుడు ఒకరు బాధిత యువకుడ్ని ప్రశ్నించారు. ఏమైనా సమస్య ఉంటే తనకు ఫోన్ చేయాలని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ తరువాత రోజే బాధితుడు సదరు వ్యక్తికి వాట్సాప్ ద్వారా సమాచారం అందించాడు. ఓ ముగ్గురు యువకులు తన పట్ల పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారని తన బాధను వ్యక్తం చేశాడు. బాధితుడి పరిస్థితిని చూసి చలించి పోయిన ఆ వ్యక్తి అమెరికా పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఆ నివాసాన్ని చుట్టుముట్టిన పోలీసులకు ఆ ముగ్గురు యువకులు చుక్కలు చూపించారు. ఇంటి లోపలికి అనుమతించలేదు. దీంతో బాధిత యువకుడు అతి కష్టం మీద ఇంటి నుంచి బయటకు వచ్చి.. కాపాడాలని పోలీసులను వేడుకున్నాడు. ఆ ముగ్గురి అరాచకాలను బయటపెట్టాడు.
సత్తారు వెంకటేష్ రెడ్డి అనే యువకుడు పెనుమత్స నిఖిల్, శ్రవణ్ పెనుమచ్చలు మరో ఇద్దరితో కలిసి ఓ ఇంట్లో నివాసం ఉండేవారు. ఈ నేపథ్యంలో ఈ బాధిత యువకుడు ఏప్రిల్ లో వీరి వద్దకు చేరినట్లు తెలుస్తోంది.ఆ ముగ్గురు యువకులునిత్యం బాధిత యువకుడిపై దాడి చేసేవారు. మానసికంగా హింసించేవారు. ప్రతిరోజు పివిసి పైపులు, ఇనుప రాడ్లు, విద్యుత్ వైర్లతో కొట్టేవారు. ఆ బాధను తట్టుకోలేక బాధితుడు ఏడుస్తుంటే పైశాచిక ఆనందం పొందేవారు. వారి చర్యలతో బాధితుడు నుదుటి నుంచి పాదాల వరకు శరీరంపై గాట్లు, గాయాలు అయ్యాయి. చివరకు పక్కటెముకులతో పాటు శరీరంలో పలుచోట్ల ఎముకలు కూడా విరిగిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ప్రధాన నిందితుడు వెంకటేష్ రెడ్డి విపరీతమైన వికృత చేష్టలతో బాధితుడుపై నిత్యంచేయి చేసుకునేవాడట.దీంతో బాధితుడు ఏడు నెలల కాలంలో 30 కిలోల బరువు తగ్గాడని పోలీసులు చెబుతున్నారు.అయితే బాధిత యువకుడు ఎలా వచ్చాడు? ఈ దారుణ హింసకు గల కారణాలు ఏంటి? అన్న కోణంలో అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే ప్రధాన నిందితుడు వెంకటేష్ రెడ్డి వైసిపి నేతగా చలామణి అవుతున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారని తెలుస్తోంది.