Gujarati woman Kiran Patel: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులపై దారుణాలు పెరుగుతున్నాయి. ప్రవాస భారతీయులపై హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే ఓ వ్యక్తి తల నరికిన ఘటన వెలుగు చూసింది. కాల్పులు కామన్ అయ్యాయి. తాజాగా, నార్త్ కరోలినాలోని యూనియన్ కౌంటీలో 49 ఏళ్ల గుజరాతీ మహిళ కిరణ్ పటేల్ దోపిడీ ప్రయత్నంలో హత్యకు గురైంది. ఈ దారుణ హత్య మూడు రోజుల క్రితం జరిగింది. సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డు అయింది.
ఏం జరిగిందంటే..
కిరణ్ పటేల్ సౌత్ పింక్‌నీ స్ట్రీట్‌లోని డీడీ ఫుడ్ మార్ట్‌ను నిర్వహించేది. 21 ఏళ్ల యువకుడు స్టోర్‌ను దోచుకునేందుకు ప్రయత్నించాడు. కిరణ్ ప్రతిఘటించడంతో అతను తుపాకీతో కాల్పులు జరిపాడు. రాత్రి 10:30 గంటలకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు కిరణ్ పార్కింగ్ లాట్‌లో గుండెల్లో తూటాలతో అపస్మారక స్థితలో కనిపించింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అక్కడికి చేరేలోపే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఎవరీ కిరణ్ పటేల్..
కిరణ్ ఒక కష్టపడి పనిచేసే, ఉల్లాసమైన మహిళ. ఆమె స్టోర్ యూనియన్ కౌంటీలో స్థానికులకు సుపరిచితం. ఆమె దుర్మరణం స్థానిక సమాజంలో దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించింది. హత్య ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. అయితే నిందితుడు ముఖానికి మాస్క్ ధరించినప్పటికీ, అతను పోలీసులకు దొరికాడు. యూనియన్ పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనపై తీవ్రంగా విచారణ జరుపుతోంది. నిందితుడు ఘటనా స్థలం నుండి పరారైనప్పటికీ, అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: 24 గంటల్లో నాలుక మడతపెట్టిన ట్రంప్.. హెచ్–1బీ వీసా ఫీజులో మార్పు.. అసలేమైంది?
ప్రవాస భారతీయుల భద్రతపై ఆందోళన
ఈ ఘటన అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతి వ్యాపారుల భద్రతపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది. స్థానిక అధికారులు ఇలాంటి ఘటనల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కమ్యూనిటీ నాయకులు కోరుతున్నారు. కిరణ్ పటేల్ హత్య అమెరికాలో ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేస్తోంది.