US Visa: అమెరికా వెళ్లాలనుకునే వారికి శుభవార్త.. 2.5 లక్షల వీసా స్లాట్లు రెడీ..

అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు, నిరుద్యోగులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఇప్పటికే 12 లక్షల మంది అమెరికా వెళ్లారు. మరో మారు వీసా స్లాట్లను ప్రకటించింది.

Written By: Raj Shekar, Updated On : October 1, 2024 11:21 am

US Visa

Follow us on

US Visa: అమెరికా వెళ్లాలి.. డాలర్‌ డ్రీమ్‌ నెరవేర్చుకోవాలని కలలు కనేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఒకప్పుడు సంపన్నులకే పరిమితమైన అమెరికా పర్యటన.. ఇప్పుడు మిడిల్‌ క్లాస్‌కు చేరువైంది. చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. దీంతో అమెరికాలో భారతీయుల జనాభా భారీగా పెరుగుతోంది. 2024లో ఇప్పటి వరకు 12 లక్షల మంది అమెరికా వచ్చినట్లు ఆ దేశ ప్రతినిధులు తెలిపారు. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 35 శాతం పరిగినట్లు పేర్కొన్నారు. వీసాల కోసం పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థుల భారత్‌ నుంచి డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయులకు అదనంగా మరో 2.5 లక్షల వీసా స్లాట్లు కేటాయించింది.

60 లక్షల మంది నాన్‌ ఇమిగ్రేషన్లు..
ఇక అమెరికా సందర్శనకు వెళ్తున్న నాన్‌ ఇమిగ్రేషన్‌ హోల్డర్లు కూడా క్రమంగా పెరుగుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 60 లక్షల మంది భారతీయులు అమెరికా సందర్శనకు నాన్‌ ఇమిగ్రేషన్‌ వీసాపై వెళ్లారు. పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థులు వీసాల కోసం భారీగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కొత్తగా 2,50,000 వీసా స్లాట్లను కేటాయించింది. మరో నెల రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు ఉండడం, భారతీయ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

మోదీ పర్యటన తర్వాత..
ఇదిలా ఉంటే.. భారత ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలే మూడు రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు. ఈ నేపథ్యంలో భారత్‌కు 2.5 లక్షల అదనపు వీసా స్లాట్లు మంజూరయ్యాయి. యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెట్టి మాట్లాడుతూ ఇండియా యూఎస్‌ మిషన్‌లో భాగంగా గడిచిన రెండేళ్లలో పది లక్షల మంది నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వేసవిలో స్టూడెంట్‌ వీసాలను రికార్డుస్థాయిలో ప్రాసెస్‌ చేసినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యాపారం సులభతరం చేయడానికి, పర్యాటకాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇరు దేశాల మధ్య వీసా ప్రక్రియను మెరుగు పర్చాలని, వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇండియా నుంచి అమెరికా రావాలనుకుంటున్న వారి డిమాండ్‌ మేరకు పనిచేస్తున్నామని తెలిపారు.

నాలుగింట ఒకవంతు భారతీయులు..
ఇక అమెరికా విడుదల చేస్తున్న వీసాల్లో నాలుగింట ఒక వంతు మంది భారతీయులే అమెరికా వెళ్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో విడుదల చేసిన లెక్కల ప్రకారం.. 2022 అక్టోబర్‌ నుంచి 2023 సెప్టెంబర్‌ వరకు జారీ చేసి 6 లక్షల స్టూడెంట్‌ వీసాలలోనూ నాలుగింట ఒక శాతం భారతీయులే ఉన్నారు. ఇక సందర్శకులు వీసా అపాయింట్‌మెంట్‌ సమయాన్ని 75 శాతానికి తగ్గించారు.