Australia Study : ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. అమెరికా తర్వాత చాలా మంది కెనడా, ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. భారత దేశం నుంచి కూడా ఎక్కువ మంది విద్యార్థులు అమెరికా తర్వాత ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఏటా ఆస్ట్రేలియాకు వలస వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో వలసలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులపై కీలక నిర్ణయం తీసుకుంది.
బ్యాంకు బ్యాలెన్స్ లిమిట్ పెంపు..
వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో విదేశీ విద్యార్థుల కనీస బ్యాంకు బాలెన్స్ మొత్తాన్ని 29,710 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచింది. అంటే మన కరెన్సీలో అది సుమారు రూ.16,35,000. ఈ నిబంధన మే 10వ తేదీ నుంచి అమలులోకి తెస్తున్నట్లు ఆదేశం ప్రకటించింది. గడిచిన ఏడు నెలల్లో విద్యార్థుల బ్యాంకు బ్యాలెన్స్ లిమిట్ పెంచడం ఇది రెండోసారి. ఆస్ట్రేలియా సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులకు భారంగా మారనుంది.
నివాసానికి అయ్యే ఖర్చు మొత్తం..
ఇక ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులు అక్కడ ఏడాది నివాసానికి అయ్యే ఖర్చుల మొత్తాన్ని తమ ఖాతాలో ఉన్నట్లు చూపెట్టాలని ఆస్ట్రేలియా సర్కార్ నిర్ణయించింది. వీసా డిజాపిట్ కనీస పరిమితి గతంలో 21,041 ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉండేది. గతేడాది అక్టోబర్‌లో దీనిని 24,505 డాలర్లకు పెంచారు. తాజాగా దానిని 29,710 డాలర్లకు పెంచుతున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఇది 19,576 అమెరికన్ డాలర్లకు సమానం.