https://oktelugu.com/

భారత్ -అమెరికా దేశాల వ్యవస్థలు,రాజకీయాలు

భారత్ , అమెరికాలు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు. ఒకటి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పూర్తి ప్రజాస్వామ్య రిపబ్లిక్ దేశమయితే, రెండోది అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశం. రెండూ కూడా వైవిధ్యభరిత దేశాలే. అమెరికా దాదాపుగా వలసవాదుల దేశమయినా ఇటీవలి కాలంలో వలసలను కట్టడి చేసే పనిలో వుంది. భాషాపరంగా అత్యధికులు ఇంగ్లీష్ మాట్లాడగలిగినా, ఇంటి భాష వచ్చేసరికి దాదాపు 20 శాతం మంది ఇతర భాషలు మాట్లాడతారు. అదే జాతిపరంగా చూస్తే మూడింట రెండువంతులు […]

Written By:
  • Ram
  • , Updated On : September 1, 2020 / 08:17 AM IST
    Follow us on

    భారత్ , అమెరికాలు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు. ఒకటి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పూర్తి ప్రజాస్వామ్య రిపబ్లిక్ దేశమయితే, రెండోది అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశం. రెండూ కూడా వైవిధ్యభరిత దేశాలే. అమెరికా దాదాపుగా వలసవాదుల దేశమయినా ఇటీవలి కాలంలో వలసలను కట్టడి చేసే పనిలో వుంది. భాషాపరంగా అత్యధికులు ఇంగ్లీష్ మాట్లాడగలిగినా, ఇంటి భాష వచ్చేసరికి దాదాపు 20 శాతం మంది ఇతర భాషలు మాట్లాడతారు. అదే జాతిపరంగా చూస్తే మూడింట రెండువంతులు తెల్లజాతీయులే. 13 శాతం పైగా వున్న నల్ల ( ఆఫ్రికన్ అమెరికన్ల) జాతీయులతో సామాజిక ఘర్షణలు నడుస్తూనే వుంటాయి. ఇక భారత్ లో చూస్తే ఏ ఒక్క భాష పూర్తి ఆధిపత్యంలో లేదు. అన్నింటిలోకి ఎక్కువమంది మాట్లాడే హిందీ భాష 43 శాతం మంది మాత్రమే.  జాతిపరంగా అందరూ భారతీయులే అయినా వివాహ సంబంధాలు కులం, మతం, భాష, ప్రాంతం ఆధారంగానే వుంటాయి. ఇక మతపరమైన విభజన చూస్తే అమెరికాలో నూటికి 70 మంది క్రైస్తవ మతాన్ని పాటిస్తారు. విశేషమేమంటే రెండో అతి పెద్ద వర్గం ఏ మతానికి అనుబంధం కాని వాళ్ళు, షుమారు  23 శాతం మంది వుంటారు. అదే భారతదేశానికి వచ్చేసరికి హిందువులు 75 శాతం మంది వుంటారు. రెండో అతిపెద్ద మతస్తులు ముస్లింలు షుమారు 15 శాతం మంది వుంటారు. అమెరికాలో మతపరమైన ఘర్షణలకు ఆస్కారం లేదు. కాకపోతే అందులో ప్రొటెస్టెంట్లు, కాథలిక్కులు, మర్మన్లు గా విడిపోయి వుంటారు. అదే భారత్ లో మతపరమైన ఘర్షణలు జరుగుతూనే వుంటాయి. అసలు దేశమే మతపరంగా రెండు ముక్కలయ్యింది. స్థూలంగా రెండుదేశాల స్వరూపమిది.

    Also Read : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను కాలదన్నుతున్నారు

    రెండు దేశాల వ్యవస్థలు ఎలా వున్నాయి?

    ఇంతకుముందే చెప్పినట్లు రెండూ ప్రజాస్వామ్య దేశాలే. రెండూ బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందిన దేశాలే. భావ స్వేచ్చ, వ్యక్తి స్వేచ్చ, మత స్వేచ్చ ప్రాధమిక హక్కులుగా కలిగిన దేశాలు. రెండు వ్యవస్థల్లోనూ రాష్ట్రాలకు చాలా అంశాల్లో పూర్తి స్వేచ్చ వుంది. ముఖ్యంగా శాంతి భద్రతలు, విద్య, ఆరోగ్యం లాంటి సామాజిక అంశాలు రాష్ట్రాల పరిధిలోనే వుంటాయి. దీనికి రెండు దేశాల్లో చారిత్రక కారణాలే కారణం.  అమెరికా స్వాతంత్ర ప్రకటన 13 బ్రిటీష్ కాలనీలు కలిసి ఏర్పాటుచేసుకున్నాయి. అందుకే ఈ కాలనీల ( తదుపరి రాష్ట్రాలు ) హక్కులకు ప్రాధాన్యమిచ్చారు. అలాగే భారత్ కి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటీష్ ఇండియా భూభాగంతో పాటు 560 కి పైగా స్వతంత్ర రాజ్యాలు, సంస్థానాలు విలీనమయ్యాయి. వీటి హక్కులను, ప్రత్యేకతలను గుర్తిస్తూ రాష్ట్రాలకు ప్రాధాన్యమిచ్చారు. కాబట్టి రెండు దేశాలు జాతీయంగా కేంద్రీకృతమైనా ఫెడరల్ స్వభావాన్ని కలిగి వున్నాయి.

    పరిపాలనాపరంగా చూస్తే అమెరికా విస్తృత అధికారాలు కల్గిన అధ్యక్ష వ్యవస్థతో పాటు శాసన వ్యవస్థ కలిగి వుంది. భారత్ పార్లమెంటరీ వ్యవస్థతో పనిచేస్తూ కేవలం నామమాత్ర అధ్యక్ష వ్యవస్థ కలిగి వుంది. అమెరికాలో అధ్యక్ష పదవికి నాలుగు సంవత్సరాల కొకసారి ప్రత్యక్షఎన్నికలు జరుగుతాయి. ఎన్నికైన రాష్ట్రాల ప్రతినిధులు అధ్యక్షుడ్ని ఎన్నుకుంటారు. అదే భారత్ లో పరోక్ష ఎన్నికల్లో అయిదు సంవత్సరాలకొకసారి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇక శాసన వ్యవస్థ చూస్తే రెండు దేశాల్లోనూ రెండు సభల వ్యవస్థ వుంది. కాకపోతే అమెరికా ప్రతినిధుల సభకు రెండేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. అదే మన లోక్ సభకు అయిదేళ్ళకొకసారి జరుగుతాయి. మన లోక్ సభ ఎవరికీ మెజారిటీ లేకపోతే రద్దుచేసి మధ్యంతర ఎన్నికలు జరపవచ్చు. అక్కడ అటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా రెండేళ్ళ కాలపరిమితి వుంటుంది. అమెరికా సెనేట్ కు మన రాజ్య సభకు పోలికలు , తేడాలు వున్నాయి. అక్కడ పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రానికి రెండే సెనేట్ సీట్లు వుంటాయి. కానీ మనకు రాష్ట్ర జనాభాని బట్టి సీట్లు కేటాయించారు. రెండు సభలూ శాశ్వత సభలే , రద్దు కావు. రెండింటిలోనూ సభ్యునికి ఆరేళ్ళ కాల పరిమితి వుంటుంది. ప్రతి రెండు సంవత్సరాలకు మూడింట ఒక వంతు మంది పదవీ విరమణ చేస్తారు. అయితే అధికారాల్లో తేడావుంది. అధ్యక్షుడి క్యాబినెట్ పదవులు, న్యాయమూర్తుల నియామకాలు ఇతర ముఖ్యమైన పదవులు అధ్యక్షుడి నియామకం తర్వాత సెనేట్ ఆమోదించాల్సి వుంటుంది. ప్రతినిధుల సభకు సంబంధం లేదు. అంటే సెనేట్ కీలకమైన సభగా చెప్పొచ్చు. మిగతా అధికారాలు సమానమే. అదే మన రాజ్య సభ కు ద్రవ్య బిల్లుల్లో లోక్ సభ తో సమాన అధికారాలు లేవు. మిగతా అధికారాలు సమానమే. ఇంకో ప్రధాన తేడా. అక్కడ సెనేటర్లు రాష్ట్రాలనుంచి ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. అదే మన రాజ్య సభ సభ్యుల్ని రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు  ఎన్నుకుంటారు. అమెరికాలోనూ ఒకనాడు రాష్ట్ర అసెంబ్లీ సభులే ఎన్నుకునే వారు. తర్వాత దశలో ప్రజాస్వామ్యాన్ని  మరింత బలపరిచే దిశలో భాగంగా ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇంకో తేడా ఏమిటంటే అమెరికాలో ప్రతి రాష్ట్రానికి రెండు శాసన వ్యవస్థలు వున్నాయి. మనకి శాసన మండలి కొన్ని రాష్ట్రాల్లోనే వుంది. దీనికి ఒక విధానమంటూ లేదు. అలాగే అక్కడ రాష్ట్ర గవర్నర్ ని ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. కానీ మన దగ్గర ముఖ్యమంత్రిని పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. దానితోపాటు మన దగ్గర కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్రాలకు గవర్నర్ వుంటారు.  ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అమెరికా ఎన్నికల గురించి తెలుసుకునేముందు స్థూలంగా అక్కడ పరిపాలనా స్వరూపం కూడా తెలిసివుంటే మరింతగా ఎన్నికల విశ్లేషణ అర్ధమవుతుంది. రెండోది అక్కడి వ్యవస్థలోని కొన్ని మంచి అంశాలు ప్రజాస్వామ్యం బలపడటానికి మనమూ ఆచరించవచ్చు.

    Also Read : దేశంలో ఘోరమైన విపత్తు.. భారీ ఆర్థిక ముప్పు?

    రాజకీయ వ్యవస్థలు, పార్టీలు ఎలా వున్నాయి?

    అమెరికాలో రెండు పార్టీల వ్యవస్థ నెలకొనివుంది. అంటే మిగతా వాళ్ళు పోటీ చేయకూడదని నిషేదమేమీ లేదు, ఇప్పటికీ ఎన్నో పార్టీలు, వ్యక్తులు పోటీ చేస్తూనే వుంటారు. కాకపోతే గెలవటం అంత తేలికేమీ కాదు. భూ విస్తీర్ణ పరంగా అతి పెద్ద దేశం. అప్పట్లో అంత దూరం తిరగటానికి, ప్రచారం చేయటానికి నిధులు అందరికీ కష్టం. కాబట్టి రెండు పార్టీలలో సమీకృత మయ్యారు. ఇప్పుడు టివీ లు వచ్చిన తర్వాత ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. అయినా ప్రచారానికి, ప్రకటనలకి లక్షల డాలర్ల ఖర్చు అవుతుంది. అదే మన భారతదేశంలో అధ్యక్షునికి, గవర్నర్లకి ప్రత్యక్ష ఎన్నికలు లేవు పార్లమెంటు, అసెంబ్లీ లో ఎవరికి  మెజారిటీ సభ్యుల మద్దత్తు వుంటే వారు ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడుతున్నారు. కాబట్టి ఇక్కడ బహుళ పార్టీ వ్యవస్థకు అవకాశాలు వున్నాయి.

    ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు , ప్రతినిధుల సభ ఎన్నికలు, మూడింట ఒకవంతు సెనేట్ ఎన్నికలు నవంబర్ 3న జరగబోతున్నాయి. ఇందులో రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ లు పోటీ పడుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ మద్దత్తు ప్రధానంగా తూర్పు, పశ్చిమ కోస్తా ప్రాంతాల్లో అలాగే నగర ప్రాంతాల్లో వుంది. డెమోక్రటిక్ పార్టీ కి తెల్ల జాతీయుల తో పాటు నల్ల జాతీయులు, ఇస్పానిక్కులు, ఆసియా మూలాల దేశీయులు మద్దతిస్తున్నారు. అదే రిపబ్లిక్ పార్టీ కి మధ్య అమెరికా ప్రాంతాలు, గ్రామీణ , సెమి అర్బన్ ప్రాంతాలు మద్దతిస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీకి ప్రధానంగా తెల్ల జాతీయుల మద్దత్తు మాత్రమే వుంది. మిగతా వారి మద్దత్తు నామమాత్రంగానే వుంది. మొట్టమొదటిసారి భారతీయులు రెండుగా గణనీయంగా చీలే అవకాశముంది. కానీ మనవాళ్ళు ఎన్నికల్ని ప్రభావితం చేసే పరిస్థితి లేదు. శ్వేత జాతీయేతర్ల లో ఇస్పానిక్కుల్లో ఓ మేరకు రిపబ్లికన్ పార్టీ చీల్చుకొనే అవకాశముంది. ఇంకో ప్రధానమైన విషయం , పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం. ఈ రెండు పార్టీల తరఫున పోటీచేసే అధ్యక్ష అభ్యర్ధులను ఆ పార్టీ సభ్యులే అంతర్గత ఎన్నిక ద్వారా నిర్ణయిస్తారు.

    మరి భారత్ లో చూస్తే ప్రధాన పార్టీ అయిన బిజెపి హిందీ ప్రాంతాలు, పశ్చిమ ప్రాంతాల్లో బలంగా వుండేది. అలాగే ఒకనాడు నగర ప్రాంతాలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు హిందీ యేతర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ చొచ్చుకు పోయింది. అలాగే బిజెపి ప్రధానంగా హిందువుల వోట్ల మద్దత్తు తోనే వుంది. ముస్లిం, క్రైస్తవుల్లో నామ మాత్ర మద్దత్తునే చూరగొంది. అదే కాంగ్రెస్ ఒకనాడు విస్తృత ప్రాంతాల్లో వున్నా ప్రస్తుతం దాని ప్రభావం పరిమితంగానే వుంది. కాకపోతే దాని ఓటర్లు అన్ని మతాల్లోనూ సమానంగా వున్నారు. ఒకవిధంగా ప్రస్తుతం దేశంలో బిజెపి కి సమవుజ్జీ పోటీ ఇచ్చే పార్టీ లేదు. ఆ లోపం ప్రస్ఫుటంగా కనబడుతుంది.

    ఇవీ స్థూలంగా భారత్ , అమెరికా వ్యవస్థల మధ్య వున్న సామిప్యాలు, వైరుధ్యాలు. కాబట్టి మక్కికి మక్కీగా అక్కడకి, ఇక్కడకీ రాజకీయాల్లో పోల్చుకొని చూడలేము. ఈ నేపధ్యాన్ని గమనం లో వుంచుకొని అమెరికా ఎన్నికల వాతావరణాన్ని పరిశీలిద్దాం. మన భారతీయ అమెరికన్ల ఆలోచనలు, భారత-అమెరికా సంబంధాలు ఈ ఎన్నికలకు ఏ విధంగా ముడిపడి వున్నాయో వచ్చే వ్యాసంలో పరిశీలిద్దాం.

    Also Read : తెలంగాణ చారిత్రక సౌధం.. కరిగిపోతోందా?