America: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా హరియాణాకు చెందిన శ్రేయాస్‌రెడ్డి బెనిగెరి ఓహియోలోని సిన్సినాటిలో మరణించాడు. ఆయన మరణానికి కారణాలు తెలియడం లేదు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
బిజినెస్ స్కూల్‌లో చదువు..
శ్రేయాస్ లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుతున్నాడు. అతడి మృతిపై న్యూయార్క్‌లోని భారతీయ కార్యాలయం సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది. పోలీసులు మరణంపై దర్యాప్తు చేస్తున్నారని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వారం వ్యవధిలో..
వారం వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. జనవరి చివరి వారంలో సైనీ అనే విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇండియానా రాష్ట్రంలోని ఫర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న నీల్ ఆచార్య కూడా ఇటీవల మరణించాడు. అతని తల్లి గౌరి జనవరి 30న తన కొడుకు అమెరికాలోని ఫర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్నాడని జనవరి 28 నుంచి కనిపించడం లేదని, ఎవరిని అడిగినా సమాధానం చెప్పడం లేదని తెలిస్తే సహాయం చేయాలని ఎక్స్‌లో మెస్సేజ్ పెట్టింది. తర్వాత కొన్ని గంటలకే వెస్ట్ లాఫాయెట్‌లోని 500 అల్లిసన్ రోడ్‌లో మృతదేహాన్ని గుర్తించారు. తాజాగా శ్రేయాస్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వరుస మరణాలు అమెరికాలో నివసిస్తున్న భారతీయ కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది.