Andhra University Alumni Meet : ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి అమెరికాలో కలిశారు. తమ మూలాలు మరిచిపోకుండా తాము చదివిన వర్సిటీ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పూర్వ విద్యార్థులు అనుభూతులు పంచుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థులు అమెరికా గడ్డపై తొలిసారిగా ఓ ప్రత్యేక సమావేశంలో కలుసుకుని, తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తానా 24వ మహాసభలో భాగంగా తానా ఎన్ఆర్ఐ స్టూడెంట్ కోఆర్డినేటర్ డా. ఉమా ఆర్. కటికి (ఆరమండ్ల) గారు ప్రత్యేక చొరవతో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశం అశేష పూర్వ విద్యార్థుల సమక్షంలో అత్యంత ఉత్సాహంగా, విజయవంతంగా ముగిసింది.

ఈ ప్రత్యేక కార్యక్రమంలో అనేక మంది ప్రముఖ పూర్వ విద్యార్థులు హాజరై సందడి చేశారు. వారిలో ముఖ్యంగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ – సోంగు, తానా ప్రెసిడెంట్ నరేన్ కొడాలి, తానా కాన్ఫరెన్స్ ఛైర్మన్ గంగాధర్ నాదెళ్ల, తానా ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రసాద్ నల్లూరి, తానా మాజీ ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, న్యూక్లియర్ ఫిజిక్స్ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. భాస్కర్ కటికి, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ విజయ్ గుడిసేవ, డా. వాసుబాబు గోరంట్ల (ఇంజనీరింగ్) , తెలుగు విభాగం నుండి డా. గీతా మాధవి, ఈ ఈవెంట్ కో ఆర్డినేటర్ మరియు తానా ఎన్ఆర్ఐ స్టూడెంట్ కోఆర్డినేటర్ డా. ఉమా ఆర్. కటికి (ఆరమండ్ల) వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ సజావుగా జరగడానికి డా.ఉమా గారికి సతీష్ మేక, ప్రదీప్ చందనం, మరియు రాంప్రసాద్ చిలుకూరి సహకారం అందించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా తమ కళాశాల రోజుల జ్ఞాపకాలను ఒకరినొకరు పంచుకుంటూ ఆనందంలో మునిగి తేలారు.ముఖ్య అతిథులను డా. ఉమా. ఆర్. కటికి (ఆరమండ్ల) మరియు అంజయ్య చౌదరి లావు ఘనంగా సన్మానించారు.

ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, ఇంజినీరింగ్ కాలేజీతో పాటు అనుబంధ కళాశాలల నుండి కూడా అనేకమంది పూర్వ విద్యార్థులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారంతా ఒకే వేదికపై కలుసుకోవడం, తమ అనుభవాలను పంచుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది.

ఈ సందర్భంగా డా. ఉమా గారు పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ “ఏప్రిల్ 2026లో జరగనున్న శతాబ్ది ఉత్సవాలకు తప్పకుండా హాజరై, విశ్వవిద్యాలయానికి మీ మద్దతును అందించాలి” అని పిలుపునిచ్చారు.

భారతదేశం నుండి ప్రత్యేకంగా తెప్పించిన స్వీట్స్, స్నాక్స్ మరియు కొబ్బరి నీళ్ళను అందరూ ఆనందిస్తూ, ఈ సమ్మేళనాన్ని చిరకాలం గుర్తుండిపోయేలా చేసుకున్నారు.

ఈ సమావేశం ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల మధ్య బంధాలను మరింత పటిష్టం చేసిందని చెప్పడంలో సందేహం లేదు.




సన్మానం అందుకుంటున్న Dr. Geetha Madhavi గారు

కార్యక్రమంలో మాట్లాడుతున్న Dr .Bhaskar Katiki గారు
