Australia: ఆస్ట్రేలియాలో జరిగిన అనుకోని ప్రమాదంలో తెలుగు వైద్యురాలు దుర్మరణం చెందింది. ఈ విషాధ ఘటన మార్చి 2న జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) మార్చి 2న ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ హింటర్ ల్యాండ్‌లోని లామింగ్టన్ నేషనల్ పార్క్‌కు స్నేహితులతో కలిసి వెళ్లారు. అక్కడి యాన్ బాకూచి జలపాతం వద్ద ఫొటోలు తీస్తుండగా జారిపడి మరణించింది.
గతేడాది మెడిసిన్ పూర్తి..
వేమూరు ఉజ్వల గతేడాది గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేశారు. స్నేహితులతో కలిసి పిక్నిక్ వెళ్లిన ఉజ్వల జలపాతం వద్ద ఫొటోలు తీస్తున్న సమయంలో ఆమె కెమెరా ట్రైపాడ్‌ను ఒక అంచుపై పడింది. దానిని తీసుకునే ప్రయత్నంలో కాలు జారి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందింది. సమాచారం అందుకున్న అక్కడి రెస్క్యూ సిబ్బంది ఉజ్వల మృతదేహాన్ని ఆరుగంటలు శ్రమించి వెలికి తీశారు.
ఊహించని ప్రమాదం
ఉజ్వల తల్లిదండ్రులు వేమూరి మైథిలి, వెంకటేశ్వరరావు. వీరు ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. డాక్టర్ కావాలని ఉజ్వల చిన్ననాటి కల. ఆమె కలను నెరవేర్చేందుకు డాక్టర్ చదివించారు. ఏడాది కాలంగా ఉజ్వల రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. మరోవైపు పీజీ కూడా పూర్తి చేసి ఉన్నతస్థాయికి చేరుకోవాలనేది ఆమె లక్ష్యం. కానీ ఇంతలో అనుకోని ప్రమాదంలో ఉజ్వల దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదుగుతుందని అనుకున్న కూతురు ఊహించని ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఉజ్వల మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ వారి ఇంటికి తీసుకొస్తున్నారు.