https://oktelugu.com/

Pawan Kalyan: పొత్తు కోసం ఎంపీ సీటును త్యాగం చేసిన పవన్

గత రెండు రోజులుగా చంద్రబాబుతో పాటు పవన్ ఢిల్లీలోనే ఉన్నారు. వరుసగా బిజెపి అగ్ర నేతలతో సమావేశం అయ్యారు. పొత్తులపై కీలక చర్చలు జరిపారు. అయితే 12 అసెంబ్లీ స్థానాలు, 8 వరకు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని బిజెపి కోరినట్లు ప్రచారం జరిగింది.

Written By: , Updated On : March 9, 2024 / 05:51 PM IST
Pawan Kalyan

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: పవన్ అనుకున్నది సాధించారు. బిజెపితో తెలుగుదేశం పార్టీని కలిపారు. ఎన్డీఏలోకి టిడిపిని చేర్చారు. అయితే ఈ క్రమంలో పవన్ ఒక పార్లమెంట్ స్థానాన్ని బిజెపి కోసం త్యాగం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా బిజెపితో పొత్తు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. జనసేన, బిజెపికి 30 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంటు స్థానాలను టిడిపి విడిచిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఆరు పార్లమెంట్ స్థానాలకు బిజెపి, రెండు పార్లమెంట్ స్థానాలకు జనసేన పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన జనసేన ఒక పార్లమెంట్ స్థానాన్ని త్యాగం చేసినట్లు సమాచారం.

గత రెండు రోజులుగా చంద్రబాబుతో పాటు పవన్ ఢిల్లీలోనే ఉన్నారు. వరుసగా బిజెపి అగ్ర నేతలతో సమావేశం అయ్యారు. పొత్తులపై కీలక చర్చలు జరిపారు. అయితే 12 అసెంబ్లీ స్థానాలు, 8 వరకు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని బిజెపి కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికే 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు జనసేనకు కేటాయించినందున.. ఆ స్థాయిలో బిజెపికి సీట్ల కేటాయింపు కష్టమని టిడిపి నుంచి ప్రతిపాదన వెళ్ళింది. ఈ సమయంలోనే పవన్ కలుగజేసుకున్నారు. కేంద్ర పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే అసెంబ్లీ స్థానాలను తగ్గించుకున్నా.. పార్లమెంట్ స్థానాల విషయానికి వచ్చేసరికి బిజెపి వెనక్కి తగ్గలేదు. దీంతో అంతిమంగా ఆ పార్టీకి ఆరు పార్లమెంట్ స్థానాలు కేటాయించేందుకు చంద్రబాబుతో పాటు పవన్ సమ్మతించినట్లు తెలుస్తోంది.

జనసేనకు పొత్తులో భాగంగా అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే అనకాపల్లి సీటు కోసం బిజెపి పట్టు పట్టింది. దీంతో ఆ స్థానాన్ని వదులుకునేందుకు పవన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. బిజెపికి రాజంపేట, ఏలూరు, అనకాపల్లి,రాజమండ్రి, అరకు, హిందూపురం పార్లమెంట్ స్థానాలు ఖరారైనట్లు సమాచారం. పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మచిలీపట్నం స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరికి కేటాయించనున్నారు. మిగిలిన 17 పార్లమెంటు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు బరిలో దిగనున్నారు. మొత్తానికైతే ఏపీలో పొత్తుల కోసం పవన్ ఒక ఎంపీ సీటును త్యాగం చేయడం విశేషం.