Pawan Kalyan: ఢిల్లీ టూర్ లో ఉండగా పవన్ విషయంలో కీలక ట్విస్ట్. వచ్చే ఎన్నికల్లో పవన్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. రెండు చోట్ల పోటీ చేయనున్నారు. టిడిపి తో జనసేనకు పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఆ రెండు పార్టీలు ఉమ్మడిగా తొలి జాబితాను ప్రకటించాయి. రెండు పార్టీలకు చెందిన కీలక నేతల పేర్లు, వారు పోటీ చేయబోయే నియోజకవర్గాలను ప్రకటించినా.. పవన్ పేరు మాత్రం ఆ జాబితాలో లేదు. రెండో జాబితాలో పవన్ పేరు తప్పక ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. బిజెపి పెద్దల సూచన మేరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో రెండు చోట్ల అసెంబ్లీకి పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. గాజువాక తో పాటు భీమవరం లో బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు. అయితే ఈసారి పక్కాగా చట్టసభల్లో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు. పొత్తులో భాగంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జనసేనకు లభించిన 24 సీట్లలో విజయం దక్కేలా వ్యూహరచన చేస్తున్నారు. కానీ తాను పోటీ చేయబోయే నియోజకవర్గం విషయంలో స్పష్టతనివ్వడం లేదు. రకరకాల నియోజకవర్గాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తొలుత భీమవరం నుంచి బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. తరువాత పిఠాపురం, తిరుపతి అసెంబ్లీ స్థానాలు తెరపైకి వచ్చాయి. అయితే పిఠాపురం అసెంబ్లీ స్థానంతో పాటు పవన్ కాకినాడ ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కేంద్ర పెద్దలు ఆదేశించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో కాకినాడలో పవన్ పోటీ చేస్తే మంచి విజయం దక్కుతుందని తేలినట్లు తెలుస్తోంది.
ఒక ఎంపీ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. కాకినాడ ఎంపీ సీటు పరిధిలో కాపు సామాజిక వర్గం అధికం. అక్కడ నుంచి పవన్ పోటీ చేస్తే ఉభయగోదావరి జిల్లాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అదే ఎంపీ సీటు పరిధిలో పిఠాపురం అసెంబ్లీ కూడా ఉంది. దీంతో అక్కడ ఏకపక్ష విజయం దక్కించుకునే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయేసరికి వైసీపీకి ప్రచారాస్త్రంగా మారింది. అందుకే ఈసారి సాలిడ్ విజయం చేజిక్కించుకోవాలని పవన్ భావిస్తున్నారు. కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే.. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, రూరల్,కాకినాడ సిటీ, జగ్గంపేట, పెద్దాపురం అసెంబ్లీ స్థానాలను సునాయాసంగా చేజిక్కించుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే పవర్ షేరింగ్ విషయంలో పవన్ వెనక్కి తగ్గిన నేపథ్యంలో ఎంపి స్థానానికి పోటీ చేస్తుండడం విశేషం. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం. ఒకవేళ పవన్ ఎంపీగా గెలిస్తే కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అందుకే అటు ఎమ్మెల్యేగా, ఇటు ఎంపీగా పవన్ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా పొత్తులు, సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ తో కలిసి చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. అదే సమయంలో పవన్ ఎమ్మెల్యే తో పాటు ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో జనసైనికులు ఒక రకమైన ఆనందం వెల్లివిరుస్తోంది. కూటమికి ఓట్ల బదలాయింపు జరగాలంటే పవన్ తప్పకుండా ఎంపీ కావాలని.. తద్వారా కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుందని సంకేతాలు పంపడానికే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.