USA: అమెరికాలో మానవ అక్రమ రవాణా.. కటకటాల పాలైన నలుగురు తెలుగోళ్లు..

USA: నల్లగొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన దాసిరెడ్డి చందన్, గుండా ద్వారక, కట్కూరి సంతోష్, మాలే అనిల్ టెక్సాస్ రాష్ట్రంలో ఉంటున్నారు. అయితే అక్కడ వారు మానవ అక్రమ రవాణాకు సంబంధించిన రాకెట్ నడుపుతున్నట్టు జాతీయ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : July 10, 2024 5:24 pm

4 Telugu origin individuals arrested

Follow us on

USA: దేశం గాని దేశం అది. ప్రాంతం కాని ప్రాంతం అది. ఇక్కడ మన భాష ఉండదు. మన సంస్కృతి ఉండదు. కానీ అవకాశాలకు కొదవ ఉండదు. అలాంటి అవకాశాలను దక్కించుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన నలుగురు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఉన్నత చదువులు చదివారు. అక్కడే బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించారు. కానీ అధిక సంపాదన కోసం అడ్డదారులు తొక్కారు. చివరికి అమెరికాలో కటకటాల పాలయ్యారు.

నల్లగొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన దాసిరెడ్డి చందన్, గుండా ద్వారక, కట్కూరి సంతోష్, మాలే అనిల్ టెక్సాస్ రాష్ట్రంలో ఉంటున్నారు. అయితే అక్కడ వారు మానవ అక్రమ రవాణాకు సంబంధించిన రాకెట్ నడుపుతున్నట్టు జాతీయ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. వీరిని అమెరికా పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. దాసిరెడ్డి చందన్, గుండా ద్వారక, కట్కూరి సంతోష్, మాలే అనిల్ అధిక సంపాదన కోసం నకిలీ కంపెనీలను సృష్టించారు. అందులో కొంతమందితో బలవంతంగా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని టెక్సాస్ రాష్ట్రంలోని ప్రిన్స్ టన్ పోలీస్ అధికారులు గుర్తించారు. అంతేకాదు ఓ ఇంటిని కిరాయికి తీసుకొని, దాని కేంద్రంగా మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల తనిఖీలు చేసి 15 మంది బాధిత మహిళలను గుర్తించారు. ఈ నిర్బంధానికి దాసిరెడ్డి చందన్, గుండా ద్వారక, కట్కూరి సంతోష్, మాలే అనిల్ కారణమని భావించి.. వారిని గత మార్చి నెలలో అరెస్ట్ చేశారు. అయితే వారిపై ప్రస్తుతం అమెరికా పోలీసులు మానవ అక్రమ రవాణా, సెకండ్ డిగ్రీ వంటి అభియోగాలను మోపారు. అంతేకాదు ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని అమెరికా మీడియా చెబుతోంది.

ఈ నలుగురు నిందితుల్లో సంతోష్ కట్కూరి, గుండా ద్వారక భార్యాభర్తలు. వీరు పలు షెల్ కంపెనీలలో పనిచేయాలని బాధితులను బలవంతం చేశారని పోలీసుల దర్యాప్తులో తేటతెల్లమైంది. దాదాపు 15 మందిని వీరు ఒకే గదిలో నిర్బంధించారని, వారితో బలవంతంగా పనిచేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రిన్స్ టౌన్ లోని కొలిన్ కౌంటి సమీపంలో గ్రిన్స్ బర్గ్ లేన్ లోని ఇంట్లో ఆ యువతులను నిర్బంధించారు. వారిని పడుకోబెట్టారు.. ఆ ఇంటిని పోలీసులు తనకి చేయగా అందులో ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇటీవల ఆ భవనంలో ఓ పెస్ట్(కీటకాలను నిరోధించడం) కంపెనీకి చెందిన ఉద్యోగి కీటకాలను చంపే మందు స్ప్రే చేసేందుకు వెళ్లాడు. ఆ భవనంలో అతడు మందు స్ప్రే చేస్తుండగా.. భారీగా కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పెద్ద సంఖ్యలో దుప్పట్లు, సూట్ కేస్ లను గుర్తించాడు. వెంటనే అతడు స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు సంతోష్ ఇంట్లో సోదాలు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రిన్స్ టౌన్ పోలీసులు సంతోష్ ఇంట్లో సోదాలు చేయగా 15 మంది బాధిత మహిళలను గుర్తించారు. వారు సంతోష్, అతడి భార్య ద్వారక ఆధ్వర్యంలోని షెల్ కంపెనీలలో బలవంతంగా పనిచేస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ కంపెనీలో బాధిత మహిళల సంఖ్య 100కు పైగానే ఉంటుందని, ఇందులో సగానికి ఎక్కువమంది భారతీయులే ఉన్నారని తెలుస్తోంది. సంతోష్, ద్వారకకు చందన్, అనిల్ సహకరించడంతో.. వారిని కూడా అరెస్టు చేశామని ప్రిన్స్ టౌన్ పోలీసులు చెబుతున్నారు. పోలీసుల విచారణలో మెలిసా, మెకెన్సీ, ప్రిన్స్ టౌన్ ప్రాంతాలలో బాధితులను గుర్తించారు.