Supreme Court: విడాకుల భరణంపై.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. సంచలన తీర్పు..

Supreme Court: విడాకులు తీసుకున్న తన సతీమణికి భరణం చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. వాస్తవానికి 125 సీఆర్పీసీ ప్రకారం విడాకులు తీసుకున్న భార్యకు కచ్చితంగా భరణం ఇవ్వాల్సి ఉంటుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 10, 2024 9:39 pm

Divorced Muslim Woman Can Seek Maintenance From Husband

Follow us on

Supreme Court: ఇన్నాళ్ళూ భార్యా భర్తలు విడాకులు తీసుకుంటే.. భార్యలకు భర్తలు భరణం ఇచ్చేవారు. భరణాల విషయాలలో తేడా ఉన్నప్పటికీ.. ఈ కేసులలో కోర్టుల తీర్పు ఒకే విధంగా ఉండేది. అయితే బుధవారం భరణానికి సంబంధించిన కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత మహిళలు భరణానికి అర్హులని స్పష్టం చేసింది.

విడాకులు తీసుకున్న తన సతీమణికి భరణం చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. వాస్తవానికి 125 సీఆర్పీసీ ప్రకారం విడాకులు తీసుకున్న భార్యకు కచ్చితంగా భరణం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆగస్టిన్, జస్టిస్ జార్జ్ మాసిహ్ తో కూడిన ధర్మాసనం విచారించి, సంచలన తీర్పు వెలువరించింది. “విడాకుల తర్వాత తమ భర్త నుంచి ముస్లిం మహిళలు భరణం కోరవచ్చు. భరణానికి సంబంధించిన హక్కు కల్పించే సెక్షన్ 125 ని విడాకులు తీసుకున్న మహిళలకు వర్తింపజేస్తున్నామని” సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

గృహిణి త్యాగం గురించి, ఆమె పాత్ర గురించి గొప్పగా చెప్పిన ధర్మాసనం.. సెక్షన్ 125 గురించి కూడా చాలా లోతైన వ్యాఖ్యలు చేసింది. “సెక్షన్ 125 వివాహితులకే కాకుండా మహిళల మొత్తానికి వర్తిస్తుంది. మతంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ సెక్షన్ కింద వివాహితలు భరణం కోరవచ్చు. భరణం ఇవ్వడాన్ని దాతృత్వం అస్సలు అనకూడదు. చాలామంది మగవాళ్లు దీనిని దాతృత్వం కింద లెక్కేస్తున్నారు. అలాంటి ధోరణి వారు మానుకోవాలి. భార్య తమపై మానసికంగా, శారీరకంగా ఆధారపడి ఉంటుందని భావనను కొంతమంది మగవాళ్లు గుర్తించడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. ముస్లింలే కాదు, ఏ మతాలవారైనా భార్య పాత్రను కచ్చితంగా గుర్తించాలి. ఆమె ఔన్నత్యాన్ని కొనియాడాలి. ఆమె త్యాగాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చేసిందని” ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.