
ఎన్నో ఆశలతో పెళ్లి అనే బంధంతో ఒక్కటయ్యారు. నూరేళ్లు కలిసి ఉండాలని ప్రమాణం చేసుకున్నారు. ఒకరికొకరు తోడు ఉండాలని భావించారు. పెళ్లినాటి ప్రమాణాలు నిజం కావాలని ఆకాంక్షించారు. కానీ విధి వెక్కిరించింది. వారి సంసారంలో కలతలు రేపింది. కట్టుకున్న వాడు మంచివాడు కాదనే విషయం తెలియడంతో భార్య కుంగిపోయింది. పైగా ఇదివరకే భర్తకు మరో పెళ్లి జరిగినట్లు తెలుసుకుని దుఖాన్ని దిగమింగుకుంది. అయినా సరే అతడితోనే ఉండాలని నిర్ణయించుకుంది. అయినా అతడి ప్రవర్తనలో మార్పు కనిపించలేదు.
నిత్యం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కావాలని చిత్రహింసలకు గురిచేసేవాడు. తల్లిదండ్రులతో కలిసి భార్యను నిత్యం బాధలకు గురిచేసే క్రమంలో ఆమెకు మరిది అండగా నిలిచేవాడు. తల్లిదండ్రులను ఎదిరించి ఆమెకు ధైర్యం చెప్పేవాడు. ఈ నేపథ్యంలో ఇద్దరిలో సఖ్యత పెరిగింది. అది ప్రేమగా మారింది. చివరకు ఇద్దరిని ఒకటి చేసింది. దీంతో వారిలో అనురాగం పెరిగింది. ఆప్యాయత నిండింది. ఫలితంగా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.
చక్ జైనా గ్రామానికి చెందిన రాకేష్ కు షబ్నం కుమారికి ఏడాది క్రితం వివాహం జరిగింది. అప్పటికే రాకేష్ కు మరో మహిళతో పెళ్లి జరిగినట్లు తెలుసుకున్న షబ్నం తట్టుకోలేకపోయింది. దీంతో రాకేష్ అతడి తల్లిదండ్రులు కట్నం గురించి వేధింపులకు గురిచేసేవారు. ఈ నేపథ్యంలో షబ్నంకు రాకేష్ సోదరుడు కుందన్ కుమార్ అండగా నిలిచాడు. దీంతో వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం రాకేష్ కు తెలియడంతో కుందన్ ఇంటి నుంచి వెళ్లిపోయి వేరే ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులకు తెలియకుండా షబ్నం అక్కడకు వెళ్లేది.
ఇద్దరి వ్యవహారం తెలియడంతో రాకేష్ వారిని చితకబాదాడు. తర్వాత వారు ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుందన్, షబ్నం సోమవారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. నలందా రైల్వే స్టేషన్ లో ఇద్దరు విషం తాగారు. ఉదయం రైల్వే పోలీసులు గమనించి ఆస్పత్రికి తరలించినా అప్పటికే కుందన్ చనిపోగా షబ్నం కొన ఊపిరితో ప్రాణాపాయ స్థితిలో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.