Telangana Police: అందరూ పోలీసులే.. విధులు.. సెలవుల్లో మాత్రం తేడా.. బెటాలియన్‌ పోలీసు కుటుంబాల ఆందోళన ఎందుకు?

పోలీస్‌.. శాంతిభద్రతలను పరిరక్షించే వారు.. మనకు రక్షణ కల్పించేవారు. కానీ కొన్ని రోజులుగా తెలంగాణలో ఆ పోలీస్‌ కుటుంబాలే రోడ్డెక్కుతున్నాయి. పోలీసుల సమస్యలపై ఆందోళన చేస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : October 27, 2024 1:06 pm

Telangana Police

Follow us on

Telangana Police: పోలీస్‌.. దేశంలో అంతర్గత భద్రతను పర్యవేక్షించేది.. పరిరక్షించేది ఈ పోలీసులే. ఎవరికి ఏ సమస్య వచ్చినా.. పరిష్కారానికి ముందుకు వచ్చేది పోలీసులే. కానీ, తెలంగాణలో ఇప్పుడు పోలీసు కుటుంబాలే తమ సమస్యలపై రోర్డెక్కుతున్నారు. అయితే అందరు పోలీసు కుటుంబాలు కాదు. కేవలం బెటాలియన్‌ పోలీసు కుటుంబాలు మాత్రమే ఆందోళ చేస్తున్నాయి. మళ్లీ ఈ తేడా ఏంటని ఆలోచిస్తున్నారా.. మరి సాధారణ పోలీసులకు, బెటాలియన్‌ పోలీసులకు మధ్య తేడా ఏంటి.. బెటాలియన్‌ పోలీస్‌ కుటుంబాలే ఎందుకు రోడ్డెక్కుతున్నాయి. సమస్య ఎక్కడుంది అనే విషయాలు తెలుసుకుందాం.

ఏక్‌ పోలీస్‌..
ఏక్‌ పోలీస్‌.. అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయో పరిశీలిస్తే.. తెలంగాణలో మొత్తం 13 బెటాలియన్లు ఉన్నాయి. వాటిలో అధికారులు, సిబ్బంది కలిసి ఒక్కో బెటాలియన్‌లో వెయ్యి మంది వరకు ఉంటారు. సాధారణంగా పోలీస్‌ శాఖలో సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వు(ఏఆర్‌), స్పెషల్‌ పోలీసు విభాగాలు ఉంటాయి. నేర విచారణ, శాంతిభద్రతల పర్యవేక్షణ, నేర విచారణ, నేరాల నిరోధం, నేరస్తులను గుర్తించడం వంటి విధుల్లో సివిల్‌ పోలీసులు పనిచేస్తారు. ఇక బందోబస్తు విధులు నిర్వహించేది ఆర్మ్‌డ్‌ పోలీసులు. టీజీఎస్పీ పోలీసు సిబ్బంది శాంతిభద్రతల విధులు నిర్వహిస్తుంటారు. ఐదేళ్లు ఏఆర్‌లో పనిచేసిన తర్వాత తమను సివిల్‌లోకి మార్చాలని పోలీసులు కోరుతున్నారు. అయితే ఇందుకు రాష్ట్ర సర్వీస్‌ నిబంధనలు అంగీకరించవు.

సెలవలు విషయంలో..
ఇక సెలవుల విషయంలో కూడా ఏఆర్‌ పోలీసుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. సివిల్‌ పోలీసులకు వారానికి ఒక రోజు సెలవు ఇస్తుండగా, ఏఆర్‌ పోలీసులకు మాత్రం మూడు వారాలకు ఒక రోజు సెలవు ఇస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తున్న బెటాలియన్‌ పోలీసులకు ఇప్పుడు సెలవులు కూడా రద్దు చేయడంపై వారి కుటుంబాలు రోడ్డెక్కుతున్నాయి. ఉద్యోగులు ఎవరికీ లేని విధంగా టీసీఎస్సీ సిబ్బందికి సరెండర్‌ లీవులు, అడిషనల్‌ సరెండర్‌ లీవులు మంజూరు చేశారు. పండుగలు, సెలవుల సందర్భాల్లో టీజీఎస్సీ సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉండడంతో వీరికి ప్రత్యేక సెలవులు ఉంటాయి. ఇక వేతనాలు, భత్యాలు, ఇతర రాష్ట్రాల పోలీస్‌ సిబ్బందితో పోలిస్తే అధికంగా ఉన్నాయి. భద్రత, ఆరోగ్యం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.

శాఖకు మచ్చ తెచ్చేలా…
యూనిఫాం ధరించే పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి. కానీ, బెటాలియన్‌ పోలీసులు కొందరు ఆందోళనతో ఆ శాఖకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. అన్నిరకాలుగా మిగతా పోలీసులకన్నా ప్రత్యేక సదుపాయాలు ఉన్నా.. సెలవుల విషయంలో పోలీస్‌ కుటుంబాలు రోడ్డెక్కడం వెనుక పోలీసులు ఉన్నారని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే చర్యలకు ఉపక్రమించింది. 116 మంది బెటాలియన్‌ పోలీసులను విధుల నుంచి తప్పించింది.