https://oktelugu.com/

భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ?

భారత-చైనా సరిహద్దు ఘర్షణలపై ప్రతిరోజూ తీవ్ర చర్చలు , వాదోపవాదాలు జాతీయ మీడియాలో చూస్తున్నాము. అందులో గమనించాల్సిన అంశమేమంటే ఎప్పుడూ చురుకుగా పాల్గొనే కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు కనబడకపోవటం. అదేదో కాకతాళీయంగా జరిగిందికాదు. సిపిఎం వారి అధికార ప్రతినిధులను పంపటానికి నిరాకరించింది. దానికి కారణాలు అందరికీ తెలిసిందే. టీవీ మాధ్యమాల్లో కూర్చొని చైనా తో తగాదా పెట్టుకోవద్దని చెప్పటం వివాదాస్పదం అవుతుందని భావించటమే. తప్పులేదు , ఎవరి అభిప్రాయాలు వారివి. కాకపోతే సమస్యల్లా ద్వంద ప్రమాణాలు పాటించటమే. […]

Written By:
  • Ram
  • , Updated On : June 24, 2020 / 02:52 PM IST
    Follow us on

    భారత-చైనా సరిహద్దు ఘర్షణలపై ప్రతిరోజూ తీవ్ర చర్చలు , వాదోపవాదాలు జాతీయ మీడియాలో చూస్తున్నాము. అందులో గమనించాల్సిన అంశమేమంటే ఎప్పుడూ చురుకుగా పాల్గొనే కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు కనబడకపోవటం. అదేదో కాకతాళీయంగా జరిగిందికాదు. సిపిఎం వారి అధికార ప్రతినిధులను పంపటానికి నిరాకరించింది. దానికి కారణాలు అందరికీ తెలిసిందే. టీవీ మాధ్యమాల్లో కూర్చొని చైనా తో తగాదా పెట్టుకోవద్దని చెప్పటం వివాదాస్పదం అవుతుందని భావించటమే. తప్పులేదు , ఎవరి అభిప్రాయాలు వారివి. కాకపోతే సమస్యల్లా ద్వంద ప్రమాణాలు పాటించటమే. అమెరికా తో భారత్ కి వివాదం వస్తే ఒంటికాలుమీద లేచే వాళ్ళు చైనా విషయం వచ్చేసరికి అదే వైఖరి తీసుకోకపోవటానికి కారణం చైనా లో అధికారం లో వుంది సోదర కమ్యూనిస్టు పార్టీ కావటమే.

    ఈ విధానం ఈరోజు కొత్తేమీ కాదు. మొదట్నుంచీ ఈ ద్వంద ప్రమాణాలు పాటిస్తూనే వచ్చారు. సామ్రాజ్యవాదాన్ని సిద్ధాంతపరంగా వ్యతిరేకించే వాళ్ళు స్వతంత్ర టిబెట్ ని 1951లో చైనా ఆక్రమించినప్పుడు అందులో సామ్రాజ్యవాదం కనబడలేదు. ఎందుకంటే అది సోదర కమ్యునిస్టు పార్టీ కాబట్టి. అలాగే సోవియట్ యూనియన్ సైన్యాలు 1979 లో ఆఫ్ఘనిస్తాన్ పై దాడిచేసి ఆక్రమించినప్పుడు అది సమర్ధనీయమే . ఎందుకంటే ఆక్రమించింది సోదర కమ్యూనిస్టు పార్టీ కాబట్టి. అదే అమెరికా వియత్నాంని ఆక్రమిస్తే భారత్ లో  నిరసన ప్రదర్శనలు చేస్తాం. అమెరికా చేసినా , రష్యా చేసినా, చైనా చేసినా భౌతిక ఆక్రమణ తప్పే. అంతేగానీ మన సోదర పార్టీ అధికారంలో వుంటే ఒకలాగా వేరే వాళ్ళు చేస్తే ఇంకోలాగా ప్రతిస్పందిస్తే అర్ధం ఆ సిద్ధాంతం మీద చిత్తశుద్ది లేదనే చెప్పాలి. మరి ఈరోజు కార్ల్ మార్క్స్ బతికుంటే ఈ ద్వంద ప్రమాణాల్ని ఒప్పుకునేవాడో కాదో ప్రజల ఊహలకు వదిలేస్తున్నాం.

    ఈ ద్వంద ప్రమాణాలే భారత-చైనా సంబంధాలలోనూ కనబడుతున్నాయి. చైనా 1949లో కమ్యూనిస్టుల ఆధ్వర్యాన ప్రజా రిపబ్లిక్ గా అవతరించింది. అంతకుముందు వున్న కొమింగ్ టాంగ్ పార్టీ నాయకుడు చాంగ్ కై షేక్ జపాన్ తో రాజీ పడి ప్రజావ్యతిరేకిగా మారిన నేపధ్యం లో మావో సే టుంగ్ ఆధ్వర్యాన ఎర్ర సైన్యం అధికారాన్ని చేపట్టటం జరిగింది. అంతవరకూ బాగానే వున్నా ఆ తర్వాత జరిగిన పరిణామాలే అందరిని ఆశ్చర్య పరిచాయి. జాతులు విముక్తి కోరతాయి కానీ అది మాకు వర్తించదు. ఇదీ మావో సిద్ధాంతం. పక్కనున్న టిబెట్ ఎప్పట్నుంచో స్వతంత్ర దేశంగా వున్నా , ప్రత్యెక దేశానికి కావాల్సిన అన్ని లక్షణాలు కలిగి వున్నా దాన్ని బలవంతంగా ఆక్రమించటానికి తను చెప్పిన సిద్ధాంతాలు అడ్డురాలేదు. అప్పుడే చైనా విస్తరణ వాదాన్ని, జాతీయ దురభిమానాన్ని మనదేశంలోని జాతీయవాదులు, వామపక్షవాదులు పసిగట్ట లేకపోయారు. కానీ ఒకేఒక వ్యక్తి దీనిపై పూర్తి స్పష్టత లో వున్నాడు. ఆయనే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా . భారతీయ సమాజాన్ని గురించి విస్తృతంగా అధ్యయనం చేయటమే కాకుండా , చైనా విషయం లోనూ మొదట్నుంచీ స్పష్టత తో హెచ్చరిస్తూనే వస్తున్నాడు. వల్లభాయ్ పటేల్ నెహ్రూ తో తన అభిప్రాయాలు పంచుకున్నా బయటపడి దానిపై బహిరంగ విమర్శలకు దిగే అవకాశం లేదు.

    ఇక కమ్యూనిస్టుల విషయానికి వస్తే ప్రపంచ సూత్రాలకు వ్యతిరేక మైనా అది కమ్యూనిస్టు విప్లవాన్ని ఎగుమతి చేయటానికి చేస్తున్న పని కాబట్టి తప్పులేదనే భావన. అది మాతృ దేశమైన భారత్ అయినా సరే. అందుకనే చైనా దురాక్రమణ ను తప్పు అని ఒక్కసారి కూడా ఖండించిన పాపాన పోలేదు. అవేమిటో ఒక్కసారి చూద్దాం.

    1. 1954 లో లడఖ్ లో భాగమైన ఆక్సాయ్ చిన్ ని రహస్యంగా ఆక్రమించినా దాని నిర్వాకం తెలిసిన తర్వాత అన్ని పార్టీలు ముక్త కంఠంతో పార్లమెంటులో ఖండించినా కమ్యూనిస్టులు మాత్రం శాంతి వచనాలే పలికారు తప్పితే చైనా చర్యని ఖండించిన పాపాన పోలేదు. 1842 ఒప్పందం ప్రకారం ఆక్సాయ్ చిన్ మనదేనని ఒక్కమాట అనలేకపోయారు.
    2. 1959 లో చైనా అక్రమంగా మన భూభాగం నుంచి కారకోరం నడవా ని నిర్మించటానికి పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకుంటే ఆ భూభాగం మాది అక్కడ నిర్మించాలంటే భారత్ తో ఒప్పందం చేసుకోవాలని ఒక్క మాట అనలేకపోయారు. ఆ మాట అని శాంతి వచనాలు పలికినా అది ఓ పద్దతిగా వుండేది. 1947 అక్టోబర్ లో కాశ్మీర్ మహారాజా భారత్ లో విలీనంపై సంతకం పెట్టిన తర్వాత కాశ్మీర్ ఉత్తర ప్రాంతాలలో రహదారి నిర్మించాలంటే భారత్ తో సంప్రదించాలనే కనీస మాట భారత్ లోని పార్టీ మాట్లాడక పోవటాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి.
    3. 1962 భారత-చైనా యుద్ధం లో భారత్ తరఫున మాట్లాడక పోవటాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? ఇదే చైనా కాకుండా ఇంకే దేశమైనా అయివుంటే ఇదే ధోరణి అవలంబించే వారా? భారత్ ప్రభుత్వం ఏ విధంగా దుందుడుకుగా ప్రవర్తించిందో పుంఖానుపుంఖాలుగా వారి అధికార పత్రికల్లో వ్యాసాలు రాయటాన్ని ఏ కోణం లో చూడాలి? నిజంగా విశ్వశాంతి కోరుకునే వారయితే అందరితో అదే వైఖరి అవలంబించాలి. చైనా ప్రభుత్వం వేరు , ప్రజలు వేరని మరిచిపోవద్దు. తగాదా చైనా విస్తరణ వాదం తోనే ప్రజలతో కాదు.
    4. 1963 లో వ్యూహాత్మకంగా లబ్ది పొందొచ్చనే దుర్బుద్ధితో చైనా పాకిస్తాన్ తో ఒప్పందం పేరుతో మన భూభాగం షాక్స్ గం లోయను వశపర్చుకున్నప్పుడు ఇది తప్పు అనకపోవటం ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? అసలు భూమి స్వంతదారు కాని పాకిస్తాన్ ఇంకొకకరికి అమ్మే హక్కు ఎక్కడదని ప్రశ్నించటం జాతి దురహంకారం కిందకు వస్తుందా ? యుద్ధాలు, శాంతులు తర్వాత ఈ భూమి మాది మీరెలా వశపరుచుకుంటారని ఎప్పుడైనా ప్రశ్నించారా?
    5. ఆ తర్వాత ఎన్నోసార్లు భారత భూభాగాన్ని కబ్జా చేస్తుంటే ఎప్పుడైనా ప్రశ్నించారా?
    6. 2013 లో కారకోరం నడవాని చైనా-పాకిస్తాన్ ఆర్ధిక నడవా కింద వున్నత స్థాయికి మార్చటానికి పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకుంటే ఇది ఆక్రమిత కాశ్మీర్ లో వుంది కాబట్టి భారత్ అనుమతి లేకుండా ఎలా నిర్మిస్తారని ఎప్పుడైనా ప్రశ్నించారా?                                                            సరే భారత మీడియా లో మాట్లాడకపోతే పోయారు మీ ద్వైపాక్షిక చర్చల్లో ఎప్పుడైనా మాట్లాడారా ? ఎందుకంటే సోదర కమ్యూనిస్టు పార్టీగా మీరు చైనా కమ్యూనిస్టు పార్టీతో క్రమం తప్పకుండా అభిప్రాయాలు పంచుకుంటారు కదా. అప్పుడన్నా మీ నిరసన తెలిపారా?

    తెలపకపోగా చైనా పై ఎవరైనా మాట్లాడితే వాళ్ళు జాతీయ దురహంకారులు గా ముద్ర వేసే వాళ్ళు. అదేమంటే దేశ భక్తీ వేరు , జాతీయత వేరని ఉపన్యాసాలు దంచేస్తారు. దేశ భక్తి అంటే ప్రజల ఆర్తనాదాలు పట్టించుకోవటం, పేదరికాన్ని పారదోలటం అని వూదర కొట్టటం అలవాటయ్యింది. మీరు చెప్పే ప్రజా సమస్యల పై మీ చిత్త శుద్ధిని శంకించటం లేదు. కాకపోతే వీటికి దేశ భద్రత కి లంకె పెట్టటాన్నే జీర్నించుకోలేకపోతున్నాము.

    ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. చైనా తో జరుగుతున్న ఘర్షణలపై మీ వైఖరేమిటి? చైనా భారత ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేస్తుందని నమ్ముతున్నారా లేదా? ఉగ్రవాదుల విషయం లో పాకిస్తాన్ ని వెనకేసుకు రావటం , భారత్ కి వ్యతిరేకంగా నేపాల్ ని రెచ్చగొట్టటం, అందుకు అధికారం లోవున్న సోదర కమ్యూనిస్టులతో కలిసి కుట్ర పన్నటం, ఈశాన్య భారతం లో వేర్పాటువాదులకు మిలిటరీ, ఆర్ధిక సహాయం చేయటం, హిందూ మహా సముద్రం లో భారత్ వ్యతిరేక స్థావరాలు ఏర్పాటు చేసుకోవటం, భారత సరిహద్దుదేశాలను డబ్బులతో ఆకట్టుకొని భారత్ ని ఇబ్బందుల్లోకి నెట్టటం లాంటి అనేక చర్యలకు చైనా పాల్పడటం కూడా తీవ్రమైన విషయంగా అనిపించటం లేదా? అంతమాత్రాన చైనా తో రోజూ తగాదా పెట్టుకోమనో, యుద్ధం పెట్టుకోమనో కాదు. అది చైనా తో ఎలా వ్యవహరించాలనే విషయం కిందకు వస్తుంది. ముందుగా చైనా భారత్ ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయంలో స్పష్టత వుంటే అటువంటి దేశంతో ఎలా వ్యవహరించాలో తర్వాత ఆలోచించవచ్చు. అసలు మొదటి విషయాన్ని దాట వేసి రెండో విషయాన్ని గురించి ఆలోచించలేము. చైనా భారత్ ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయం లో అన్ని పార్టీలు ఒక్క కమ్యూనిస్టులు తప్ప ఒకే బాటలో వున్నారు.  కానీ కమ్యూనిస్టులు మాత్రం ఈ విషయం లో భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా మన కమ్యూనిస్టులు మనసు మార్చుకొని చైనా విధానం పూర్తిగా వారి జాతీయ, విస్తరణ వాద మనస్తత్వంతో వుందని గ్రహిస్తే మంచిది. ఈ విషయంలో లోహియా రచనలు , ఆలోచనలు ( భారతీయ సమకాలీన మేధావులు కదా అని చులకనగా చూడకపోతే ) ఒక్కసారి పరిశీలిస్తే , ముఖ్యంగా  India, China and Northern Frontiers అనే పుస్తకం కొంతమేర ఉపయోగపడుతుంది. కీలకమైన అంశమేమంటే భారత్ విదేశాంగ విధానం పాకిస్తాన్ కేంద్రంగా కాకుండా చైనా కేంద్రంగా వుండాలని లోహియా అప్పట్లోనే అభిప్రాయ పడ్డాడు. ఇప్పటికైనా కమ్యూనిస్టులు మనసు మార్చుకొని జాతీయ విధానం పై కొత్త పంధా తీసుకుంటారని ఆశిద్దాం.