బీహార్ లో జరిగిందేమిటి?

మేము చెప్పినట్లే జరిగింది. నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్ ఆధారంగా ఈ మాట చెబుతున్నాము. ముఖ్యంగా ఆక్సిస్ మై ఇండియా పోల్ పై మొదట్నుంచీ మేము సానుకూలంగా ఉన్నాము. ఎందుకంటే ఇప్పటివరకు ఆ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలావరకు ఎన్నికల ఫలితానికి దగ్గరగా ఉంటున్నాయి. ఈ ఫలితం కూడా దగ్గరగా ఉంటుందనే భావనతో ఈ విశ్లేషణ చేస్తున్నాము. నిన్న రాసిన సంపాదకీయంలో పదవుల్లో ఎవరూ శాశ్వతంగా ఉండకూడదని అది ప్రజాస్వామ్యానికి మంచిదికాదని కూడా రాసాము. 15 […]

Written By: Ram, Updated On : November 8, 2020 7:17 am
Follow us on

మేము చెప్పినట్లే జరిగింది. నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్ ఆధారంగా ఈ మాట చెబుతున్నాము. ముఖ్యంగా ఆక్సిస్ మై ఇండియా పోల్ పై మొదట్నుంచీ మేము సానుకూలంగా ఉన్నాము. ఎందుకంటే ఇప్పటివరకు ఆ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలావరకు ఎన్నికల ఫలితానికి దగ్గరగా ఉంటున్నాయి. ఈ ఫలితం కూడా దగ్గరగా ఉంటుందనే భావనతో ఈ విశ్లేషణ చేస్తున్నాము. నిన్న రాసిన సంపాదకీయంలో పదవుల్లో ఎవరూ శాశ్వతంగా ఉండకూడదని అది ప్రజాస్వామ్యానికి మంచిదికాదని కూడా రాసాము. 15 సంవత్సరాలు ఏక కాలంగా పరిపాలన చేసిన తర్వాత కూడా ఇంకా తనే ఆ పదవిలో కొనసాగాలని కోరుకోవటం ప్రజాస్వామ్యం నియంతస్వామ్యం గా మారుతుందని కూడా రాసాము. ఎగ్జిట్ పోల్ అవే చెబుతున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అదే తేజస్వి యాదవ్ కి అనుకూలంగా మారింది.

ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ పై మా విశ్లేషణ

ప్రజా అభిప్రాయం, కుల సమీకరణలు, తేజస్వి యాదవ్ ప్రజల్లోకి తీసుకెళ్ళిన పద్ధతి అన్నీ ఈ ఫలితానికి దోహదపడ్డాయి. నితీష్ కుమార్ వరుసగా మూడు దఫాలు ముఖ్యమంత్రి పదవిలో ఉండటంతో ఆ సమయంలో జరిగిన మంచితో పాటు,చెడుకి కూడా తనే బాధ్యత వహించాల్సి వుంది. నితీష్ కుమార్ వ్యక్తిగతంగా ఎన్నో మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి. సమాంతర రాజకీయాల్లో అవినీతిని దరిచేరనీయక పోవటం, కుటుంబ సభ్యులను వారసులుగా ప్రోత్సహించక పోవటం అందరం హర్షించాలి. రామమనోహర్ లోహియా సిద్ధాంతాలకు ఈ రోజు ఎవరైనా వారసులుగా వున్నారంటే అది నితీష్ కుమార్ అని చెప్పక తప్పదు. అదే సమయంలో రాజకీయ కుప్పిగంతులు వేయటం కూడా జరిగింది. మొదట్లో మోడీపై వ్యక్తిగత ద్వేషంతో వ్యవహరించటం,తర్వాత మరలా రాజీ పడటం, ఆతర్వాత తిరిగి జంగిల్ రాజ్ అని విమర్శించే లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి 2015 లో జట్టు కట్టటం,మరలా బయటకొచ్చి మోడీతో కలవటం ఇవన్నీ తన వ్యక్తిత్వానికి దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఇన్నిసార్లు కుప్పిగంతులు వేయటం తన క్రెడిబిలిటీని దెబ్బతీసాయి. అదే సమయంలో పరిపాలనలో మొదట్లో శాంతి భద్రతలు పునరుద్ధరించి ప్రజల మన్నలు పొందినా రానురాను కింది స్థాయిలో జరిగిన తప్పిదాలపై తీవ్ర చర్యలు తీసుకోకపోవటంతో అసంతృప్తి పెరిగింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇటీవలి వలస కార్మికుల విషయంలో తను ప్రవర్తించిన తీరు వారిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంది. అది ఎన్నికల్లో ప్రతిబింబించింది. మొత్తం మీద ఈ ఎన్నికలు నితీష్ కుమార్ పరిపాలనపై వున్న వ్యతిరేకతకు అద్దం పట్టాయి. అంటే ప్రజాభిప్రాయం మార్పు కోరుకుంది.

బీహార్ లో ప్రజాభిప్రాయంతో పాటు కుల సమీకరణలు కూడా ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తాయి. లాలూ ప్రసాద్ కూర్చిన ముస్లిం-యాదవ్ సోషల్ ఇంజనీరింగ్ మొత్తం బీహార్ లో బలమైన సమీకరణ. ఇది రాష్ట్రీయ జనతాదళ్ కి కోర్ బేస్ గా ఉన్నంత కాలం అధికారంలోకి వచ్చినా రాకపోయినా రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అదే వుంటుంది. మిగతా సమీకరణాలను బట్టి అధికారమా ప్రతిపక్షమా అనేది నిర్ణయించబడుతుంది. ఇక్కడే ఈసారి పరిస్థితులు తేజస్వి యాదవ్ కి అనుకూలంగా వున్నాయి. వ్యతిరేకవర్గం ఈసారి చీలి పోయింది. అగ్రవర్ణాలు బిజెపి వైపే వున్నా అందులో చీలిక వచ్చింది. నితీష్ కుమార్ కి కోర్ బేస్ బలమైనది కాదు. తనకులమైన కూర్మి-కొయరి జనాభాలో తక్కువమంది. అందుకే ‘అతి వెనకబడిన కులాల్ని’ సమీకరించి బేస్ ని విస్తరించుకున్నాడు. కాని ఈ బేస్ యాదవ్-ముస్లిం బేస్ లాగా ప్రభావశీలమైనది కాదు. ఈసారి ఈ బేస్ అదివరకటిలాగా సంఘటితంగా లేదు. ఇది పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడే సంఘటితంగా వుంటుంది. లేకపోతే గుల్లబారుతుంది. దానికి కారణం లేకపోలేదు. బీహార్ లో దళితులు కూడా ప్రధాన వర్గం. ఇందులో ప్రధాన వర్గమైన పాశ్వాన్ లు ఈసారి ఎన్ డి ఎ కి దూరమవటంతో ‘అతి వెనకబడిన వర్గం’ కూడా సంఘటితంగా లేకపోయింది. చిరాగ్ పాశ్వాన్ విడిపోవటంతో సోషల్ ఇంజనీరింగ్ దెబ్బతిన్నది. షుమారు చిరాగ్ పాశ్వాన్ 7 శాతం ఓట్లను చీల్చుకోగలిగాడు. ఈ చీలిక తేజస్వి యాదవ్ కి ఉపయోగపడింది. చిరాగ్ పాశ్వాన్ స్వతహాగా ఎక్కువ సీట్లు గెలవకపోయినా ఎన్ డి ఎ సోషల్ ఇంజనీరింగ్ ని బలహీనపర్చటానికి ఉపయోగపడింది. అదేసమయంలో మిగతా కూటములు అనుకున్నంత ప్రభావం చూపకపోవటం కూడా తేజస్వి యాదవ్ కి కలిసొచ్చింది. ఉదాహరణకు గ్రాండ్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ (GDSF) ప్రభావం పరిమితంగానే వుంది. ఉపేంద్ర కుష్వాహ,మాయావతి,ఒవైసీ కలిసి ఏర్పాటు చేసిన ఈ ఫ్రంట్ ఎన్నికల్లో తేలిపోయింది. అలాగే చిరాగ్ పాశ్వాన్ ని దూరం చేసుకున్న ఎన్ డి ఎ మహా గట్బంధన్ నుంచి బయటకొచ్చిన వి ఐ పి, హం పార్టీలను చేర్చుకున్నా వాటివలన పెద్ద ప్రయోజనం చేకూరలేదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలుపుతున్నాయి. అంటే రెండో అంశమైన కుల సమీకరణలు తేజస్వి యాదవ్ కి కలిసొచ్చాయి.

ఇక మూడోది, నేరేటివ్ ( ప్రజల్లోకి తీసుకెళ్ళిన పద్దతి ) చూస్తే తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ కన్నా మిన్నగా ప్రజలకు కనెక్ట్ అయ్యాడని అర్ధమవుతుంది. ఈ విషయం తన సభలకి వచ్చిన జనాన్ని బట్టే అర్ధమయ్యింది. వాళ్ళ నాన్న తీసుకున్న సామాజిక న్యాయం అంశాన్ని పక్కకు పెట్టి ఆర్ధిక న్యాయం అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చిన విధానం విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని,ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం ఆ ఫైల్ మీదే పెడతానని చెప్పటం యువతని విశేషంగా ఆకర్షించింది. మూడు కమ్యూనిస్టు పార్టీలను కూటమిలో చేర్చుకోవటం కూడా ఈ ఆర్ధిక న్యాయం అంశానికి ప్రాముఖ్యతను ఇచ్చినట్లయ్యింది. అదే నితీష్ కుమార్ నేరేటివ్ లో కొత్తదనం లేకపోయింది. జంగిల్ రాజ్ నేరేటివ్ కి ప్రజలు జై కొట్టలేదు. దానిపై అంత పట్టుదల వుంటే 2015 లో లాలూ ప్రసాద్ యాదవ్ తో ఎందుకు కలిసి పోటీ చేసినట్లు? అయినా 15 సంవత్సరాల తర్వాత నీ పరిపాలన పై అభిప్రాయాన్ని కోరాలి కాని ఇంకా పాత ప్రభుత్వంపై విమర్శలు ప్రధాన అస్త్రంగా చేసుకోవటం నితీష్ కుమార్ ఆలోచనల్లో నవ్యత లేదని అర్ధమవుతుంది. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం నిర్ణయం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి మంచిదా కాదా అనేది పక్కన పెడితే అది యూత్ ని విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ‘తీవ్ర వెనకబడిన కులాల్లోని’ యువకులు కూడా కొంత సెక్షన్ తేజస్వి వైపు మొగ్గు చూపింది. అంటే కోర్ బేస్ ముస్లిం-యాదవ్ తో పాటు యూత్ ఫాక్టర్ కూడా చేరింది. ఈ M-Y-Y కలయిక తేజస్విని 31 ఏళ్ళకే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టబోతుంది. ఇది ఎన్నికల్లో ఓ కేసు స్టడీ గా ముందు ముందు చూడాల్సి వుంది.

బిజెపి స్వయంకృతాపరాధం

ఇంతకుముందు వ్యాసంలో మేము చెప్పినట్లు బిజెపి చలనశీలంగా ఆలోచించటం మానేసింది. సంప్రదాయ పద్దతిలోనే దాని ఆలోచనలు ఉంటున్నాయి. మహారాష్ట్రలో,ఝార్ఖండ్ లో ఇదే విధమైన ఆలోచనలతో అధికారానికి దూరమయ్యింది. శివసేన రోజూ బిజెపిని,మోడీని విమర్శిస్తున్నా గెలిచిన సీట్లు కూడా వదులుకొని పొత్తు కుదుర్చుకోవటం బిజెపి నాయకత్వ ఆలోచనల్లో లోపం స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఎన్నికల్లో శివసేనకు సగం సీట్లు వదిలిపెట్టటంతో ఆ సీట్లలో ఎక్కువభాగం ప్రతిపక్షానికి ధారాదత్తం చేసినట్లయింది. శివసేన స్ట్రైక్ రేట్ బిజెపి తో పోలిస్తే చాలా తక్కువగా వుంది. ఆ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ అధ్వానంగా వున్నాయి. ఈ విధమైన పొత్తు వ్యూహాత్మక తప్పిదం. బలానికి తగ్గట్లు శివసేనను ఒప్పించాలి లేకపోతే ఒంటరిగా పోటీ చేసే సాహసోపేత నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఝార్ఖండ్ లో ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ ని సీట్ల దగ్గర పేచీతో దూరం చేసుకోవటం కాస్ట్లీ తప్పిదమని తర్వాత తేలింది. అంటే స్వంత పార్టీలోని సీట్ల ఆశావాదుల ఒత్తిడికి తలొగ్గి అధికారాన్ని పోగొట్టుకుంది.

ఇప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ పై వున్న వ్యతిరేకతను పసిగట్టటంలో విఫలమయ్యింది. చిరాగ్ పాశ్వాన్ యువకుడు, తేజస్వి యాదవ్ లాగా కొత్త తరానికి ప్రతినిధి. 7 శాతం ఓట్లు వున్న లోక్ జనశక్తి పార్టీని దూరం చేసుకోవటం కూడా కాస్ట్లీ తప్పిదమే. చివరిదాకా ఈ విషయాన్ని తేల్చకపోవటం ఎన్ డి ఎ వర్గాల్లో గందరగోళాన్ని సృష్టించింది. అగ్రవర్ణాలు ముఖ్యంగా భూమిహర్లు, రాజపుట్లు రెండుగా చీలారు. బ్రాహ్మణ,వైశ్య మిగతా అగ్రవర్ణాలలో పెద్ద చీలిక రాకపోయినా ఈ రెండు సామాజిక వర్గాల్లో కొంత భాగం ఎన్ డి ఎ కి కాకుండా చిరాగ్ పాశ్వాన్ కి మద్దత్తు నివ్వటం జరిగింది. బిజెపి తన వైఖరిని ముందుగానే చెప్పి వుండాల్సింది. చివరిదాకా నాన్చటంతో అగ్రవర్ణాల్లో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. అంటే జనతాదళ్,లోక్ జనశక్తి మధ్య సయోధ్య కుదర్చటంలో విఫలమయ్యింది. నితీష్ కుమార్ కి గట్టిగా చిరాగ్ పాశ్వాన్ తో ఎలాగైనా సయోధ్య చేసుకోమని చెప్పలేకపోయింది. చిరాగ్ పాశ్వాన్ ని మేము వదులుకోము అని ఖరాఖండిగా నితీష్ కుమార్ తో చెప్పివుంటే పరిస్థితులు వేరేగా ఉండేవి. అలా కాకుండా ఉండాల్సిన చోట గట్టిగా లేకుండా 2015 లో నితీష్ కుమార్ వదిలినా బిజెపితోనే వున్న చిరాగ్ పాశ్వాన్ ని వదులుకోవటం బిజెపి వ్యూహాత్మక తప్పిదం. మహారాష్ట్ర,ఝార్ఖండ్ లో మొట్టికాయలు పడినా బిజెపి ఆలోచనలు సంప్రదాయంగా వుండటం ఆశ్చర్యంగా వుంది. ఏ పార్టీ అయినా చలనశీలంగా లేకపోయినా,రిస్కు తీసుకోవటానికి ముందుకు రాకపోయినా ఫలితాలు ఇలానే వుంటాయి.

ఈ ఫలితాలు దేశ రాజకీయాలపై ఎలా వుంటాయి ?

ఇప్పట్లో బిజెపికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. సాధారణ ఎన్నికలకి ఇంకా మూడున్నర సంవత్సరాలు వున్నాయి. ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే మోడీకి ఎదురు ఉండకపోవచ్చు. ప్రజలు లోక్ సభ ఎన్నికలకి, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకి తేడా చూస్తున్నారు. అన్ని సర్వే సంస్థలూ చెప్పినదాన్నిబట్టి ఇప్పటికీ ప్రజల్లో మోడీపై సానుకూలతనే వుంది. అయితే రాబోయే పశ్చిమ బెంగాల్,అస్సాం ఎన్నికల్లో దీని ప్రభావం ఉండొచ్చు. నైతికంగా బిజెపి కి ఇది దెబ్బనే. మమతా బెనర్జీ దీనిని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. బిజెపి రాష్ట్ర ఎన్నికల్లో సరైన వ్యూహాలు అనుసరించటంలో విఫలమవుతుందని అర్ధమవుతుంది. పశ్చిమ బెంగాల్ లో కూడా ఇదే రిపీట్ కాబోతుందా? వేచి చూడాలి.