Unregulated Loan Apps : ప్రస్తుతం అనుమతి లేని ఎన్నో లోన్ యాప్ లు సామాన్యుల ప్రాణాలు తీస్తున్నాయి. ముందు లోన్లు ఇచ్చేటప్పుడు తియ్యగా మాట్లాడి కట్టబెట్టి తర్వాత కట్టలేకపోతే నరకం చూపిస్తే దారుణాలకు పాల్పడుతున్నాయి. లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఇప్పటికే ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు.. ఇంకా చేసుకుంటున్నారు కూడా. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకుని రాబోతుంది. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించేలా ముసాయిదాను ప్రభుత్వం రూపొందించింది. ఇది అమలైతే బంధువులకు ఇచ్చే రుణాలు మినహా వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్‌లు అప్పులు ఇవ్వడం ఇకపై కుదరదు.
ఇటీవల లోన్ యాప్‌ల వేధింపులతో వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. లైసెన్స్ లేకుండా ఆన్‌లైన్‌లో రుణాలు ఇచ్చే యాప్‌లు, బయట వడ్డీలకు ఇచ్చే వ్యాపారులకు పదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించేలా ముసాయిదాను సిద్దం చేసింది. ఇది అమల్లోకి వస్తే లోన్ యాప్‌లతో పాటు వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్టపడినట్లే. లోన్ యాప్‌ల ద్వారా ఇచ్చే లోన్లను నిషేధించడం, అలాగే ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ. 1 కోటి జరిమానా, అలాగే 10ఏళ్ల పాటు జైలు శిక్ష విధించే లక్ష్యంతో ఒక చట్టం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గత రెండేళ్లలో క్రమబద్ధీకరించబడని రుణ విధానాలలో నిమగ్నమైన వివిధ డిజిటల్ లోన్ యాప్‌ల వారి అనైతిక రుణాలు, దౌర్జన్యంగా నిర్వహిస్తున్న రికవరీ పద్ధతుల గురించి అనేక ఫిర్యాదులకు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఈ చొరవ తీసుకోనుంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ప్రజల అభిప్రాయాల నిమిత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్‌రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ (డ్రాఫ్ట్) బిల్లును నిషేధిస్తూ ముసాయిదా బిల్లును రిలీజ్ చేసింది. బ్యానింగ్ ఆఫ్ అన్‌రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ (BULA) అని పిలువబడే ప్రతిపాదిత చట్టం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఇతర నియంత్రణ సంస్థల నుండి అనుమతి లేకుండా పబ్లిక్ లెండింగ్‌లో పాల్గొనకుండా అనధికార వ్యక్తులు, సంస్థలను నిషేధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ముసాయిదా బిల్లులో ఇలా పేర్కొంది, “బంధువులకు రుణాలు ఇవ్వడం మినహా, రుణగ్రహీతల ప్రయోజనాలను పరిరక్షించేందుకు క్రమబద్ధీకరించని రుణ కార్యకలాపాలను నిషేధించడానికి ఒక సమగ్ర యంత్రాంగాన్ని అందించడానికి ఒక చట్టం.”గా ఉంది.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయకులు ప్రమాదకరమైన యాప్‌ల ఉచ్చులో పడి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావడం లేదా లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. దీని కారణంగా, కేంద్ర ప్రభుత్వం గతంలో సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను వారి ప్లాట్‌ఫామ్‌లలో మోసపూరిత లోన్ యాప్‌ల ప్రమోషన్ లేదా ప్రకటనలు ఉండకుండా చూసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, గూగుల్ సెప్టెంబర్ 2022 నుంచి ఆగస్టు 2023 మధ్య తన ప్లే స్టోర్ నుండి 2,200 మోసపూరిత లోన్ యాప్‌లను తొలగించింది.