AP Politics: ఈసారి ఏపీ ఎన్నికల్లో సరికొత్త ఎత్తుగడలు.. సరికొత్త పొత్తు పొడుపులు పొడుస్తున్నాయి. సీట్ల వ్యవహారం కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ముఖ్యంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో ఓ ఎంపీ సీటుకు సంబంధించి అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి.. పార్లమెంటు స్థానానికి సంబంధించి ఒక మాజీ మంత్రి అల్లుడికి ఇవ్వడం వెనుక వేలకోట్ల వ్యవహారం నడిచిందని తెలుస్తోంది. ఒకప్పుడు అధికారం లో ఉన్న ఆ పార్టీలో ఆ మాజీ మంత్రి అంటే పడని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారే ఈ విషయానికి సంబంధించి లీక్ లు ఇస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం ను పదవి నుంచి తొలగించడంలో ఆ మాజీ మంత్రి కీలకపాత్ర పోషించారనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. దాన్ని అడ్డం పెట్టుకొని అప్పట్లో ఆ మాజీ సీఎం అల్లుడు( తర్వాత సీఎం అయ్యారు) దగ్గర ఆ మాజీ మంత్రి తనకు ఇష్టం వచ్చినట్టుగా పనులు చేయించుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఉభయగోదావరి జిల్లాలోని కీలకమైన పార్లమెంటు స్థానాన్ని తన అల్లుడికి ఇప్పించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
సదరు మాజీ మంత్రి అల్లుడి తండ్రి కాంట్రాక్టర్ గా ఏపీ ప్రజలకు సుపరిచితుడు. ఆ మాజీ మంత్రి అల్లుడి స్వస్థలం రాయలసీమ. ఉభయగోదావరి జిల్లాలో ఇంతవరకు రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల ఇచ్చిన చరిత్ర లేదు. అలాంటి నేపథ్యంలో ఆ పార్టీ అధినేత ఆ వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వడం వెనుక భారీ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయట. ప్రత్యక్ష ఎన్నికల్లోనే ఆ మాజీ మంత్రికి దిక్కు లేదని.. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఉభయగోదావరి జిల్లాల్లో కీలకమైన పార్లమెంట్ స్థానంలో నిలబడితే ఎలా గెలుస్తారనే ప్రశ్న వ్యక్తమౌతోంది. వాస్తవానికి ఆ పార్లమెంట్ స్థానానికి ఆ మాజీ మంత్రి తన అల్లుడిని తీసుకురావడం వెనుక భారీగానే ఆర్థిక వ్యవహారాలు నడిచాయని.. వాటికి సంబంధించిన ఆధారాలతో సహా ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. మొన్నటిదాకా ఆ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఇన్ని రోజులపాటు పని చేసుకుంటూ పోయారు. వాస్తవానికి ఆయనను అనూహ్యంగా పక్కన పెట్టారు. ఎందుకు పక్కన పెట్టారనే దానికి ఆ పార్టీ నాయకుల వద్ద సమాధానం లేదు. ఆయనను కాదని.. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టాలనుకుంటే.. అది వేరే విషయం.. కానీ ఆకస్మాత్తుగా ఆ మాజీమంత్రి అల్లుడిని తీసుకురావడం వెనక కారణం ఏముంటుందనేది ఇంతవరకు ఎవరికీ అంతు పట్టలేదు.
అయితే ఆ విషయాన్ని ఆ మాజీ మంత్రి వ్యతిరేకులు బయటి ప్రపంచానికి లీక్ చేశారు. ఆ పార్లమెంట్ పరిధిలో పోలవరం అనే అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ప్రాజెక్టు నిర్మాణంలో వేలకోట్ల పనులను ఆ మాజీ మంత్రి వియ్యంకుడికి అప్పట్లో కట్టబెట్టారని ప్రస్తుత సీఎం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తీవ్రంగా ఆరోపించారు. అయినప్పటికీ ఆ ప్రాజెక్టు పరిధిలో వచ్చే పార్లమెంట్ స్థానానికి మాజీమంత్రి అల్లుడితో పోటీ చేయిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఈసారి ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు పోలవరం పనులు తమ చేతిలో పెట్టుకోవచ్చనేది వారి ప్రణాళికగా ఉందని ప్రచారం జరుగుతోంది.. అందుకే పార్లమెంటు స్థానానికి తామే నాయకత్వం వహిస్తే బాగుంటుందని లక్ష్యంతోనే గతంలో పనిచేసిన పార్లమెంట్ ఇన్ ఛార్జ్ ను పక్కన పెట్టారని ప్రచారం జరుగుతున్నది. ఈ ఆర్థిక వ్యవహారాల గురించి తెలియక.. ఆ పార్టీలోనే రకరకాలుగా మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. అయితే ఇందులో ఓ వర్గం మాత్రం అత్యంత తెలివిగా లీక్ లు ఇచ్చుకుంటూ వెళ్లడం విశేషం. వీటిని ఆ మాజీ మంత్రివర్గం తోసిపుచ్చుతుండడం గమనార్హం.