The bride who canceled the marriage to demand dowry : ఇప్పటి దాకా కన్యాదానం చూశాం. అల్లుడు అడిగినంత కట్నం, కోరినంత బంగారం, నచ్చిన బట్టలను కొనుగోలు చేసే అత్తామామలను చూశాం. కోరినంత డబ్బు ఇవ్వకపోవడంతో ఆగిపోయిన పెళ్లిళ్లను చూశాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అన్ని కులాల్లో అమ్మాయిల కొరత తీవ్రంగా ఉంది. ఫలితంగా అమ్మాయి దొరికితే చాలు పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు సిద్ధమైపోతున్నారు. కులములన్నీ కూలిపోవు, మతములన్నీ మాసిపోవు అనే నానుడిని నిజం చేస్తున్నారు. చాలా చోట్ల అమ్మాయిలు దొరక్క చాలా మంది పెళ్లిళ్లే చేసుకోవడం లేదు. సోలో బతుకే సో బెటరూ అని పాటలు పాడేస్తున్నారు. ఇలా సింగిల్ పాటలు పాడలేక, ఓ అమ్మాయితో మింగిల్ అవుదామని అనుకున్న ఓ యువకుడు తమ కులంతో సంబంధం లేని ఓ యువతిని మధ్యవర్తులు ద్వారా చూశాడు. నచ్చింది ఓకే చెప్పాడు. అమ్మాయి కూడా ఇష్టపడింది. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. తనకు కన్యాశుల్కం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని అమ్మాయి షరతు పెట్టింది. దీంతో అబ్బాయి తరఫున వారు రెండు లక్షల కట్నం, పది తులాల బంగారం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
అడిగినంత కట్నం ఇవ్వలేదని
అడిగినంత కట్నం ఇవ్వలేదని వరుడి తరఫువారు పెళ్లిలో గొడవకు దిగడం.. ఈ కారణంగా పెళ్లి వాయిదా పడటమో, రద్దవడమో చూశాం.. చూస్తున్నాం! మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోనూ ఇలానే ఓ వివాహం ఆగిపోయింది. కాకపోతే ఇక్కడ.. తమకు ఇచ్చిన కట్నం సరిపోలేదని పెళ్లికి నిరాకరించింది పెళ్లి కొడుకో, అతడి కుటుంబసభ్యులో కాదు.. పెళ్లి కూతురు, ఆమె కుటుంబసభ్యులు! కన్యాశుల్కం రూపంలో ఇచ్చిన డబ్బు తిరిగిరాలేదని, పెళ్లి ఏర్పాట్లకు తమకు రూ.7లక్షల దాకా ఖర్చయిందని వరుడి కుటుంబీకులు గగ్గోలు పెడుతున్నారు! బాధితులైన వరుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. పోచారం మునిసిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌గూడకు చెందిన యువకుడి వివాహం కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో నిశ్చయమైంది. అబ్బాయి తరుపు వారు అమ్మాయికి రూ.2 లక్షల ఎదురుకట్నం ఇచ్చేలా కులపెద్దల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుని ఆ మొత్తాన్ని ఇచ్చేశారు.
చివర్లో ట్విస్ట్
ఘట్‌కేసర్ మునిసిపాలిటీ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం రాత్రి 7:21 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. బంధుమిత్రులకు శుభలేఖలు ఇవ్వడమూ జరిగిపోయింది. వరుడు కుటుంబ సభ్యులు, బంధువులు అంతా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ముహూర్త సమయం దగ్గర పడతున్నా వఽధువు, ఆమె తరఫువారెవరూ రాకపోవడంతో వరుడి కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. తమకు ఇచ్చిన ఎదురుకట్నం రూ.2 లక్షలు సరిపోదని, మరింత డబ్బు కావాలని వధువు పట్టుబడుతోందని.. అసలు ఆమెకు ఈ పెళ్లే ఇష్టం లేదని ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో వరుడి కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులను అశ్రయించారు. కులపెద్దలు జోక్యం చేసుకొని స్టేషన్ వద్దకు వధువు కుటుంబీకులను పిలిపించారు. వారెంత నచ్చజెప్పినా వధువు కుటుంబీకులు వినిపించుకోలేదు. ఫలితంగా పెళ్లి ఆగిపోయింది. అయితే సదరు యువతికి ఓ యువకుడితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు కూడా అమ్మాయికి ఇష్టంలేనప్పుడు తామేమీ చేయలేమని చెబుతున్నారు. పెళ్లి రద్దు కావడంతో ఆ యువకుడు తీవ్ర నిరాళలో కూరుకుపోయాడు.