T20 World Cup 2024: ఇలాంటి రికార్డులు సృష్టించిన తర్వాత.. అమెరికా అనామక జట్టు ఎలా అవుతుంది?

అమెరికా కెనడా జట్టుపై 195 పరుగుల లక్ష్యాన్ని చేదించి మూడవ జట్టుగా రికార్డు సృష్టించింది. జోన్స్, గోస్ నెలకొల్పిన 131 పరుగుల భారీ భాగస్వామ్యం కూడా అనేక రికార్డులను బద్దలు కొట్టింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 2, 2024 1:07 pm

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ ను ఈసారి వెస్టిండీస్, అమెరికా వేదికలుగా నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి ఈ టోర్నీ ప్రారంభమైంది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు.. ఈ పొట్టి సమరంలో పాల్గొనే జట్లల్లో అమెరికా కూడా ఉండడంతో చాలామంది ఆశ్చర్యపోయారు.. అసలు అమెరికాకు క్రికెట్ కు ఏ సంబంధమని.. బేస్ బాల్ ఆడే ఆ జట్టుకు క్రికెట్ ఏం ఎక్కుతుందని హేళన చేసిన వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ అమెరికా జట్టు వాటిని పట్టించుకోలేదు. పైగా టి20 వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ జట్టుతో మూడు టి20 సిరీస్ ఆడింది. అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి, సిరీస్ దక్కించుకుంది. ఇప్పుడేమో ఏకంగా టి20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్లో అదిరిపోయే ఆట తీరు ప్రదర్శించింది. సంచలన బ్యాటింగ్ తో కెనడాపై 7 వికెట్ల తేడాతో నెగ్గింది.. ఈ విజయం ద్వారా తమది అదృష్టం వల్ల ఏర్పడిన జట్టు కాదని.. కష్టంతో గెలిచిన జట్టు అని నిరూపించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అమెరికా కెనడా జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కెనడా జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 194 పరుగులు చేసింది. నవనీత్ దాలివాల్ 61, నికోలస్ కిర్టన్ 51 పరుగులతో ఆకట్టుకున్నారు. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్, హర్మిత్ సింగ్, కోరి అండర్సన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు..

ఈ లక్ష్యాన్ని అమెరికా 17.4 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది. జోన్స్ 90*, గోస్ 65 పరుగులు చేసి అమెరికా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఒకానొక దశలో 8 ఓవర్లలో అమెరికా రెండు వికెట్లు నష్టపోయి 48 పరుగులు చేసింది. కానీ, ఈ దశలో జోన్స్ – గోస్ క్రీజ్ లోకి వచ్చారు. అమెరికా ఆటతీరును పూర్తిగా మార్చేశారు. మూడో వికెట్ కు 131 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అమెరికా జట్టును గెలిపించారు. ఈ క్రమంలో అమెరికా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. టి20 లలో అమెరికా జట్టుకు ఇదే హైయెస్ట్ రికార్డ్ చేజింగ్. ఇటీవల కెనడాపై అమెరికా జట్టు 169 పరుగుల చేదన రికార్డును బద్దలు కొట్టింది. ఇక టి20 వరల్డ్ కప్ హిస్టరీలో మూడవ అత్యధిక విజయవంతమైన చేదన రికార్డును సృష్టించిన జట్టుగా అమెరికా వినతికెక్కింది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాలలో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా కొనసాగుతున్నాయి. సౌత్ ఆఫ్రికా విధించిన 230 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించింది. ఇప్పటికీ ఇదే హైయెస్ట్ రికార్డుగా కొనసాగుతోంది. వెస్టిండీస్ విధించిన 206 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా చేదించి.. రెండవ స్థానంలో ఉంది..

అమెరికా కెనడా జట్టుపై 195 పరుగుల లక్ష్యాన్ని చేదించి మూడవ జట్టుగా రికార్డు సృష్టించింది. జోన్స్, గోస్ నెలకొల్పిన 131 పరుగుల భారీ భాగస్వామ్యం కూడా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. అమెరికా తరఫున ఏ మ్యాచ్ లో అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యం. అంతకుముందు ఈ రికార్డు మోడానీ – గజనాథ్ సింగ్ (110 రన్స్) పేరు మీద ఉండేది. జోన్స్ – గోస్ టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఆల్ టైం ఘనతను సాధించారు.. అత్యధిక ఓవర్ రన్ రేట్ తో రన్స్ చేసి.. శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. వీరిద్దరూ 14.29 రన్ రేట్ తో సరికొత్త పార్టనర్ షిప్ నమోదు చేశారు.