Online Fraud: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇన్నాళ్లు ఓటీపీ సాయంతో యూజర్ల బ్యాంకు అకౌంట్ల నుంచి సొమ్ము కాజేస్తున్నారు. టెక్నాలజీతోపాటు దొంగలు కూడా అప్‌డేట్ అవుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము కాజేస్తున్నారు. తాజాగా ఓ యువతికి.. తాము దేవుడు ఇచ్చిన అన్నయ్యలం అని పరిచయం చేసుకున్నారు. చివరకు అందినకాడికి దోచుకున్నారు. ఆలస్యంగా మోసపోయానని గుర్తించిన లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం..
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఓ మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో రవికుమార్, రాణాప్రతాప్‌సింగ్, మనోస్‌కుమార్‌లు పరిచయం అయ్యారు. తమపై నమ్మకం కలిగేలా ఆ మహిళతో మెలిగారు. రోజులు గడుస్తున్న కొద్దీ వారి మాటలు కోటలు దాటాయి. ఎక్కడలేని ప్రేమ ఒలకబోశారు. సొంత అన్నయ్యలు కూడా చూసుకోని విధంగా చూసుకున్నారు. ఆన్‌లైన్‌లో పరిచయం తర్వాత ఆఫ్‌లైన్‌లో పరస్పరం ఫోన్ నంబర్లు ఇచ్చుకునే వరకు వెళ్లింది. ఉదయం గుడ్‌మార్నింగ్, మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్‌నూర్, సాయంత్రం గుడ్ ఈవినింగ్, రాత్రి గుడ్‌నైట్ మెస్సేజ్‌లతోపాటు పండుగలు, పబ్బాలు, వేడుకలకు శుభాకాంక్షలు చెప్పుకోవడం, వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోవడం వరకు వెళ్లింది.
పెళ్లి కుదిరిందని..
ఈ క్రమంలో సదరుయువతి ఓ రోజు తనకు పెళ్లి కుదిరిందని ఇన్‌స్టాగ్రామ్ అన్నయ్యలకు తెలిపింది. ఈమేరకు సోషల్ మీడియాలోనే మెసేజ్ కూడా పెట్టింది. దీంతో ఆ ముగ్గురికి ఆమె డబ్బులు కాజేయాలన్న ఆలోచన కలిగింది. ఈమేరకు పక్కాగా ప్లాన్ వేశారు.
ప్లాన్ అమలు ఇలా..
ముందుగా వేసుకున్న ప్లాన్‌లో భాగంగా మనోజ్‌కుమార్ యవతికి ఫోన్ చేసి పెళ్లి రోజు సందర్భంగా ఖరీదైన కానుక ఇస్తామని హామీ ఇచ్చాడు. ఇందుకు ఆధార్, ఫొటోలు ఇతర డాక్యుమెంట్లు అవరసమని చెప్పాడు. వెనకా ముందు ఆలోచించకుండా సదరుయువతి మనోజ్‌కుమార్ అడిగినవన్నీ షేర్ చేసింది.
ఎయిర్ పోర్టు అధికారులు పట్టుకున్నారని..
అనంతరం అసలు కథ మొదలు పెట్టారు. తాను కొన్న ఖరీదైనగిఫ్ట్‌ను విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు అధికారుల పట్టుకున్నారని యువతికి చెప్పారు. దానిని విడిపించేందుకు కొంత డబ్బులు కావాలని మనోజ్ యువతికి ఫోన్ చేశాడు. అయితే యువతి డబ్బులు చెల్లించేందుకు అంగీకరించలేదు. దీంలో అప్పటి వరకు అన్నయ్య అని చెప్పినవారు బెదిరింపులకు దిగడం మొదలుపెట్టారు.
అధికారులకు ఫిర్యాదు చేస్తామని..
తాము చెప్పినట్లుగా వినకుంటే.. సీబీఐ, క్రైంబ్రాంచ్ లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయిస్తామని హెచ్చరించాడు. దీంతో వాళ్లకు డబ్బులు పంపడం మొదలు పెట్టింది. క్యూ ఆర్‌కోడ్ స్కాన్ చేసి రూ.1.94 లక్షలు బదిలీ చేసింది.
మోసపోయానని గుర్తించి..
చివరకు బాధిత యువతి తాను మోసపోయినట్లు గుర్తించింది. ఈమేరకు పోలీసులను ఆశ్రయించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.