RSS Modi conflict: ఆర్‌ఎస్‌ఎస్… రాజకీయాల గురించి తెలిసినవారికి పరిచయం అక్కరలేదు. హిందుత్వ ఎజెండాతో ఏర్పడిన ఈ ఆర్‌ఎస్‌ఎస్ నుంచే జనసంఘ్ ఏర్పడింది. ఇది బీజేపీ పూర్వ రూపం. హిందుత్వాని విస్తరించడం, భారత దేశాన్ని హిందుత్వ దేశంగా మార్చడమే వీటి లక్ష్యం. ఇందులో సిద్దాంతానికే ప్రాధాన్యం ఉంటుంది. వ్యక్తి ప్రాధాన్యం ఉండదు. జన్ సంఘ్ నుంచి బీజేపీ రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా పనిచేస్తూ వచ్చింది.. చేస్తోంది. 2024 ఎన్నికల వరకూ బీజేపీ గెలుపు వెనుక ఆర్‌ఎస్‌ఎస్ ఉంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎవరూ బయటకు కనిపించరు. కానీ పార్టీ కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. ఓటర్ల నాడిని పట్టుకుంటారు. ఓట్లు బీజేపీ వైపు మళ్లిస్తారు. ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా ఆర్‌ఎస్‌ఎస్ కారణం. అయితే తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల 75 ఏళ్లు దాటిన నాయకులు పదవుల నుంచి తప్పుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం 75 ఏళ్లు నిండేది ప్రధాని నరేంద్రమోదీకే. పరోక్షంగా మోదీ దిగిపోవాలని ఆయన వెల్లడించారు. అయితే ఇంతకాలం మోదీ విజయానికి కారణమైన ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడు మోదీ దిగిపోవాలని కోరడంపై చర్చ జరుగుతోంది.
Also Read: ‘కచ్చతీవు’.. ఈ శ్రీలంక దీవిపై మోడీ-స్టాలిన్ కన్ను ఎందుకు?
మోదీ లేకుండా బీజేపీ మనుగడ..?
మోదీ లేకుండా బీజేపీ మనుగడ సవాలుగా ఉంటుంది. మోదీ బ్రాండ్ బీజేపీకి జాతీయ స్థాయిలో బలమైన ఓటు బ్యాంకును సృష్టించింది. 2014, 2019 ఎన్నికల్లో ఆయన నాయకత్వం కీలకంగా ఉంది. అయితే, 2024 ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లకు పరిమితమైంది, ఇది ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆందోళన కలిగించింది. మోదీ స్థానంలో యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా వంటి నాయకులు ఉన్నప్పటికీ, మోదీ స్థాయి జాతీయ ఆకర్షణ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు మోదీ అడ్డంకా?
మోదీ నాయకత్వంలో హిందుత్వ ఎజెండా (ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం) విజయవంతమైంది. అయినప్పటికీ, ఆయన వ్యక్తిగత కీర్తి, ఏకాధిపత్య శైలి ఆర్‌ఎస్‌ఎస్‌కు సమస్యగా మారింది. ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాగత బలాన్ని, సామూహిక నాయకత్వాన్ని నమ్ముతుంది, కానీ మోదీ చుట్టూ ఏర్పడిన వ్యక్తిపూజ దీనికి విరుద్ధం. మోదీ చుట్టూ ఏర్పడిన వ్యక్తిపూజ బీజేపీని ఒక వ్యక్తి కేంద్రిత పార్టీగా మార్చిందన్న విమర్శలు ఉన్నాయి. ‘‘మోదీ కీ గ్యారంటీ’’ వంటి నినాదాలు 2024 ఎన్నికల్లో కేంద్ర బిందువుగా ఉన్నాయి. ఇది ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు విరుద్ధమని, సంస్థను బలహీనపరుస్తుందని భగవత్ సూచించారు.
ఆర్‌ఎస్‌ఎస్ లేకుండా బీజేపీ బలం..
దశాబ్దాలుగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. కానీ ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా 2024లో బీజేపీ స్వయం సమర్థమైందని, ఆర్‌ఎస్‌ఎస్ సహాయం అవసరం లేదని చెప్పారు. బీజేపీ ఆర్థికంగా, సంస్థాగతంగా బలపడింది, కానీ ఆర్‌ఎస్‌ఎస్ శాఖలు, కార్యకర్తలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. 2024లో ఆర్‌ఎస్‌ఎస్ పూర్తిగా పాల్గొనకపోవడం వల్ల బీజేపీ సీట్లు తగ్గాయని విశ్లేషణ.
Also Read: కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ: ఎవరి ప్రగతి ఎంత?
2029 ఎన్నికలు, రిటైర్మెంట్ వివాదం..
ఆర్‌ఎస్‌ఎస్ మోదీని 75 ఏళ్ల తర్వాత తప్పుకోమని కోరుతోంది. కానీ బీజేపీ నాయకులు (అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్) 2029 వరకు మోదీ నాయకత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విపక్ష నాయకులు (సంజయ్ రౌత్, జైరామ్ రమేష్) మోదీ రిటైర్మెంట్‌ను డిమాండ్ చేస్తున్నారు, కానీ బీజేపీలో ఆయన స్థానం బలంగా ఉంది.