Virat Kohli: నాయకుడంటే నడిచేవాడు కాదు నడిపించేవాడు.. కెప్టెన్ అంటే ఒక్కడే వెళ్లడం కాదు.. దారిలో అందరిని తీసుకెళ్లడం.. ఇవన్నీ మనం చిన్నప్పటినుంచి చదువుకుంటూనే ఉన్నాం కదా. కానీ నాయకుడు అనే పదానికి అతడు కొత్త నిర్వచనం చెప్పాడు. కెప్టెన్ అనే పదానికి సరికొత్త భాష్యాన్ని వెల్లడించాడు. ఆటతీరుతో.. శరీర సామర్థ్యాన్ని కాపాడుకునే తీరుతో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.
Also Read: CT ఫైనల్ లో కులదీప్ యాదవ్ స్థానంలో.. వాషింగ్టన్ సుందర్.. కారణం అదేనా?
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సెంచరీ కోల్పోయినప్పటికీ.. విరాట్ కోహ్లీ స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ కోసం చూసుకోకుండా.. ఇష్టానుసారంగా షాట్లు కొట్టకుండా.. తన సహజ శైలికి భిన్నంగా నేర్పరితనాన్ని ప్రదర్శించాడు. ఒక్కో పరుగు తీసుకుంటూ చాప కింద నీరు లాగా వ్యాపించాడు. శ్రేయస్ అయ్యర్ నుంచి మొదలుపెడితే కేఎల్ రాహుల్ వరకు మెరుగైన భాగస్వామ్యాలు నిర్మించాడు. ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చగొట్టే బంతులు వేస్తున్నప్పటికీ.. ఏమాత్రం రెచ్చిపోకుండా నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని ప్రదర్శించాడు. అందువల్లే టీమిండియా ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. మైదానం ఏమాత్రం సహకరించకపోయినా.. ఆస్ట్రేలియా విధించిన లక్ష్యాన్ని సులువుగా చేదించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించడంతో.. అప్పటినుంచి ఇప్పటివరకు అతనిపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది.
స్ఫూర్తిదాయకమైన పరుగులు
విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రమే కాదు అనేక సందర్భాలలో స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా ఐసిసి నిర్వహించిన మెగా టోర్నీలలో అతడు తన సత్తా చాటాడు. 2013లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్లో 53* పరుగులు చేశాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో 43 పరుగులు చేశాడు. 2014లో టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 2014 టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో 77 పరుగులు చేశాడు. 2016 t20 వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 2017లో ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్లో 96 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 2022లో టి20 వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో 50 పరుగులు చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో 117 పరుగులు చేశాడు. 2023 వన్డే వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో 54 పరుగులు చేశాడు.. 2024లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో 76 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 84 పరుగులు చేసి విరాట్ కోహ్లీ ఆకట్టుకున్నాడు. తను చేసిన పరుగుల ద్వారా ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా ఫైనల్ వెళ్ళింది. న్యూజిలాండ్ జట్టుతో ట్రోఫీ కోసం ఆదివారం తలపడనుంది..
Also Read: CT రద్దయితే ఐసిసి ఏం చేస్తుంది? ఛాంపియన్ ను ఎలా నిర్దేశిస్తుంది?