Puneeth raj kumar Video:సోషల్ మీడియా వచ్చాక ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. తిమ్మిని బమ్మిని చేయగల సృజనశీలురు ‘వాట్సాప్ యూనివర్సిటీ’ల్లో పుట్టుకొస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం ఆ ఇండస్ట్రీనే కాదు.. తెలుగు, తమిళ, మలయాళ చిత్ర సీమల్లోనూ పెద్ద వార్త అయ్యింది. తెలుగు హీరోలు అందరూ పునీత్ మరణానికి సంతాపం తెలిపారు.
నిండా 50 ఏళ్లు కూడా లేని పునీత్ మరణంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే పునీత్ జిమ్ లో ఎక్సర్ సైజులు చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో పరిస్థితి విషమించి చనిపోయాడు. ఈవార్త బయటకు రాగానే ఒక జిమ్ లో ఎక్సర్ సైజ్ చేసి మరణించిన ఒక వీడియో వైరల్ అయ్యింది. అది పునీత్ రాజ్ కుమార్ దేనని చాలా మంది షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.
కానీ అది ఫేక్ వీడియో అని తాజాగా తేలింది. ‘అల్లా రెహమ్ కారే’ అనే యువకుడు జిమ్ లో వర్కవుట్ చేసి గుండెపోటుతో మరణించాడు. అతడికి గడ్డం, మీసాలతో గుబురుగా ఉన్నాడు. అతడినే పునీత్ రాజ్ కుమార్ అని నమ్మిస్తూ చాలా మంది వైరల్ చేస్తున్నారు. నిజానికి అతడి ముఖం చూస్తేనే పునీత్ కాదని తెలుస్తున్నా వైరల్ చేసేస్తున్నారు. ఇప్పుడీ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
-వైరల్ అవుతున్న పునీత్ రాజ్ కుమార్ ఫేక్ వీడియో