https://oktelugu.com/

Hyderabad : ఆది, సోమవారాల్లో వైన్‌ షాపులు బంద్‌.. ఈ మార్గాల్లో ఆంక్షలు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. ఎందుకంటే?

తెలంగాణ ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం తెచ్చే శాఖల్లో ఎక్సైజ్‌ శాఖ ఒకటి. ఈ ఎక్సైజ్‌ శాఖ మందు బాబులకు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. రెండు రోజులపాటు మద్యం షాపులు మూసివేయాలని నిర్ణయించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 27, 2024 / 10:32 AM IST
    Follow us on

    Hyderabad : మద్యం ప్రియులకు ఇది కొద్దిగా చేదు వార్తే. విశ్వనగరం హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఆది, సోమవారాలు వైన్స్‌ క్లోజ్‌ చేయాలని ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మహంకాళీ బోనాల పండగ నేపథ్యంలో హైదరాబాద్‌ వ్యాప్తంగా నాన్‌ ప్రాప్రయిటరీ క్లబ్‌లు, స్టార్‌ హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు అన్ని వైన్‌ షాపులు మూసివేయపడతాయని నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జూలై 28 ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్‌ షాపులన్నీ మైసివేస్తారు. సౌత్‌ ఈస్ట్‌ చాంద్రాయణగుట్ట, బండ్లగూడ వంటి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు మద్యం దుకాణాలు మూసివేస్తారు. సౌత్‌ జోన్‌లో చార్మినార్, కమాటిపుర, హుస్సేనీ ఆలం, ఫలక్‌నుమా, మొఘల్‌పురా, చత్రినాక, షాలిబండ, మీర్‌చౌక ప్రాంతాల్లో జూలై 28న ఉదయం 6 గంటల నుంచి రెండు రోజులపాటు కల్లు, వైన్‌ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌ లు, మద్యం విక్రయించే సంస్థలు మూసి ఉంటాయని నగర సీపీ వెల్లడించారు. మరోవైపు బోనాల జాతర అంటేనే మద్యం, మాంసం ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖ ముందస్తుగా మద్యం దుకాణాల బంద్‌ సమాచారం ఇవ్వడంతో నగరంలోని వైన్‌ షాపుల యజమానులు శుక్ర, శనివారాల్లో మద్యం డంప్‌ చేసుకున్నారు. ఈమేరు ఇప్పటికే మద్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రెండు రోజులు భారీగా మద్యం అమ్మకాలు సాగుతాయని మద్యం షాపుల యజమానులు పేర్కొంటున్నారు. రెండు రోజుల బంద్‌ కారణంగా ఆదాయంలో ఎలాంటి తగ్గుదల ఉండదని పేర్కొంటున్నారు. వీకెండ్‌ కావడం, పండుగ నేపథ్యంలో అందరూ ముందుగానే మదం కొనుగోలు చేసి పెట్టుకుంటారని పేర్కొంటున్నారు. దీంతో ఆది, సోమవారాల్లో జరిగే బిజినెస్‌ శుక్ర, శనివారాల్లో జరుగుతుందని పేర్కొంటున్నారు.

    నెల రోజులుగా పండుగ శోభ..
    ఇదిలా ఉంటే.. ఆషాఢ మాసం సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌ జిల్లాల వ్యాప్తంగా నెల రోజులుగా జాతర కొనసాగుతోంది. ప్రతీ ఆదివారం, బుధవారం, శుక్రవారాల్లో అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే ఆదివారాల్లో నిర్వహిస్తున్న గోల్కొండ, బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని, మహంకాళి బోనాల సందర్భంగా భారీగా భక్తులు పాల్గొంటున్నారు. అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేస్తున్నారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

    రాష్ట్రం నలు మూలల నుంచి..
    ఇక ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో మహంకాళి బోనాలు మరింత ఘనంగా జరుగనున్నాయి. ఈ క్రమంలో శ్రీమహంకాళి లాల్‌ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా అంబారీ పై అమ్మవారి ఊరేగింపు వేడుకలు జరగనున్నాయి. ఓల్డ్‌ సిటీలోని పలు ప్రాంతాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. భారీ ఎత్తున భక్తులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఆయా రూట్లలో వాహనాలను కూడా మళ్లించనున్నారు. దీనిపై ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ వేడుకలకు హైదరాబాద్‌ వాసులే కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా నగరానికి వెళ్తారు. శనివారం సాయంత్రమే అందరూ నగరం బాట పట్టే అవకాశం ఉంది. సోమవారం సెలవు కావడంతో రెండు రోజులు బోనాల జాతర అనంతరం తిరిగి ఇళ్లకు వస్తారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లర్లు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో భక్తులు ఇబ్బంది పడకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో. ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నారు. ఆలయాల ఆవరణలో షామియానాలు వేశారు. వర్షం కారణంగా ఆలయాల ఆవరణలో పారిశుధ్యం లోపించకుండా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టనున్నారు.