Banana Tiles: టైల్.. ఇంటికి, ఆఫీస్‌లకు అందం తెచ్చే మెటీరియల్స్‌లో టైల్స్ ఒకటి. వివిధ డిజైన్స్‌లో, ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన టైల్స్ ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ టైల్స్ అన్ని సిరామిక్‌తో తయారు చేస్తారు. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా బెంగళూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు అరటి నారతో టైల్స్ తయారు చేసి ఔరా అనిపించారు. వాటిపై రెసిన్ పూత కారణంగా వాటర్ ప్రూఫ్‌గా ఉంటాయి. ఈ టైల్స్ సిరామిక్ టైల్స్ కన్నా ఏడు రెట్లు బలంగా ఉన్నట్లు వివిధ పరీక్షల ద్వారా నిరూపించారు.
సిరిమిక్ టైల్స్ కన్నా దృఢంగా..
సాధారణంగా సిరామిక్‌తో తయారు చేసిన టైల్స్ 1,300 న్యూటన్‌ల వరకు ఒత్తిడిని తట్టుకుంటాయి. కానీ, అరటి ఫైబర్‌తో ఇంజినీరింగ్ విద్యార్థులు తయారు చేసిన టైల్స్ మాత్రం పరీక్షలో 7,500 న్యూటన్‌ల ఒత్తిడిని తట్టుకున్నాయి. ఫ్లెక్చరల్ పరీక్షలో 52.37 శాతం మెగాపాస్కల్ వద్ద నమోదు చేసి బరువు మోసే సామర్థ్యం సిరామిక్ టైల్స్‌కన్నా ఎక్కువ అని నిరూపించాయి.
-అధిక బలానికి కారణాలు ఇవీ..
అరటి ఫైబర్‌తో తయారు చేసిన టైల్స్ అధిక తన్యత బలం కారణంగా అధిక ఒత్తిడిని తట్టుకుంటాయని తేలింది.. కాల్షియం కార్బొనేట్, సోడియం హైడ్రాక్సైడ్ వంటి గట్టిపడే రసాయన ద్రావణాలు రెండు పదార్థాలను కలపడం ద్వారా వీటిని తయారు చేశారు. దాని నిరోధకత, తన్యత బలం, మందాన్ని పెంచుతాయని వీటిని తయారు చేసిన ఎంజేవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన నలుగురు విద్యార్థులలో ఒకరైన అమిత్ కుమార్ తెలిపారు. ఏడు లేయర్లుగా వీటిని రూపొందించినట్లు వెల్లడించారు. రెసిన్ పూత పూయడానికి ముందు వాక్యూమ్‌ని ఉపయోగించి గట్టి ప్యాకింగ్ ఉండేలా ఈ షీట్‌లు 0 డిగ్రీలు, 30 డిగ్రీలు, 60 డిగ్రీల కోణంలో ఉంచినట్లు అమిత్ తెలిపారు.
-తయారీ ఇలా..
సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో అరటి నారను నానబెట్టడం ద్వారా ప్రక్రియ ప్రారంభమవుతుంది. తరువాత గట్టిపడే సాధనాన్ని ఉపయోగించారు. టైల్ కాఠిన్యాన్ని మెరుగుపరచడానికి కాల్షియం కార్బోనేట్ 0% నుంచి 20% వరకు వివిధ శాతాలలో చేర్చబడుతుంది. తర్వాత నీటి నిరోధకతను కొలవడానికి అదనపు పరీక్షలు నిర్వహించబడతాయి. రెసిన్‌తో పూత పూసిన తర్వాత టైల్స్ జలనిరోధితంగా ఉండేలా చూస్తారు. మెటీరియల్ ఎంపిక, కాంపోజిట్ మెటీరియల్ కల్పన, యాంత్రిక లక్షణాల పరీక్షతో సహా మొత్తం ప్రక్రియ సాధారణంగా సుమారు రెండు నెలల వరకు ఉంటుంది.
-తుది పరీక్షలు..
ఇక ఈ ప్రత్యేకమైన టైల్స్‌ను తయారు చేసిన మెకానికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు అమిత్, కార్తీక్, ప్రసన్న పృథ్వీరాజా వీటిని వాణిజ్యపరంగా విక్రయించడానికి మరిన్ని పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. తుది పరీక్షల తర్వాత మార్కెట్‌లోకి తీసుకొస్తామని వెల్లడించారు.