https://oktelugu.com/

జగన్ కి మత గండం

జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి అయ్యింది. ఈ సంవత్సరం లో తన ఎన్నికల వాగ్దానం నవరత్నాలు అమలుచేయటం లో మంచి పురోగతిని కనబడ్చాడనే చెప్పాలి. కొత్తగా అధికారం చేపట్టినా అతి త్వరలోనే అధికార యంత్రాంగం పై పట్టు సంపాదించటమే కాకుండా విధానపరంగా తనదైన ముద్ర వేసుకోగలిగాడు. తను తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అందరినీ ముక్కున వేలేసుకొనేటట్లు చేశాయి. ఒక్క సంవత్సరం లో 40 వేల కోట్ల రూపాయలు మూడున్నర కోట్ల మందికి […]

Written By:
  • Ram
  • , Updated On : May 27, 2020 11:09 am
    Follow us on

    జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి అయ్యింది. ఈ సంవత్సరం లో తన ఎన్నికల వాగ్దానం నవరత్నాలు అమలుచేయటం లో మంచి పురోగతిని కనబడ్చాడనే చెప్పాలి. కొత్తగా అధికారం చేపట్టినా అతి త్వరలోనే అధికార యంత్రాంగం పై పట్టు సంపాదించటమే కాకుండా విధానపరంగా తనదైన ముద్ర వేసుకోగలిగాడు. తను తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అందరినీ ముక్కున వేలేసుకొనేటట్లు చేశాయి. ఒక్క సంవత్సరం లో 40 వేల కోట్ల రూపాయలు మూడున్నర కోట్ల మందికి లబ్దిచేకూర్చటాన్ని అభినందించాల్సిందే. అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఓ విన్నూత్న విప్లవమనే చెప్పాలి. ఎన్టీఆర్ మండల వ్యవస్థ తో పరిపాలనను ప్రజల దగ్గరికి చేరిస్తే, జగన్ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలతో పరిపాలన ను ప్రజల ముంగిటకే తెచ్చాడని చెప్పొచ్చు. దానితోపాటు మద్యపాన నియంత్రణ కూడా పేద ప్రజలకి , ముఖ్యంగా గృహిణులకు ఎంతో మంచి చేసిందని చెప్పొచ్చు.

    అయితే దీనితోపాటు కొన్ని నిర్ణయాల్లో తొందరపాటు కూడా కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కొంత సంయమనం పాటించాల్సిన అవసరం, అనుభవజ్ఞుల సలహాలు అవసరం. అందునా మీడియా పూర్తిగా వైరి వైఖరి తీసుకున్న సందర్భంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ముఖ్యంగా రాజధాని తరలింపు వ్యవహారం లో తన దుందుడుకు వైఖరి మరింత సమస్యలు తెచ్చిపెట్టుకున్నట్లయ్యింది. ఇకనైనా తన పంధా మార్చుకోకపోతే ముందు ముందు మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుంది. ముఖ్యంగా న్యాయస్థానం లో పడుతున్న మొట్టికాయలు ప్రభుత్వ ప్రతిష్ట కు భంగం కలిగిస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు తలెత్తిన సమస్య అతి సున్నితమైనది.మత పరంగా ప్రజల మనోభావాలు దెబ్బతింటే అది మొదలుకే మోసం వస్తుంది.

    జగన్ ప్రభుత్వం పై హిందూమత వ్యతిరేక ఆరోపణలు 

    ఇదే అన్నింటి కన్నా అతి పెద్ద ప్రతికూల సమస్య. దీనికి కారణం లేకపోలేదు. వై ఎస్ ఆర్ కుటుంబం మొదట్నుంచీ క్రైస్తవ విశ్వాసాలు కలిగివుంది. ఇందులో రహస్యమేమీ లేదు. ఎవరైనా వై ఎస్ ఆర్ సమాధి ని దర్శిస్తే ఇది ఇంకా పూర్తిగా అర్ధమవుతుంది. ఆయన సమాధి దగ్గర అన్నీ బైబులు సూక్తులే రాసి వుంటాయి. దాన్ని తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఎవరి విశ్వాసాలు వారివి. కాకపోతే వీటిని రాజకీయాలకు వాడుకోకూడదు. కానీ జరిగిందేమిటి? 2014 ఎన్నికల్లో వై ఎస్ ఆర్ సతీమణి విజయలక్ష్మి ఒక చేత్తో బైబులు పట్టుకొని ప్రచారం చేయటం ప్రజలందరూ గమనించారు. వాస్తవానికి అలా చేసివుండాల్సింది కాదు. ఆవిడ నమ్మకం వ్యక్తిగతం. అది ఎన్నికల్లో వాడుకోకూడదు. అయితే మన దేశం లో అందరూ , అన్ని మతాల వాళ్ళు చేస్తున్న పనే అది. ఎన్నికల కమీషన్ దీనిపై ఎప్పుడూ మెతక వైఖరినే అవలంబించింది. ఈ ప్రస్తావన ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే అది చట్ట పరమా లేక చట్ట వ్యతిరేకమా అనేది కాదిక్కడ, జగన్ కుటుంబం క్రైస్తవ కుటుంబం అనేది ప్రజల మనస్సులో బలంగా వుంది. మాములుగా అయితే అదో పెద్ద అంశం కాదు. కాకపోతే సమాజం లో ఏదైనా మత సమస్య ఎదురైనప్పుడు, అది ప్రభుత్వ నిర్ణయాలతో ముడి పడినప్పుడు పాలకుడి విశ్వాసాలు కూడా చర్చనీయాంశమవుతాయి. ఇప్పుడు అదే జరిగింది.

    తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలు ఎప్పుడూ వార్తల్లో వుంటూనే వుంటాయి. ఇంతకుముందు చంద్రబాబు హయం లో కూడా సదావర్తి భూములు పెద్ద వివాదాస్పద అంశం అయ్యింది. అలాగే అప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ చైర్మన్ అయినప్పుడు తను క్రైస్తవుడని పెద్ద వివాదం చెలరేగింది. అలాగే వై వి సుబ్బారెడ్డి ని జగన్ చైర్మన్ గా నియమించినప్పుడూ ఇవే ఆరోపణలొచ్చాయి. ప్రజలకి ఈ విధంగా సందేహాలు రావటానికి కారణాలు లేకపోలేదు. అసలు ఆంధ్రా లో ఎవరు హిందువో ఎవరు క్రైస్తవో తెలుసుకోవటం కష్టం. ప్రభుత్వ రికార్డుల్లో వుండే దానికి , వ్యక్తిగతంగా ఆచరించే దానికి పొంతన లేదు. ఇదే అసలైన కారణం. ఆంధ్రాలో 2011 జనాభా లెక్కల ప్రకారం క్రైస్తవులు రెండు శాతం కూడా లేరు. కానీ వాస్తవానికి షుమారు 20 శాతం పైనే వుండొచ్చని ఒక అంచనా. ఈ వాస్తవమే ప్రజలకి సందేహం కలగటానికి కారణం. ఉదాహరణకు ఈ రోజు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన లో కరోనా మహమ్మారి నేపధ్యం లో పూజారులకు, ఇమాంలకు, పాస్తర్లకు 5 వేల రూపాయల చొప్పున ఇచ్చినట్లు ఘనంగా ప్రకటించుకున్నారు. అందులో ఇచ్చిన వివరాలు ఆశ్చర్యంగా వున్నాయి. 90 శాతం జనాభా    వున్న హిందూ మత పూజారులు 33వేల 8 వందలయితే, 2 శాతం జనాభా కూడా లేని ( అధికారికంగా ) క్రైస్తవ పాస్టర్లు 30 వేలు వుండటం ఆశ్చర్యంగా వుంది. అదే 5 శాతం వున్న ఇస్లాం ఇమాంలు, మౌజం లు 13 వేల 6 వందలు వున్నారు. అంటే జనాభా తో పొంతనలేకుండా ఈ లెక్కలు ఉండటమే ఆంధ్రా సామాజిక పరిస్థితి ని , ప్రభుత్వ పక్షపాతాన్ని తెలియజేస్తుంది. హిందువులకు ఈ ప్రకటన మరింత కోపాన్ని తెప్పిస్తుందనటంలో సందేహం లేదు. ఎలావుందంటే పాస్టర్లకి, ఇమాం లకి ఇస్తూ మొక్కుబడిగా పూజారులకి ఇచ్చినట్లుగా వుంది. ఇటువంటి విషయాల్లో జగన్ ప్రభుత్వం మరింత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకొని వుంటే బాగుండేది.

    మత మార్పిడులు ఇటీవలికాలం లో ముమ్మరం 

    ఇకపోతే వై ఎస్ ఆర్ కుటుంబం వరకొచ్చేసరికి వాళ్ళు వ్యక్తిగతంగా క్రైస్తవులు కావటం తో ఇంకా అనుమానాలు బలపడటానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ  ప్రభుత్వం క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తుందనీ, హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుందనీ ప్రజల్లో ఒక వర్గం బలంగా నమ్ముతుంది. దానికి భౌతిక పరిస్థితులు అనుకూలంగా వున్నాయి. ఈ సంవత్సరం లో మత మార్పిడులు పెరగటానికి ప్రభుత్వ అండదండలే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాస్టర్లు పెద్దఎత్తున మత ప్రచారం చేస్తూ హిందువుల్ని మతమార్పిడి చేస్తున్నారనేది ఆరోపణ. విదేశీ నిధులతో ఈ కార్యక్రమం ఆంధ్రలో పెద్దఎత్తున జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే దళితులూ, ఆదివాసులూ దాదాపు అందరూ క్రైస్తవం లోకి మారారు. ఇప్పుడు మిగతా హిందువులను మతం మార్చే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుందని తెలుస్తుంది. జగన్ ప్రత్యక్షంగా ప్రోత్సహించిన దాఖలాలు లేకపోయినా తన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ముమ్మరం కావటం గమనార్హం. ఈ నేపధ్యం లోనే టిటిడి సంఘటన ను చూడాల్సివుంది. వాస్తవానికి ఇలా ఆస్తులు అమ్మటం ఎప్పటినుంచో జరుగుతుంది. అయితే అప్పుడెవరూ ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటి ఈ 50 ఆస్తుల అమ్మకం టిడిపి ప్రభుత్వ హయాం లోనే మొదలయ్యింది. అయినా ఇందాక చెప్పినట్లు ప్రజల్లో వై ఎస్ ఆర్ కుటుంబం క్రైస్తవులనే ముద్ర వుండటం సమస్య మరింత ఉద్రిక్తతకు దారితీసింది. భూముల అమ్మకాన్ని వాయిదా వేయటం తో ప్రస్తుతానికి ఉద్రిక్తతలు చల్లారినా ఇది ఎప్పటికీ సున్నిత సమస్యే.

    జగన్ ప్రభుత్వం హిందువుల్లో మరింత విశ్వాసం కలిగించాలి 

    దానితోపాటు ఇటీవలి కాలంలో హిందువుల్లో జాగరూకత పెరిగింది. ప్రభుత్వాలు అన్ని మతాలను సమానంగా చూడటం లేదని, మెజారిటీ మతస్థులైన హిందువులపై వివక్ష కొనసాగుతుందని భావిస్తున్నారు. దేవాలయాల విషయమే తీసుకుందాం. ఇస్లాం, క్రైస్తవ ప్రార్ధనా మందిరాలపై ప్రభుత్వ ఆధిపత్యం లేనప్పుడు హిందూ దేవాలయాలపై ఎందుకుండాలని ప్రశ్నిస్తున్నారు. ఇది పూర్తిగా కొట్టిపారేయలేము. ప్రస్తుతం దీనిపై సుప్రీం కోర్టు లో విచారణ జరుగుతుంది. ఈ జాగరూకతే ఇప్పుడు భూముల అమ్మకం లో కూడా వ్యక్తమవుతుంది.

    జగన్ మాత్రం ఈ విషయాల్లో హిందువుల్లో మరింత విశ్వాసం కల్గించే చర్యలు చేపట్టాల్సి వుంది. నిష్పక్షపాతం గా ఉండటమే కాదు , వున్నట్లు కనిపించాల్సిన అవసరం కూడా వుంది. దీనికి ఒక్కటే పరిష్కారం. మత మార్పిడుల నిషేధం పై కఠిన చట్టం తీసుకురావాల్సి వుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఇటువంటి చట్టం అమలులో వుంది. ఈ చర్య హిందువుల్లో విశ్వాసం కలిగిస్తుంది. కెసిఆర్ ఎంత హిందూ ఆచారాలు నిష్టగా పాటించినా ఒవైసీ ని వెనకేసుకు రావటం తో ఆ గండం తనకెప్పుడూ ఉంటుందని ఆ విషయం లో మరింత జాగ్రత్తగా వుండాలని ఈ కాలమ్స్ లో ఇంతకుముందే హెచ్చరించటం జరిగింది. అలాగే జగన్ స్వతహాగా క్రైస్తవుడు కావటం తో మెజారిటీ హిందువులు మత విషయాల్లో తనపై కొంత సందేహంగా ఆలోచించటం సహజం. అందుకే ఆ గండం తనకెప్పుడూ వుంటుంది. అది అడ్డురాకుండా చూసుకోవాల్సిన భాద్యత జగన్ కి నిరంతరం వుంది. ఎప్పటికైనా తన రాజకీయ ఉనికి కి ప్రమాదం వుందంటే అది ఈ గండం నుంచేనని గ్రహించాలి.