CM Revanth Reddy: “నేను ఆఖరి ముఖ్యమంత్రి అయిన పర్వాలేదు.. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మా నాయకుడు కోరుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనిచేశాను అనే సంతృప్తి మిగిలితే చాలు.. ఇంతకుమించి నేను ఏమీ కోరుకోవడం లేదు. ఇప్పుడు మేము చేసిన కుల గణన మీద చాలామంది రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు గనక ఈ కులగణన ఆధారంగా న్యాయం జరగకపోతే.. బీసీలు ఎప్పుడూ అభివృద్ధి చెందలేదు” ఇవీ శుక్రవారం గాంధీ భవన్(Gandhi bhavan) వేదికగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana chief minister revanth Reddy) చేసిన వ్యాఖ్యలు.
తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటి నుంచి రేవంత్ రెడ్డి ఎన్నడూ కూడా వెనక్కి తగ్గినట్టు మాట్లాడలేదు. తన పరిపాలనపై ఎన్ని విమర్శలు వచ్చినా ఏ మాత్రం లెక్కచేయకుండా ముందుకే వెళ్తున్నారు. ఆమధ్య పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండోసారి కూడా తనే ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తనకంటూ ఒక లాంగ్ విజన్ ఉందని.. తెలంగాణ అభివృద్ధికి కంకణబద్ధుడిగా ఉంటానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనపై ఎన్ని విమర్శలు చేసినా.. ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. తాను సింగల్ టర్మ్ సీఎం గా ఉండడానికి రాలేదని.. కచ్చితంగా లాంగ్ టర్మ్ సీఎం గానే రికార్డు సృష్టిస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే కుల గణన విషయంపై ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి పదేపదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి తొలిసారిగా తనలో ఉన్న మనోగతాన్ని వెల్లడించారు.
చివరి సీఎం అయినా పర్వాలేదు
తను చివరి ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు.. బీసీలకు న్యాయం చేసే వెళ్తానని.. తమ పార్టీ నాయకుడు కోరుకున్న విధంగా లక్ష్యాన్ని సాధించి చూపిస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు..” ఎవరో ఏదో విమర్శలు చేస్తున్నారు. కుల గణన విషయాన్ని తప్పు పడుతున్నారు. చివరికి మా ప్రభుత్వ లక్ష్యాన్ని శంకిస్తున్నారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇలాంటివి చేసేవారు అధికారం మీద యావతో ఉన్నారు. ఒక ఏడాది కూడా అధికారానికి దూరంగా ఉండలేకపోతున్నారు. రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. అయినప్పటికీ వెనకడుగు వేసేది లేదు. ఒకవేళ కులగణన ఆధారంగా రాజ్యాంగ ఫలాలు ఇవ్వాల్సి వస్తే.. బహుశా నేనే చివరి సీఎం అవుతానేమో. అలా అయినప్పటికీ నాకు ఇబ్బంది లేదు. కచ్చితంగా మా నాయకుడు కోరుకున్న లక్ష్యాన్ని నెరవేర్చిన వ్యక్తిగా నాకు జీవితకాల సాఫల్యం ఉంటుంది. దశాబ్దాలపాటు అధికారానికి దూరంగా ఉండి.. ప్రభుత్వ ప్రయోజనాలకు దూరంగా ఉన్న వారికి న్యాయం జరిగితే అంతకుమించిన ఆనందం నాకు ఇంకొకటి వేరే ఏముంటుందని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి ప్రతికూలంగా స్పందిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తోంది. మరోవైపు ఇటీవల నిర్వహించిన బీసీ గర్జనలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. ఈ రాష్ట్రానికి చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ మాత్రమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తను చివరి సీఎం అయినా పర్వాలేదని వ్యాఖ్యానిస్తున్నారు.. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాస్తవం బోధపడిందా? అందువల్లే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.