
Politics: రాష్ట్రంలో ప్రస్తుతం పొలిటికల్ హీట్ ఎక్కువవుతోంది. ఇది మొత్తం వడ్ల చుట్టే తిరుగుతోంది. వడ్ల పండించాలని ఒకరు, పండించవద్దని మరొకరు రైతులను పరేశాన్ చేస్తున్నారు. వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని ఒక పార్టీ డిమాండ్ చేస్తే, సెంట్రల్ కొనద్దంటోందని మరో పార్టీ దానిని తిప్పికొడుతోంది. ఇరు పార్టీల మధ్య జరుగుతున్న పోరులో మధ్యలో అమాయక బక్కరైతు అయోమయంలో పడిపోతున్నాడు.
ఎందుకిలా.. ?
దేశ వ్యాప్తంగా గత మూడు, నాలుగు సంవత్సరాల నుంచి వరి దిగుబడులు పెరుగుతున్నాయి. సాగు విస్తీర్ణం పెరగడం, పుష్కలంగా సాగు నీరు అందుబాటులోకి రావడం వంటి కారణాలతో వరి పెద్ద మొత్తంలో పండుతోంది. సాధారణంగా వడ్లను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎఫ్సీఐ (ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా) కొనుగోలు చేస్తుంటుంది. వరి పండే రాష్ట్రాల నుంచి వాటిని కొనుగోలు చేసి అవసరం ఉన్న రాష్ట్రాలకు వీటిని సరఫరా చేస్తుంది. ఇది ఎప్పుడూ జరిగే ప్రక్రియ.
గత రెండేళ్ల నుంచి ఎఫ్సీఐ దగ్గర బియ్యం నిల్వలు పెరిగిపోయాయి. దీంతో ఎఫ్‌సీఐ వడ్లను కొనడానికి ముందుకు రావడం లేదు. వర్షాకాలంలో పండిన పంటను కొనుగోలు చేసినా.. యాసంగిలో పండిన పంటను కొనుగోలు చేయనని చెబుతోంది. దీనికి కారణం ఉంది. యాసంగిలో పండే పంటలో నూకలు అధికంగా వస్తాయి. దీంతో దానిని బాయిల్డ్ చేసి బియ్యంగా మార్చాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ బాయిల్డ్ రైస్‌ను తింటారు. కానీ గత యాసంగి నిల్వలే ఇంకా అధికంగా ఉండటంతో ఇప్పుడు యాసంగిలో పండే ధాన్యాన్ని కొనబోమని చెబుతోంది.
సెప్పెంబర్‌లోనే ఒప్పందం..
ఈ యాసంగి పంట కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సెప్టెంబర్ ఒప్పందం జరిగింది. ఈ విషయం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు తెలుసు. అయినా ఆ రెండు పార్టీలు ఇప్పుడు చెరో మాట చెబుతూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయి. యాసంగి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నాలు, నిరసనలు చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. కానీ దాని కంటే ఒక రోజు ముందుగానే అంటే ఈరోజు ధర్నాలు చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. అసలు ఏం జరిగిందో, జరగబోతుందో రెండు పార్టీలకు క్లారిటీ ఉంది. వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు రైతులను పరేషాన్ చేస్తున్నాయి. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అలాగే వరి రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించుకునేందుకు అసవరమైన సలహాలు, పరికరాలు, ఎరువులు అందిచాల్సిన అవసరం ఉంది.
Also Read: కేసీఆర్ తిట్ల రాజకీయం పనిచేయలేదా?