HomeNewsReal estate: ‘మైహోం’ను అధిగమించి.. రియల్ ఎస్టేట్ రంగంలో ‘జీఏఆర్ గ్రూప్’ ఎలా నంబర్ 1గా...

Real estate: ‘మైహోం’ను అధిగమించి.. రియల్ ఎస్టేట్ రంగంలో ‘జీఏఆర్ గ్రూప్’ ఎలా నంబర్ 1గా ఎదిగింది?

Real estate: దేశం అభివృద్ధి చెందుతుందంటే అక్కడ రియల్ ఎస్టేట్ రంగం పతాకస్థాయిలో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు భూములు, వాటిలో నిర్మాణాలకే బోలెడంత డిమాండ్ ఉంది. భూములున్నవారే కోటీశ్వరులు. అందుకే రియల్ ఎస్టేట్ రంగం దేశంలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. రోజురోజుకు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా కల్లోలంతో నెమ్మదించిన ఈ రంగం ఇప్పుడు మరింతగా విస్తరిస్తూ అభివృద్ధి బాటలో నడుస్తోంది. తాజాగా ‘హురున్-గ్రోహే’ ఇండియా రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ 100 కంపెనీలతో ఒక నివేదిక విడుదల చేసింది.

దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ నంబర్ 1 స్థానంలో నిలిచారు. ఈయన నికర సంపద విలువ రూ.61200 కోట్లు. ఇక రెండో స్థానంలో ఎంపీ లోదా, ఆయన కుటుంబానికి చెందిన ‘మాక్రోటెక్ డెవలపర్స్’ రెండోస్థానంలో నిలిచింది. మూడోస్థానంలో కే.రహేజా గ్రూప్ నిలిచింది. 2021 డిసెంబర్ 31 నాటికి ఉన్న పెట్టుబడుల ఆధారంగా ఈ నివేదిక రూపొందించామని తెలిపాయి. 14 నగరాల్లోని 71 కంపెనీలకు చెందిన 100 మంది శ్రీమంతులకు ఈ జాబితాలో ర్యాంకులు ఇచ్చారు.

-తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 జీఏఆర్ గ్రూప్..
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలోనే 9వ స్థానంలో నిలిచింది గవ్వ అమరేందర్ రెడ్డి కుటుంబం సారథ్యంలోని జీఏఆర్ కార్పొరేషన్ గ్రూపు. ఈ నికర సంపద విలువ 15000 కోట్లు కావడం విశేషం. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ, భారీ రియల్ ఎస్టేట్ సంస్థ ‘మై హోమ్ కన్ స్ట్రక్షన్’ ను వెనక్కి నెట్టి మరీ ‘జీఏఆర్’ సంస్థ 9వ స్థానంలో నిలవడం విశేషం. జూపల్లి రామేశ్వరరావు కుటుంబం నేతృత్వంలోని మైహోమ్ గ్రూప్ దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో 11వ స్థానంలో నిలిచింది.

ఇక 22వ స్థానంలో సి. వెంకటేశ్వరరెడ్డి సారథ్యంలోని అపర్ణ కనస్ట్రక్షన్, 23వ స్తానంలో ఎస్.సుబ్రహ్మణ్యంరెడ్డి నేతృత్వంలోని అపర్ణ కన్ స్ట్రక్షన్, 31వ స్థానంలో అలయన్స్ గ్రూపు, 78వ స్థానంలో జీవీకే రెడ్డి ఫ్యామిలీకి స్థానం దక్కింది.

-ఎవరీ జి. అమరేందర్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1గా ఎలా ఎదిగారు?

గవ్వ అమరేందర్ రెడ్డి 1982 నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ రంగంలో ఉన్నారు. ఈయన జీఏఆర్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించారు. ఈ గ్రూప్ ఛైర్మన్ జి. అమరేందర్ రెడ్డి పట్టుదలతో ఈ రంగంలో శ్రమించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే మైహోం లాంటి పెద్ద సంస్థను వెనక్కి నెట్టి ‘జీఏఆర్’ గ్రూపును అగ్రగామిగా నిలిపారు.

న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన అమరేందర్ రెడ్డి అనంతరం ఆ రంగంలో కాకుండా తనకు ఇష్టమైన రియల్ ఎస్టేట్ లోకి ప్రవేశించి వ్యాపారవేత్తగా ఎదిగారు.. మొదట ఐటీ కంపెనీల కోసం ప్రపంచ స్థాయి వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమయ్యారు. ఉన్న అనేక నిర్మాణ సంస్థలను ప్రోత్సహించాడు.. రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు మూడు దశాబ్దాలుగా విస్తరించి ఈ స్థాయికి చేరాడు.

అమరేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ సంస్థ హైదరాబాద్ లోని ఖరీదైన ప్రాంతాలైన బేగంపేట, బంజారాహిల్స్, కొండాపూర్‌లో అనేక ప్రసిద్ధ కంపెనీలను కలిగి ఉన్నారు. అనేక బిల్ట్ ప్రాపర్టీలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. సంస్థను ప్రత్యేక నిర్వహణ శైలితో ముందుకు తీసుకెళుతున్నారు. పారదర్శకత, సుపరిపాలన, పర్యావరణ నిబంధనలకు కట్టుబడి స్థిరత్వంతో ఇన్నేళ్లు కష్టపడి తెలుగు రాష్ట్రాల్లోనే నంబర్ 1 రియల్ ఎస్టేట్ సంస్థగా తీర్చిదిద్దారు.

భవిష్యత్తులో కంపెనీని నంబర్ 1 స్థానంలో నిలపడానికి అమరేందర్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ వృద్ధిని తదుపరి దశలకు విస్తరించడానికి ఆయన తర్వాత కొత్త నాయకత్వం కూడా ముందుకు వచ్చింది. అమరేందర్ రెడ్డి తదనంతరం ఆయన వారసుడిగా అభినవ్ రామ్ రెడ్డిని నియమించారు. ఆయనే ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. యునైటెడ్ స్టేట్స్‌లో ఫైనాన్స్, మార్కెటింగ్ మరియు రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్‌ను అభ్యసించారు. అభివృద్ధి చెందిన మార్కెట్‌ల ప్రక్రియలు.. ప్రాజెక్ట్‌లను సరిపోల్చడానికి నిరంతరం అభినవ్ రామ్ రెడ్డి కృషి చేస్తున్నారు.

అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో మౌలిక సదుపాయాలే దేశానికి వెన్నెముక. ప్రజల అవసరాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచ-స్థాయి జీవన శైలి అలవడుతోంది. ఈ క్రమంలోనే కార్పొరేట్ స్థలాలు ఖరీదైపోయాయి. వాటిని అందించగల ఇలాంటి రియల్ ఎస్టేట్ సంస్థలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ మరియు సెక్టోరల్ టర్బులెన్స్‌తో సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ ముందుకు సాగుతోంది. దీనికి భవిష్యత్తులో కూడా డిమాండ్ కొనసాగుతుంది. అభివృద్ధికి పర్యాయపదంగా ఉన్న ప్రదేశాలలో ల్యాండ్ బ్యాంకులు ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి. భవిష్యత్ ప్రాజెక్ట్‌లతో పరిశ్రమ వృద్ధి రేటు కంటే మెరుగైన వేగంతో రియల్ ఎస్టేట్ వృద్ధి చెందుతోంది. అందుకే ఈ రియల్ రంగంలో కొత్త సంస్థలు పుట్టుకొస్తూ తమ సత్తా చాటుతున్నాయి. జీఏఆర్ గ్రూప్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇలానే దూసుకొచ్చి.. అవకాశాలు అందిపుచ్చుకొని ఈ స్థాయికి చేరింది.

మైహోం గ్రూప్ హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో విస్తరించింది. ఇప్పటికీ ఎన్నో ప్రాజెక్టులు హైదరాబాద్ చుట్టుపక్కల మైహోం చేపట్టి పూర్తి చేసింది. ఈ కంపెనీ నికర సంపద విలువ 9140 కోట్లుగా ఉంది. కానీ దీన్ని అధిగమించి జీఏఆర్ కార్పొరేషన్ గ్రూప్ విస్తరించింది. హైదరాబాద్ లోని ఖరీదైన ప్రాంతాల్లో స్థలాలు కొని విస్తరించింది. లాభాలు గడించింది. అందుకే ఈ కంపెనీ నికర సంపద విలువ 15000 కోట్లకు ఎగబాకింది. దూరదృష్టి, అవకాశాలు అందిపుచ్చుకోవడం.. పకడ్బందీ ప్రణాళికతోనే మైహోం గ్రూపును జీఏఆర్ గ్రూప్ అధిగమించింది. అవకాశాలు అందిపుచ్చుకొని విస్తరించిన వారే నంబర్ 1గా ఎదుగుతారు. అదే ఇప్పుడు జీఏఆర్ చేసింది. అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular