https://oktelugu.com/

చరిత్ర మరిచిన జమ్మూ-కాశ్మీర్ చీకటి రోజు

భారత్ లో చరిత్రని వక్రీకరించటం అడుగడుగునా జరిగింది. అందులో భాగమే జమ్మూ-కాశ్మీర్ చరిత్ర. ఈరోజుకీ కాశ్మీర్ లో అసలు ఏం జరిగిందో నిజానిజాలు కొత్త తరానికి తెలిసింది తక్కువ. దురదృష్టవశాత్తు పనిగట్టుకొని మతం రంగు పులిమి కాశ్మీర్ ముస్లింలకు కేంద్రం అన్యాయం చేస్తుందనే ప్రత్యేకవాదుల ప్రచారమే ఎక్కువగా మీడియాలో వినిపిస్తూ వుంటుంది. ముఖ్యంగా తెలుగు మాధ్యమాల్లో. కారణం ఇక్కడ మేధావులు చాలా ఉదారంగా ఉన్నామని చెప్పుకోవాలనే తాపత్రయంలో చరిత్రని వక్రీకరించటం సర్వ సాధారణ మయ్యింది. అసలు కాశ్మీర్ […]

Written By:
  • Ram
  • , Updated On : October 23, 2020 7:32 pm
    Follow us on

    భారత్ లో చరిత్రని వక్రీకరించటం అడుగడుగునా జరిగింది. అందులో భాగమే జమ్మూ-కాశ్మీర్ చరిత్ర. ఈరోజుకీ కాశ్మీర్ లో అసలు ఏం జరిగిందో నిజానిజాలు కొత్త తరానికి తెలిసింది తక్కువ. దురదృష్టవశాత్తు పనిగట్టుకొని మతం రంగు పులిమి కాశ్మీర్ ముస్లింలకు కేంద్రం అన్యాయం చేస్తుందనే ప్రత్యేకవాదుల ప్రచారమే ఎక్కువగా మీడియాలో వినిపిస్తూ వుంటుంది. ముఖ్యంగా తెలుగు మాధ్యమాల్లో. కారణం ఇక్కడ మేధావులు చాలా ఉదారంగా ఉన్నామని చెప్పుకోవాలనే తాపత్రయంలో చరిత్రని వక్రీకరించటం సర్వ సాధారణ మయ్యింది. అసలు కాశ్మీర్ లో సమస్య ఏమిటి? మతరంగు పులిమింది ఎవరు? సమస్య సృష్టించిన పాకిస్తాన్ ని ఒక్కమాట అనని  వీరిని ఏమనాలి?

    కాశ్మీర్ విలీనంలో చీకటి కోణాలు 

    జూన్ 3,1947. భారత కొత్త వైస్రాయి మౌంట్ బేటన్ సంచలన ప్రకటన చేసాడు. అదే సంవత్సరం ఆగస్టు 15వ తేదీన భారత్ కి స్వాతంత్రం ఇవ్వటానికి నిర్ణయించామని, దేశాన్ని రెండుగా విభజించి భారత్,పాకిస్తాన్ లుగా విభజించి ఆరోజు అధికారాన్ని అప్పగిస్తామని ప్రకటన చేసాడు. దానితోపాటు 560 కి పైగా వున్న సంస్థానాలు అటు పాకిస్తాన్ లోనో,ఇటు భారత్ లోనో చేరాలని కూడా ప్రకటించాడు. అంటే ఈ సంస్థానాలు ఈ రెండు దేశాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని , ఆ స్వేచ్చ పూర్తిగా అక్కడి సంస్థానీధీశులదే నని కూడా ప్రకటించాడు. ఇందులో ప్రజలకేమీ సంబంధం లేదని కూడా స్పష్టంగా ప్రకటించాడు. ఆ మేరకు బ్రిటీష్ పార్లమెంటు 1947 భారత స్వాతంత్ర చట్టం, 1935 భారత చట్టానికి సవరణలు ఆమోదించింది. ఈ ప్రకటన అవిభాజ్య భారత్ ని ఓ కుదుపు కుదిపింది. ఒకవైపు బ్రిటీష్ ఇండియాని ఎలా విభజిస్తారనేది ఆందోళన కలిగించే అంశమయితే, రెండో వైపు ఈ సంస్థానాలు ఏమి చేయబోతున్నాయనేది సర్వత్రా చర్చనీయాంశ మయ్యింది. అతి కొద్ది సమయంలో అన్ని సంస్థానాధీశులతో మాట్లాడి భారత్ లో చేర్చే ప్రక్రియ లో అప్పటి హోం మంత్రి వల్లభాయి పటేల్, ఆయన కార్యదర్శి మీనన్ పడ్డారు. బ్రిటీష్ ప్రభుత్వం ఈ ప్రక్రియలో భాగంగా రెండు పత్రాలను సిద్ధం చేసింది. ఒకటి, అప్పటికి సంస్థానాధీశులతో వున్న బ్రిటీష్ ఒప్పందాలను యధాతధంగా కొనసాగించటానికి సంబంధించినది, రెండోది, విలీన ఒప్పందం. ఈ రెండూ తీసుకొని మొత్తం సంస్థానీధీశుల ను ఒప్పించటానికి వీరిద్దరూ యుద్ధ ప్రాతిపదిక మీద కార్యాచరణకు దిగారు. చాలావరకు విజయవంతమయ్యారు. కానీ అతి పెద్ద సంస్థానీధీశులైన హైదరాబాద్, జమ్మూ-కాశ్మీర్ లు ఆగస్టు 15వ తేదీకి స్వతంత్రంగానే వున్నాయి. ఈ ఒప్పందాలపై సంతకం చేయలేదు. దీనిపై రాజకీయ నాయకత్వం,ప్రజలు    ఆందోళన లో వున్నారు. ఒకవైపు విభజనతో వచ్చిన శరణార్ధుల సమస్య, రెండో వైపు విశాలమైన భూభాగం ఇంకా దేశంలో విలీనం కాలేదనే వెలితి వాళ్ళ మనస్సులను కలవరపెడుతుంది.

    మనకున్న పరిమిత పరిధిలో కాశ్మీర్ లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. కాశ్మీర్ మహారాజు హరి సింగ్ ఈ రెండు దేశాల్లో దేనిలోనూ చేరలేదు. అయితే పాకిస్తాన్ తో  యధాతధ ఒప్పందం చేసుకున్నాడు. భారత్ ఆ ఒప్పందాన్ని కూడా చేసుకోలేదు. అప్పటికి జమ్మూ-కాశ్మీర్ కి ఎటువంటి రవాణా జరగాలన్నా ప్రస్తుత పాకిస్తాన్ భూభాగం నుంచే వెళ్ళాల్సి వుండేది. అందుకనే కాశ్మీర్ కి ఆ ఒప్పందం అత్యవసరం. పోస్టల్ సర్వీసు దగ్గరనుంచి, పెట్రోల్ సరఫరా వరకు పాకిస్తాన్  నుంచే వెళ్ళాలి.ఈ పద్దతి బ్రిటీష్ వారి పరిపాలన నుంచి కొనసాగుతుంది. మౌంట్ బేటన్ కాశ్మీర్ మహారాజుతో విలీనంపై మాట్లాడాడు. మీకు పాకిస్తాన్ లో చేరాలనుకుంటే నేనే స్వయంగా మాట్లాడి భారత్ ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని కూడా చెప్పాడు. ఇది బ్రిటీష్ ప్రభుత్వ దీర్ఘకాలిక పధకంలో భాగం. పాకిస్తాన్ ఏర్పాటు,కీలకమైన జమ్మూ-కాశ్మీర్ తో సహా ప్రత్యేకదేశంగా ఉంటేనే తమ ప్రపంచ ఆధిపత్యం కొనసాగుతుందని, ఆ ప్రాంతం తమకు సురక్షిత ప్రాంతం అవుతుందని బ్రిటీష్ వారి ఆలోచన. ఇది తర్వాత బయటపడ్డ కీలక పాత్రల్లో వుంది. మౌంట్ బేటన్ స్వయంగా చెప్పినా కాశ్మీర్ మహారాజు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఇది మహామ్మదాలి జిన్నాకు కంటగింపుగా మారింది. ఇదే విషయం మౌంట్ బేటన్ దగ్గర కూడా వ్యక్తపరిచాడు.

    1947 అక్టోబర్ 22 

    చివరకు జిన్నా సహనం నశించింది. యధాతధ ఒప్పందం ప్రకారం సరఫరా చేయాల్సిన పెట్రోల్, డీజిల్ సరఫరాలను నిలుపు చేశాడు. నిత్యావసర వస్తువుల రవాణా సదుపాయాన్ని నిలుపుదల చేశాడు. దీనిపై కాశ్మీర్ మహారాజ బ్రిటీష్ రాణికి కేబుల్ పంపించాడు. పాకిస్తాన్ ఒప్పందాన్ని పాటించటం లేదని, మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాడు. దీనికి తోడు జమ్మూ లోని పూంచ్ సెక్టార్ లో తిరుగుబాటు చర్యలను పరోక్ష మద్దత్తు నిచ్చి రెచ్చగొట్టాడు. చివరకు రహస్యంగా ఆపరేషన్ గుల్మార్గ్ పేరుతో పధకం రచించాడు. ప్రస్తుత ఖైబర్ పఖ్తూన్క్వా ప్రావిన్సులోని పష్తూన్ తెగలతో సమావేశాలు నిర్వహించి ఈ ఆపరేషన్ పధకాన్ని అమలు చేసాడు. దీనికి పాకిస్తాన్ మిలిటరీ నుంచి మేజర్ అక్బర్ ఖాన్ ని సంధానకర్తగా నియమించాడు. కావాల్సిన ఆయుధాలు, వాహనాలు, ఆహార పదార్ధాలు వీరికి సరఫరా చేసారు. 1975 లో ఈ మిలిటరీ అధికారి ఈ వివరాలతో  సవివరంగా ఓ పుస్తకాన్నే ప్రచురించాడు. అదే తిరిగి ఇప్పుడు పునర్ముద్రణ తో మార్కెట్ లోకి వచ్చింది.

    అది అక్టోబర్ 21 అర్ధరాత్రి పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్క్వా లోని రహస్య ప్రాంతం. ఎన్నో ట్రక్కులు, లారీలు సిద్ధమయ్యాయి. కొన్నివేలమంది పఖ్తూను తెగలు అందులోకి ఎక్కారు. తెల్లవారేసరికల్లా కాశ్మీర్ లోని ముజఫరాబాద్ పై దాడి చేసారు. సిక్కులు, హిందువుల ఇళ్ళ పైబడి దోచుకున్నారు. ఆడవాళ్ళను బలాత్కారం చేసారు. మగవాళ్ళను నరికేశారు. అదేసమయంలో ముస్లింలను కూడా వదలలేదు. అయితే అది కేవలం ముస్లిమేతరులపై దాడిగా అనుకున్నారు. అక్కడినుంచి రెండు విభాగాలుగా విడిపోయి ఒకభాగం కుప్వార వైపు, మరొక భాగం బారాముల్ల, యూరి వైపు బయలుదేరారు. బారాముల్ల వైపు బయలుదేరిన వారు త్వరలో శ్రీనగర్ ని పట్టుకోవాలని పధకం. కానీ ఇక్కడే కధలో చిన్న మలుపు తిరిగింది. వాళ్ళు బారాముల్లాకు వచ్చిన తర్వాత రెండు రోజులు దాకా వాళ్ళ దోపిడీ అరాచకం కొనసాగుతూనే వుంది. ఇంకో ముఖ్య విషయమేమంటే బారాముల్లలో ముజరఫాబాద్ లో జరిగిన అరాచకం విని వున్న హిందువులు, సిక్కులు అక్కడనుంచి పారిపోయారు. కానీ ముస్లింలు మాకేమీకాదులే అనుకున్నారు. కానీ అరాచక మూకలకి ఎవరైనా ఒకటే. వాళ్ళ ఇల్లు దోపిడీ  చేయటమే కాక స్త్రీలను బలాత్కారం చేయటం ఎప్పటిలాగే జరిగింది. వార్ బూటీ ని తీసుకొని కొంతమంది తిరిగివాళ్ళ ఊళ్లకు కూడా వెళ్ళారు. చివరకు ముస్లిం మహిళలను కూడా వార్ బూటీ కిందనే పరిగణించి వెంట తీసుకెళ్ళారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు ఇద్దరు వున్నారు. ఒకరు కాశ్మీర్ సైన్యానికి చెందిన బ్రిగేడియర్ రాజేంద్ర సింగ్. వున్నకొద్ది సైన్యంతోనే వీరోచితంగా పోరాడి రెండురోజులు జీలం నది దాటకుండా ఆపి అసువులు బాసిన అమరవీరుడు. రెండో వ్యక్తి, మక్బూల్ శేర్వాని. ఈ దుండగులకు శ్రీనగర్ కి తప్పుదారి చూపించి అక్కడకు చేరకుండా ఆలస్యం చేసిన షహీద్. తనని విషయం తెలుసుకొని దారుణంగా చంపేశారు. ఇదంతా చరిత్ర. అందుకే కాశ్మీర్ మీద దాడిచేసిన అక్టోబర్ 22వ తేదీ చీకటి రోజు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది పాకిస్తాన్. వాళ్ళు ఆ రెండు, మూడు రోజులు బారాముల్లాలో ఆగివుండకపోతే నేరుగా వెళ్ళి శ్రీనగర్ ని స్వాధీనం చేసుకొని వుండేవారు. ఈ అమరవీరుల త్యాగం, దోపిడీదారుల అత్యాశ,అరాచకం జమ్మూ-కాశ్మీర్ పాకిస్తాన్ బారిన పడకుండా కాపాడింది. అయితే కాశ్మీర్ ని ముక్కలు చేయగలిగారు.  ఆజాద్ కాశ్మీర్ పేరుతో, గిల్జిట్-బాల్టిస్తాన్ పేరుతో,సంషాగం(చైనా కి దారాదత్తం చేసిన భాగం) పేరుతో జమ్మూ-కాశ్మీర్ ని విడదీసింది ఈ రోజు జరిపిన దాడితోనే. మరి ఇంతకన్నా చీకటి రోజు జమ్మూ-కాశ్మీర్ కి ఇంకేమి వుంటుంది? కానీ విశేషమేమంటే ఈ అమరవీరుల త్యాగానికి గుర్తింపుగా జ్ఞాపక చిహ్నాలు పెట్టేబదులు ఎక్కడచూసినా అబ్దుల్లా పేరులు, ముఫ్తీల పేరులే కనిపిస్తాయి. రాజేందర్ సింగ్,మక్బూల్ శేర్వానిలు కొత్త తరానికి గుర్తు ఉండేటట్లు ఇన్నాళ్ళు కాశ్మీర్ ని ఏలిన రాజకీయ నాయకులు ఒక్క పనీ చేయలేదు.

    ఇన్నాళ్ళకు ఆ చీకటి రోజుకి గుర్తింపు వచ్చింది 

    జమ్మూ-కాశ్మీర్ ఆరోజు పాకిస్తాన్ పన్నిన కుట్రకు బలైపోయింది. ఆ తర్వాత ఇప్పటికి దాకా ఒకటి కాలేదు. పాకిస్తాన్ కనక కొంత సహనం వహించి మహారాజా నిర్ణయం దాకా వేచివున్నట్లయితే జమ్మూ-కాశ్మీర్ మొత్తం ఏదో ఒకవైపు వుండి  వుండేది. ఇప్పుడు జమ్మూ-కాశ్మీర్ ఇన్ని ముక్కలు కావటానికి కారణం పాకిస్తాన్ ఆ చీకటిరోజు పన్నిన కుట్ర. మరి అంతటి దురాగతానికి పాల్పడిన పాకిస్తాన్ ని కాశ్మీర్ ద్రోహిగా కాశ్మీర్ పై ప్రేమ ఒలకపోసే నాయకులు, ఉద్యమకారులు చిత్రీకరించి వుండాల్సింది. అలా చేయకపోగా భారత్ ని దోషిగా చిత్రించే ప్రయత్నం చేసారు. ఇన్నాళ్ళ తర్వాత లడఖ్ ప్రత్యేక ప్రాంతంగా చేసినందుకు నానాయాగీ చేసే వీళ్ళు అసలు కాశ్మీర్ ని ఎప్పుడో చీల్చిన పాకిస్తాన్ ని కించిత్తు మాట అనరు. అందులో చాలామంది పాకిస్తాన్ ని పొగుడుతుంటారు, మద్దత్తు తీసుకుంటారు, పాకిస్తాన్ తో సంప్రదింపులు జరపమంటారు, కానీ ప్రపంచంలో ఆ రోజు పాకిస్తాన్ జరిపిన దాడిని ఖండించరు. అదేమంటే అది వివాద అంశంగా చిత్రించే పని చేస్తారు. అది వివాద అంశ మెట్లా అవుతుందో చెప్పాలి. ఒక సంస్థానంపై దాడి చేయటం దురాక్రమణనా వివాదమా ?  ఆ తర్వాత అది భారత్ తో కలుస్తూ ఒప్పంద పత్రంపై సంతకం చేసిన తర్వాత చేసిన దాడిని వేరే దేశంపై జరిగిన దాడి అవుతుందా లేక వివాదమవుతుందా? వివాదమంటే ఎవరి భూమో తెలియనప్పుడు వివాదమవుతుంది. ఉదాహరణకు భారత- చైనా సరిహద్దు తగాదా వివాదం. ఎందుకంటే సరిహద్దులు నిర్ణయించబడలేదు కాబట్టి. అక్కడ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సి వుంది. అదే జమ్మూ-కాశ్మీర్ లో వివాదమెక్కడ వుంది? ప్రస్తుతం పాకిస్తాన్ లో వున్న భూమి,చైనాకు దారాదత్తం చేసిన భూమి జమ్మూ-కాశ్మీర్ లో అంతర్భాగమే కదా? అటువంటప్పుడు వివాదమెక్కడ వుంది? భారత స్వాతంత్ర చట్టం ప్రకారం మహారాజా విలీన పత్రంపై సంతకం చేసిన తర్వాత ఆ భూమంతా భారత భూభాగమే కదా. ఇందులో మతానికి తావే లేదు కదా. ఇది బ్రిటీష్ ఇండియాలో భాగం కాదు కదా. ఇంకా ఏమాటకామాట చెప్పాలి , అక్సాయి చిన్ కొంత వివాద ప్రాంతమే. అది ఇరుదేశాలు పరిష్కరించుకోవాల్సిన ప్రాంతం. కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వివాద ప్రాంతమే కాదు. దురదృష్టవశాత్తు మన పాలకులు దీనిని సమర్ధవంతంగా పరిష్కరించలేకపోగా మొదట్లో మౌంట్ బేటన్ ప్రభావంతో ప్రజాభిప్రాయ సేకరణ కావాలని ఐక్యరాజ్యసమితి కి వెళ్ళటం పెద్ద తప్పు. తర్వాత కూడా అటువంటి ఘోర తప్పిదాలు కాశ్మీర్ విషయంలో ఎన్నో చేసారు. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకునేది వీటన్నిటికి మూల కారణం ఆరోజు పాకిస్తాన్ కుట్ర పన్ని కాశ్మీర్ ని ఆక్రమించు కోవాలని చూడటమే.

    ఆ చీకటి రోజుని మనం దుర్దినంగా ఎందుకు చరిత్రలో చెప్పుకోవటంలేదు? పాకిస్తాన్ దురాగతాన్ని ఎందుకు ఎండగట్టటం లేదు? కాశ్మీర్ నాయకులుగా చెలామణి అవుతున్న అబ్దుల్లా కుటుంబంగాని,ముఫ్తీ కుటుంబం కాని,గులాం నబి ఆజాద్ కానీ ఈరోజుదాకా ఈరోజుని బ్లాక్ డేగా ఎందుకు గుర్తుచేసుకోవటం లేదు. పోయిన సంవత్సరం ఆగస్టు 5వ తేదీ వీరికి బ్లాక్ డే కనబడుతుంది కానీ 1947 అక్టోబర్ 22వ తేదీ ఎందుకు బ్లాక్ డే గా కనబడదు? ఇన్నాళ్ళకి చరిత్రని సరిదిద్ది నిన్న కాశ్మీర్ లో పాకిస్తాన్ నీచ కుట్రను ఎండకడుతూ బ్లాక్ డే ని అధికారికంగా జరిపారు. ఇప్పటివరకు పాకిస్తాన్ అక్టోబర్ 27వ తేదీని (భారత్ లో విలీనమైన రోజు) బ్లాక్ డే గా జరుపుతుంటే గుడ్లప్పగించి చూసే ప్రభుత్వాలు,పాకిస్తాన్ ని ఎండగట్టే అక్టోబర్ 22వ తేదీని బ్లాక్ డే గా జరపక పోవటం శోచనీయం. మొట్టమొదటసారి  కాశ్మీర్ గడ్డపై నిన్న బ్లాక్ డే ని జరిపిన గవర్నర్ మనోజ్ సిన్హాకి, మిగతా పౌరులుకి శిరసు వంచి నమస్కరిస్తున్నాము. ఇంతవరకు మన తెలుగు మేధావులు చరిత్రని వక్రీకరించి కాశ్మీర్ పై తెలుగు ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పకనే చెప్పే ఈ సంఘటన సువర్నాక్షరాల్లో లిఖించాల్సి వుందని మనవి చేస్తున్నాము. త్వరలో కాశ్మీర్ దేశంలో మనసా వాచా మమేకమయ్యే పరిణామాలు జరుగుతాయని ఆశిస్తూ సెలవు.