ప్రపంచ దేశాలను ముప్పతిప్పలు పెట్టేందుకు చైనా కుట్రలు చేస్తోంది. కరోనా వైరస్ ను ఆవిర్భానికి కారణమైన చైనా ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమిస్తోంది. ఇటీవల జరిగిన జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్న కూటములు కలిసి ప్రపంచాన్ని శాసించే చైనాను అడ్డుకోలేవని ఎలుగెత్తింది. చైనా ఆధిపత్యాన్ని కట్టడి చేయాలని భావిస్తున్న జీ-7 దేశాలు ఈ అంశంపై చర్చిస్తున్న సందర్భంలో చైనా ఈ విధంగా స్పందించింది.
ప్రపంచ దేశాలకు సంబంధించిన నిర్ణయాలు కేవలం కొన్ని దేశాలతో కూడిన చిన్న కూటములు నిర్దేశించే రోజులు ఎప్పుడో పోయాయని లండన్ లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి చెప్పారు. చిన్న, పెద్ద, బలమైన, బలహీనమైన, ధనిక, పేద అన్ని దేశాలను చైనా సమానంగానే భావిస్తుందని పేర్కొన్నారు. అందుకే ప్రపంచ దేశాలకు సంబంధించిన అంశాలపై అన్ని దేశాల సంప్రదింపులతోనే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
గత కొంత కాలంగా శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా నిలిపేందుకు చైనా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. అదే సమయంలో గత నాలుగు దశాబ్దాలుగా గణనీయంగా పెరగుతున్న చైనా ఆర్థిక సైనిక శక్తిపై జీ-7 దేశాలు దృష్టి సారించాయి. చైనా పెత్తనానికి ముకుతాడు వేసే ప్రత్యామ్నాయాల కోసం అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్ లతో కూడిన కూటమి ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగా చైనా నుంచి పొంచి ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒకసమగ్ర వ్యూహంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సదస్సులో ప్రస్తావించినట్లు తెలిసింది. రూ.లక్షల కోట్ల వ్యయంతో చైనా చేపడుతున్న ప్రాజెక్టులకు దీటుగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి ఓ ప్రత్యేకమైన కార్యక్రమం రూపొందించనున్నట్లు సమాచారం.