AP Free Ration: ఏపీలో కేంద్రం అందించే ఉచిత రేషన్ బియ్యం పంపిణీ గత రెండు నెలలుగా నిలిచిపోయింది. బియ్యం లేవన్న కారణం చూపుతూ ఏప్రిల్, మే నెలకు సంబంధించి బియ్యం అందించలేదు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అందిస్తున్నా.. ఏపీ ప్రభుత్వం వివిధ కారణాలు చూపుతూ నిలిపివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు లబ్ధిదారుల్లో సైతం ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు బీజేపీ నాయకులు సైతం దీనిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పేదలకు కేంద్రం ఉచిత బియ్యం పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తే ఏపీ ప్రభుత్వం నొక్కేసిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఘాటు ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా బియ్యం అంశం తెరపైకి వచ్చింది. బీజేపీ ఆరోపణలకు వైసీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. కొవిడ్ తో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకుగాను ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. 2022 మార్చితో ఉచిత పంపిణీ ముగిసినప్పటికీ కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ లెక్కన ఈ ఏడాది అక్టోబరు వరకూ అందించాలి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సక్రమంగా అందించడం లేదు. రకరకాల కొర్రీలు పెడుతూ వస్తోంది.

అందని ఫ్రీ రైస్
వైట్ రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడికి నెలకు 5 కిలోల వంతున పంపిణీ చేయాలి. కేంద్రం ఠంచన్‌గా బియ్యం పంపిణీ చేస్తున్నా రెండు నెలలుగా ఏపీ ప్రభుత్వం పేదలకు ఇవ్వడంలేదు. ఏప్రిల్ నెలలో సరిపడా బియ్యం నిల్వలు లేవని, సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం తక్కువ కోటా ఇస్తోందని, అందుకే బియ్యం పంపిణీ చేపట్టలేదని వాదిస్తోంది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం సన్న బియ్యం పేరిట ఇంటింటా రేషన్ అందిస్తోంది. ప్రతీ నెల తొలి పక్షం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ చేయాలి. రెండో పక్షం రోజుల్లో కేంద్రం అందించే ఉచిత బియ్యం అందించాలి.
అయితే బియ్యం పంపిణీకిగాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత మొత్తం నగదు చెల్లిస్తోంది. కానీ సన్నబియ్యం పేరిట నూకలు తీసి ఇస్తున్న బియ్యానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం భారం పడుతోంది. అదే బియ్యం కేంద్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాలంటే మరింత భారం పడుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. పైగా నాన్ షార్టెక్స్ బియ్యం ఉండడం.. సాధారణ బియ్యం నిల్వలు లేకపోవడంతో ఉచిత పథకం అమలు చేయకుండా తాత్సారం చేస్తోంది. అయితే అన్ని రాష్ట్రాల్లో సవ్యంగా ఉచిత బియ్యం అందుతున్నా. ఏపీలో మాత్రం మొండిచేయి చూపుతుండడంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు నేరుగా ఆరోపణలు చేయడం వాతావరణాన్ని మరింత హీటెక్కించింది.

బీజేపీ ఆరోపణలు
ఈ విషయంలో అధికార వైసీపీని ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది. అందుకే పేదల బియ్యాన్ని నొక్కేస్తున్నారని సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. అయితే దీనిపై వైసీపీ ప్రభుత్వం భిన్న వాదనను వినిపిస్తోంది. రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డులు కేంద్రం లెక్క కన్నా డబుల్ ఉన్నాయని చెబుతోంది. అందరికీ ఇవ్వకుండా కొందరికే ఇస్తే… మిగతా వారిలో అసంతృప్తి నెలకొంటుందన్నారు. అందరికీ ఇవ్వాలంటే తమకు ఖర్చవుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అందరికీ ఫ్రీ బియ్యం అందించాలంటే కుదరని పనిగా భావిస్తోంది. అయితే దీనిపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. అటు లబ్దిదారులు మాత్రం ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read:Major Censor Review: మేజర్ సెన్సార్ రివ్యూ ఇదే.. గొప్ప చిత్రం అట !
Recommended Videos: