Pawan Kalyan- YCP: ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని సృష్టిస్తుంది. ఆ సంక్షోభాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ సంక్షోభం దిశగా సాగుతోంది. సొంత పార్టీలో అసమ్మతితో రగిలిపోతోంది. అదను కోసం కాచుకున్న ప్రతిపక్షాలకు ఇది వరమనే చెప్పాలి. కానీ ఆ సంక్షోభాన్ని ఎంత మేరకు తమకు అనుకూలంగా మార్చుకుంటారనేది అసలు ప్రశ్న .

వైసీపీలో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా సాగిన వ్యవహారం.. వీధికెక్కింది. ఇంకా ఎన్నికలకు సమయం ఉండగానే ఎమ్మెల్యేలు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. అసమ్మతిని అణచివేయడం వైసీపీ అధిష్టానానికి ఓ పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. అసమ్మతి పెరిగితే పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. వీలైనంత త్వరగా బుజ్జగింపులతో అసమ్మతిని తగ్గించాలి. లేదంటే మరింత మంది అసమ్మతి రాగం వినిపించే అవకాశం ఉంటుంది. వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
వైసీపీలో నెలకొన్న అసమ్మతి సంక్షోభం వైపు దారితీసే అవకాశం లేకపోలేదు. ఇన్నాళ్లు అదును కోసం వేచిచూస్తున్న జనసేనకు ఇదో గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. వైసీపీ ఎమ్మెల్యేల్లో అధిష్ఠానం పై పెద్ద ఎత్తున అసంతృప్తి ఉంది. అందుకే ప్రత్యామ్నాయంగా టీడీపీని ఎంచుకుంటున్నారు. దీనిని జనసేన తనకు అనుకూలంగా మార్చుకోవాలి. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని జనసేన భావిస్తోంది. ఈనేపథ్యంలో ఇదే మంచి అవకాశం. జనసేన కునుక వైసీపీ అసంతృప్తి నేతలతో మాట్లాడగలిగితే.. కొందరైనా జనసేన వైపు వచ్చే అవకాశం ఉంటుంది. అది జనసేనకు లాభదాయకమవుతుంది. వచ్చే ఎన్నికల్లో గణనీయమైన సీట్లను గెలుచుకునేందుకు ఒక అవకాశంగా మారుతుంది.

గతంలో ఏపీలో బీజేపీ, చిరంజీవి మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు మరోసారి ఆ అవకాశం జనసేనకు వచ్చింది. అధికార పార్టీ నేతలను జనసేనలో చేర్చుకోగలిగితే అది ఖచ్చితంగా జనసేనకు మైలేజ్ ఇస్తుంది. ఈ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ వాడుకోగలగాలి. అప్పుడే బలమైన పార్టీగా అవతరించే అవకాశం ఏర్పడుతుంది. గ్రామస్థాయిలో కూడా జనసేన బలాన్ని పెంచుతుంది. అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీలో చేరితే .. ఆ ప్రతిపక్ష పార్టీకి మంచి మైలేజ్ వస్తుంది. ఆ మైలేజ్ ఎన్నికల్లో ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి జనసేన అధినేత అలాంటి ప్రయత్నాలు చేయగలిగితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.