ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునే మందు ఇప్పట్లో లభించే అవకాశాలు కనబడటం లేదు. ఈ వైరస్ నియంత్రణకు కావాల్సిన వ్యాక్సిన్ తయారీ వారాలలో సిద్ధం కాబోతున్నట్లు అమెరికా, చైనా వంటి దేశాలు ప్రకటనలు చేస్తున్నా మరింత సమయం ఆగవలసిందే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తున్నది. అందుకు కనీసం 18 నెలల సమయం పడుతుందని వెల్లడించింది.
కానీ ఈ లోపు కరోనా సంక్రమించిన వారికి సరైన చికిత్స అందించడం పట్ల దృష్టి సారించాలని డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ డాక్టర్ టెడ్రోస్ సూచించారు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లేకపోవడం వైద్య సిబ్బందికి పెద్ద సమస్యగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలను రక్షించాలంటే సూట్‌లు, గ్లౌజ్‌లు, వెంటిలేటర్లు అత్యవసరం అని స్పష్టం చేశారు.
వైద్య సేవలు అందించే హెల్త్ వర్కర్లు ప్రమాదంలో ఉంటే, మనం అందరి జీవితాలు కూడా ప్రమాదంలో ఉన్నట్లే అని టెడ్రోస్ హెచ్చరించారు. సంపన్న దేశాల్లో హెల్త్ వర్కర్లు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటాన్నరో.. అలాంటి చర్యలనే చిన్న, మధ్యతరగతి దేశాలు కూడా పాటించాలని స్పష్టం చేశారు. చాలా దూకుడు పద్ధతిలో కరోనా కేసులను గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కిట్ల ఉత్పత్తి, టెస్టింగ్‌ను పెంచనున్నట్లు టెడ్రోస్ వెల్లడించారు. కరోనాతో బాధపడుతున్న వారెవ్వరూ స్వంత మందులను వాడకూడదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. మందు తయారీ కోసం ప్రపంచదేశాలు ముందుకు వస్తున్నట్లు టెడ్రోస్ తెలిపారు.
స్పెయిన్, ఇటలీ పేషెంట్లపై ట్రయల్స్ నిర్వహిస్తున్నామని, ఇది చరిత్రాత్మకమవుతుందని పేర్కొన్నారు. ట్రయల్ పద్ధతికి సుమారు 45 దేశాలు సహకారం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్న దేశాలు ఈ ట్రయల్ పద్ధతికి సహకరిస్తే, అంత త్వరగా కరోనాకు మందును కనుగొనే వీలుందని ఆయన తెలిపారు.
కరోనా మహమ్మారిగా మారుతున్న కొద్దీ.. ఆ వైరస్ కొత్త కొత్త దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాని ద్వారా కొత్త కొత్త అంశాలు బయటపడుతున్నట్లు టెడ్రోస్ చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో వెబ్‌సైట్‌లో సుమారు 40 గైడెన్స్ డాక్యుమెంట్లు ప్రచురించినట్లు ఆయన తెలిపారు.
ఆయా ప్రభుత్వాలు, డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, ప్రజలు ఎలాంటి భద్రతలు పాటించాలో వాటిల్లో వివరించినట్లు పేర్కొన్నారు. కోవిడ్19 సంఘీభావ నిధికి సుమారు 108 మిలియన్ డాలర్ల సహాయం అందినట్లు చెప్పారు.