మత సామరస్యం-వివాదాస్పద అంశాలు (భాగం 10)

ఇప్పటివరకు  స్వాతంత్ర భారతావనిలో దేశం ఎదుర్కొన్న అతిపెద్ద సామాజిక సమస్య మతం మాటున జరుగుతున్న ఆవేశకావేశాలు , వివాదాలు, వుద్రిక్తలు, ఘర్షణలు. అవి ఎలా జరుగుతున్నాయో వివరణాత్మకంగా చర్చించుకున్నాము. చివరగా సమస్య  ఎలా అయితే పరిష్కరించబడుతుందో సూచించటం మా బాధ్యతగా భావిస్తున్నాము. ముందుగా తెలుసుకోవాల్సింది ఇందుకు ఏ ఒక్కరూ బాధ్యులు కారని. చారిత్రకవారసత్వంతో ముడిపడివున్న సమస్యకు నిప్పురాజేసి ఉండొచ్చేమో గానీ సమస్యమాత్రం చాలా పురాతనమయినది. అందుకే పరిష్కారం కూడా అంత తేలిక కాదు. కనీసం ఇంతవరకు సమస్యకు […]

Written By: Ram, Updated On : June 10, 2020 8:57 am
Follow us on

ఇప్పటివరకు  స్వాతంత్ర భారతావనిలో దేశం ఎదుర్కొన్న అతిపెద్ద సామాజిక సమస్య మతం మాటున జరుగుతున్న ఆవేశకావేశాలు , వివాదాలు, వుద్రిక్తలు, ఘర్షణలు. అవి ఎలా జరుగుతున్నాయో వివరణాత్మకంగా చర్చించుకున్నాము. చివరగా సమస్య  ఎలా అయితే పరిష్కరించబడుతుందో సూచించటం మా బాధ్యతగా భావిస్తున్నాము. ముందుగా తెలుసుకోవాల్సింది ఇందుకు ఏ ఒక్కరూ బాధ్యులు కారని. చారిత్రకవారసత్వంతో ముడిపడివున్న సమస్యకు నిప్పురాజేసి ఉండొచ్చేమో గానీ సమస్యమాత్రం చాలా పురాతనమయినది. అందుకే పరిష్కారం కూడా అంత తేలిక కాదు. కనీసం ఇంతవరకు సమస్యకు నిజాయితీగా పరిష్కారమార్గాలు మాత్రం వెదకలేదు, ముఖ్యంగా మనన్ని పరిపాలించిన రాజకీయ నాయకత్వం. ఇది సత్యం. అందుకే దీనికి పరిష్కారమార్గాలు కూడా రాజకీయేతర మార్గాల ద్వారా వెదకాల్సిన అవసరం వుంది. ముందుగా ఇప్పటివరకు చర్చించుకున్న విషయాల్ని ఒకచోటకు చేర్చి సమీక్షించుకొని తర్వాత దానికి పరిష్కార మార్గాలు వెదుకుదాం.

వివాదాస్పద అంశాలు 

  1. ఉమ్మడి పౌర స్మృతి : భారత రాజ్యాంగ చర్చల్లో ఇది ప్రముఖ వివాదాంశం గా మారింది. కమిటీ లో కేవలం ముస్లింలీగ్ సభ్యులు మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించారు. సూత్రబద్ధంగా మిగతావాళ్ళందరూ సానుకూలంగానే వున్నారు. అయినా విభజన నేపధ్యం లో అందరి సమ్మతి తోనే దీన్ని అమలుచేయాలనే ఉద్దేశంతో ఆదేశిక సూత్రాలలో చేర్చారు. గత 72 సంవత్సరాల్లో ఈ ఆదేశిక సూత్రాన్ని అమలుచేయటానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఇది ఏ ఒక్క మత పౌర స్మృతి కాదు. మతాలకతీతంగా ఆధునిక సమాజ విలువలను దృష్టిలో వుంచుకొని తయారుచేయాల్సిన పౌర స్మృతి. దీనివలన అన్ని మతాలవారూ సర్డుకుపోవాల్సి వుంటుంది. అప్పుడే మతాల కతీతంగా మానవ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. దానివలన మతంతో సంబంధం లేని కొత్త మానవ సంబంధాలు ఆధునిక ప్రజాస్వామ్య విలువల స్పూర్తితో లింగ సమానత్వ సూత్రంతో రూపొందుతాయి. ఇది ఆదర్శ ప్రాయమైన పౌర స్మృతి.
  2. మత మార్పిడులు : ఇవి జరిగినప్పుడల్లా ఉద్రిక్తతలకు ఆస్కారం ఏర్పడుతుంది. అయినా ప్రభుత్వాలు ఇవి కట్టడిచేయటంలో విఫలమయ్యాయి. ఇవి స్వచ్చందంగా జరగలేదని , ఇతర కారణాలతో జరిగాయని నిరూపించటం అంత సులభమేమీ కాదు. అంతమాత్రాన దీనిపై స్థూలంగా ఓ అంగీకారం కనుక్కోవటానికి అడ్డంకులేమీ లేవు.
  3. హేతువాదుల హత్యలు : ఇది అత్యంత అనాగరిక చర్య. మతాన్ని నమ్మని వాళ్ళని , మతాన్ని విమర్శించే వాళ్ళను చంపే హక్కు ఈ అధునాతన నాగరిక సమాజంలో ఎవరికీ లేదు. ఈ హత్యల వెనక ఎవరున్నారో కనిపెట్టి శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది. హిందూ సమాజంలో అనాదినుంచి భౌతిక వాదాన్ని అనుసరించినవాళ్ళు వున్నారు. అదివాళ్ళ హక్కు. భావ స్వేచ్చను అరికట్టటమంటే ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థను పాటించక పోవటమేనని గమనించాలి. అయితే హేతువాదులు కూడా కొంత నియంత్రణ పాటించాలి. సిద్ధాంతపరంగా మీ వాదనల్ని వినిపించటం వరకు మీకున్న హక్కేగానీ ప్రత్యక్షంగా దేవుళ్ళను దూషించటం , ఇతరత్రా రెచ్చగొట్టే పనులు చేపట్టటం ( ఉదాహరణకు చరిత్రలో కొంతమంది చెప్పుల దండలేయటం లాంటి ) చేయటం ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయటమే అవుతుంది. భావస్వేచ్చ పేరుతో హద్దులు దాటటం రాజ్యాంగం ఒప్పుకోదు.
  4. బహిరంగ ప్రదేశాల్లో మత ప్రచారం, ప్రార్ధనలు, ఉత్సవాలపై వుమ్మడి విధానం: పండగల పేరుతో, ప్రార్ధనల పేరుతో  లౌడ్ స్పీకర్లతో ఇతరుల ప్రశాంతత ను భంగం చేసే హక్కు ఎవరికీ లేదు. అది అన్ని మతాలకు సమానంగా వర్తిస్తుంది. దీనిపై కూడా ఓ వుమ్మడి విధానం తీసుకురావాలి.
  5. మైనారిటీ హక్కులపై మరింత స్పష్టత : దీనిపై కూడా సరయిన విధానం వుండాలి. మైనారిటీ అనే శబ్దం వెనక వున్న భావాన్ని అర్ధం చేసుకొని దానికనుగుణంగా విధానాన్ని రూపొందించుకోవాలి. ఎక్కడయితే ఒక  మతం వాళ్ళు తక్కువమంది వుంది వాళ్ళ ప్రత్యేక సంస్కృతికి ఇబ్బందివుంటుందో అక్కడ మైనారిటీ ల పేరుతో ప్రత్యేక రాయితీలు ఇవ్వటం, హక్కులు కాపాడటం దీనివెనకున్న ప్రధాన ఉద్దేశం. అయితే ఇది రాష్ట్రాల వారిగా ఉండాలనే డిమాండ్ ఊపందుకుంది. ఉదాహరణకు ఈశాన్య భారతం లో చాలా రాష్ట్రాల్లో క్రైస్తవం మెజారిటీ ప్రజల మతం. అక్కడ వాళ్ళ హక్కులకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. అలాగే జమ్మూ-కాశ్మీర్ లో ఇస్లాం మెజారిటీ మతం. అక్కడ వాళ్ళ మత హక్కులకు వచ్చిన ఇబ్బందేమీలేదు. రెండో కోణంలో అదే ఈశాన్యం లో (అస్సాం, త్రిపుర, సిక్కిం మినహాయించి) హిందువులు , ముస్లిం లు, బౌద్ధులు మైనారిటీలు. వాళ్ళ ప్రత్యేక ఆచారాలు, సంస్కృతి పరిరక్షింపబడాలంటే వారికి మైనారిటీ రక్షణ ఉండాలనే వాదన బలంగా వుంది.                                                                                                                                                                                          రెండో వాదన , గణనీయమైన సంఖ్యలో మతస్తులు వున్నప్పుడు మైనారిటీ ట్యాగ్ అవసరమా అనేది. ఉదాహరణకు అస్సాం లో దాదాపు 35 శాతం దాకా ముస్లిం లు వున్నారు. అటువంటప్పుడు వాళ్ళ హక్కులకు భంగం వాటిల్లే అవకాశం లేదు. అలాగే జమ్మూ-కాశ్మీర్ లో హిందువులు 35 శాతం పైనే వున్నారు. పైన చెప్పిన రాష్ట్రాల ప్రాతిపదికన చూసినా వారు మైనారిటీ గా  ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ బౌద్ధులు, సిక్కులు మైనారిటీలుగా ఉండాల్సిన అవసరం వుంది. గణనీయ సంఖ్యలో వున్నప్పుడు అది వర్తించటం లో అర్ధం లేదు. ఈ విధంగా చూసినప్పుడు రాష్ట్రం లో ఓ నిర్దిష్ట శాతం దాటినప్పుడు వారికి మైనారిటీ నిర్వచనం వర్తించ కూడదు. ఉదాహరణకు ఒక మతం 15 శాతానికి మించి వుంటే వాళ్లకు వాళ్ళు పరిరక్షించుకోగలరు. ఈ శాతం విషయం లో , మిగతా వివరాల విషయం లో మరింత లోతైన చర్చ అవసరం వుంది.
  6. మత ప్రాతిపదికగా ప్రభుత్వ ఖర్చుల్లో వున్న హేతుబద్ధత : ఇది సెక్యులర్ రాజ్యాంగ సూత్రాల కు విరుద్ధం. ఉదాహరణకు యాదాద్రి దేవాలయానికి ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టటం ఏ విధంగా సమర్ధనీయం. ప్రభుత్వ ఆదాయం అన్ని మతాల ప్రజల కు సంబంధించింది. రేపట్నుంచీ ఈ నిధులు గుళ్ళు, మసీదులు, చర్చీలు కట్టుకోవటానికి ఇవ్వమని అడిగితే ప్రభుత్వం దగ్గర ఏం సమాధానం వుంది? ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అదే కాదు పూజారులకు, ఇమాం లకు , పాస్టర్లకు ప్రభుత్వ నిధులు ఎలా ఖర్చు పెడతారు. హజ్, జరూసలెం, కైలాస మానస సరోవర్ యాత్రలకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేయటం కూడా వివాదాంశమే. దీని పై కూడా ఓ విధానాన్ని రూపొందించుకోవాలి.
  7. జనాభా నియంత్రణ : దేశం లో ఆత్యాయక స్థితి విధించిన తర్వాత జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల తర్వాత వచ్చిన వివాదం తో ఈ అంశం వెనకపట్టు పట్టింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇది మత పరమైన వివాదం గా మారింది. ఇందులో మత పరమైన వివక్షకు తావులేదు. దేశాహితం దృష్ట్యా దీనిని ప్రాధాన్య అంశంగా గుర్తించి అమలుచేయాలి.
  8. గోవధ పేరుతో హింస, సామూహిక హత్యలు (Mob lynching): ఇది ముఖ్యంగా ఉత్తరాది లో ఎక్కువగా వున్న సామాజిక దురాచారం. గో హత్య పై చట్టపరంగా అనేక రాష్ట్రాల్లో నిషేధం వున్నా గో హత్యలు జరగటం వాస్తవం. అయితే చట్టాన్ని తమ చేతులోకి తీసుకోవటం, ఆధారాలు లేకుండా పుకార్లపై ఆధారపడి వేధించటం, సామూహిక హత్యలు చేయటం పై ప్రభుత్వం ఇప్పటికన్నా మరింత కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం వుంది.
  9. మత సంస్థలపై ప్రభుత్వ అజమాయిషీ : ఇది కూడా మెజారిటీ మతస్తుల్లో గూడుకట్టుకొని వున్న అసంతృప్తి. భారత రాజ్యాంగం సెక్యులర్ అయినప్పుడు ఈ వివక్ష ఉండాల్సిన అవసరం లేదనేది వీరి వాదన. మసీదులు, చర్చీలు, బౌద్ధారామాలు స్వతంత్రంగా వున్నప్పుడు దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఏ మేరకు సమర్ధనీయం అనేది వీరి వాదన. అంతవరకూ బాగానే వున్నా ఇవి ఎవరికి బదిలీ చేయాలనేది పెద్ద వివాదాంశమే. దీన్ని పరిష్కరించటం అంత తేలిక కాదు.ఏమైనా దీనిపై కూడా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని తీసుకురావల్సివుంది. ఇప్పటికే ఈ అంశం సుప్రీం కోర్టు విచారణ లో వుంది.
  10. విద్య సంస్థల్లో వివక్ష: ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం కూడా వివక్ష తో కూడుకొని వుందనేది మెజారిటీ మతస్తుల వాదన. మైనారిటీ మత సంస్థలైన ముస్లిం, క్రైస్తవ విద్య సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ లేదు. ఆ సంస్థల్లో రిజర్వేషన్లు వర్తించవు. ఇది వివక్షేనని హిందూ విద్యా సంస్థల వాదన. ఈ వాదనని పూర్తిగా కొట్టి పారేయలేము. అన్ని విద్య సంస్థల్లో రిజర్వేషన్లు వర్తించాలి. అన్ని విద్యా సంస్థలపై ప్రభుత్వం ఒకే నియంత్రణ విధానాన్ని అమలుచేయాలి. మదరసాలు, వేద పాఠశాలలు ఇతర అన్ని విద్య సంస్థలను ఈ నియంత్రణ కిందకు తీసుకురావాలి.
  11. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు : క్రైస్తవ మతం లో కులాలు లేకపోయినా భారత్ లోని ప్రత్యేక పరిస్థితుల్లో కుల గుర్తింపులు ఇతరమతస్తుల్లో కూడా కొనసాగటం ప్రత్యేకత. ప్రస్తుత రిజర్వేషన్ విధానం దళిత క్రైస్తవులకు కూడా వర్తించాలని వారు కోరుతున్నారు. దీనిపై ఇంతకుముందు భాగాలలో కొంత చర్చ జరిగింది. రిజర్వేషన్ కోసమే అధికారిక లెక్కల్లో హిందువులుగా చూపించబడుతున్నా వాస్తవానికి క్రైస్తవ జనాభా చాలా ఎక్కువని వివరించాము. ఈ రెండు అంశాలను జతచేసి చర్చించాల్సి వుంది.
  12. పౌర చట్టాల సంస్కరణలు : దేశంలో నేర వ్యవస్థ స్థూలంగా ఒకేలాగా వున్నా పౌర న్యాయం మతాల ఆచారాలు, సంప్రదాయాల కనుగుణంగా ఏ మతానికి ఆ మతానికి ప్రత్యేకంగా వున్నాయి. ఇవి ప్రధానంగా వివాహం, ఆస్తి హక్కు, తదనంతర వారసత్వం, విడాకులు, దత్తతకి సంబంధించినవి. ఈ చట్టాలు మౌలికంగా పురుషాధిక్యతతో వుండటం వలన మహిళలకు తీరని అన్యాయం జరిగింది. వుమ్మడి పౌర స్మృతి వస్తే ఆధునిక సమాజ విలువల ప్రకారం మహిళలకు న్యాయం జరుగుతుంది. దీనికోసమే అంబేద్కర్ రాజ్యాంగ సభలో గట్టిగా ప్రయత్నం చేసాడు. ఆ తర్వాత హిందూ కోడ్ బిల్లు తీసుకురావటంతో కొంతవరకు న్యాయం జరిగింది. ఆ తర్వాత 2005 లో మహిళలకు సమాన ఆస్తి హక్కు చట్టం తీసుకు రావటం తో చాలావరకు వ్యత్యాసాలు తగ్గాయి. క్రైస్తవ, పార్సీ పౌర చట్టాల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ ఇస్లాం పౌర చట్టం లో పెద్దగా మార్పు రాలేదు. 1986 లో ఒకేసారి ముస్లిం మహిళా చట్టం తీసుకొచ్చారు. అందులోనే షాబానూ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని రద్దుచేసే నిబంధన తీసుకొచ్చింది. అంతకుమించి ఎటువంటి మార్పులు జరగలేదు. మిగతా మతాలలో లాగే ఇస్లాం పౌర న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకురావటానికి ఓ కమీషన్ వేసి ఇస్లాం కోడ్ బిల్లు తీసుకువస్తేనే మహిళలకు మేలు జరుగుతుంది. దీనికి ప్రధాన అడ్డంకి ముస్లిం మత పెద్దలు. మహిళలు, అభ్యుదయవాదులు పూనుకొని ఈ సంస్కరణల దిశగా ప్రయత్నం చేయాలి. ఇప్పటికే ముమ్మూరు తలాక్ చట్టం తో కొంత మేలు జరిగింది. అలాగే బహు భార్యత్వం, నిఖా హలాలా లాంటి దురాచారాల్ని నిషేదించాలి. ప్రస్తుతం ఈ రెండూ సుప్రీం కోర్టు  విచారణలో వున్నాయి. వీటిపై ప్రభుత్వం మహిళా హక్కుల దిశలో ఆలోచించి వాదనలు ప్రవేశపెట్టాలి. ఇది ముస్లిం వ్యతిరేక చర్యగా మత పెద్దలు రెచ్చగొట్టే ప్రమాదమున్నా ధైర్యంగా ముస్లిం మహిళల తరఫున ప్రభుత్వం నిలబడాలి. అందుకు ముస్లిం సమాజం మద్దత్తు నిచ్చినప్పుడే ఈ సంస్కరణలు అమలవుతాయి.
  13. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక, జాతీయ పౌర పట్టిక : వాస్తవానికి ఇవేవీ మత సంబంధమైనవి కాకపోయినా వీటిపై అపోహలు ఉండటంతో వీటిపై కూడా చర్చించాల్సిన అవసరం వుంది. ఇందులో మొదటిది అసలు భారతీయ పౌరులకు సంబంధించినది కాదు. మిగతా రెండు మతాల ప్రస్తావన లేనివి. అయినా వీటిపై ముస్లిం సమాజంలో అపోహలు, అపార్ధాలు  సృష్టించటంలో మత పెద్దలు, ఇస్లాం వాదులు సఫలమయ్యారు. అందుకనే వీటిని కూడా వివాదాస్పద అంశంగా స్వీకరించి చర్చించాల్సిన అవసరం వుంది.

ఇవీ స్థూలంగా కొన్ని వివాదాస్పద అంశాలు. చర్చల్లో ఇంకేమయినా వస్తే వాటిని పరిశీలించి స్వీకరించవచ్చు. వీటన్నింటికీ పరిష్కారమార్గాలు కనుగొన్నప్పుడే మత సామరస్యం శాశ్వతంగా వెల్లివిరుస్తుంది. లేకపోతే ఈ ఘర్షణలు, ఉద్రిక్తతలు రావణాకాష్టం లాగా కాలుతూనే వుంటాయి. దీనిపై విస్తృత చర్చ జరగాలి. ఇందుకోసం ఎవరిని విశ్వాసంలోకి పరిగణలోకి తీసుకోవాలి, ఎలా ముందు కెళ్ళాలో వచ్చే భాగం లో చర్చించుకుందాం.