Bus Conductor: ఎత్తు కొందరికి వరమైతే.. మరి కొందరికి భారంగా, ఇబ్బందిగా మారుతుంది. నేటి తరం యువత ఎత్తుగా ఉండాలనే కోరుకుంటుంది. కానీ, హైదరాబాద్(Hyderabad)లో పనిచేస్తున్న ఓ ఆర్టీసీ కండక్టర్‌ను చూసిన తర్వాత ఎత్తు ఎక్కువగా ఉంటే ఎదురయ్యే ఇబ్బందులు అర్థమవుతున్నాయి. ఇటీవల ఆ కండక్టర్ వైరల్ కావడంతో చివరకు సీఎం స్పందించారు.
హైదరాబాద్‌లోని మెహదీపట్నం డిపోలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) కండక్టర్(Cundactor)గా పనిచేస్తున్న అహ్మద్ మెహదీ(Ahmed Mehadi) (7 అడుగుల ఎత్తు) తన అసాధారణ ఎత్తు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సాధారణ బస్సులలో లోపలి ఎత్తు కేవలం 6.4 అడుగులు ఉండటంతో, అతను విధులు నిర్వహించేటప్పుడు మెడ వంచి, ఒంగి పనిచేయాల్సి వస్తోంది. దీని వల్ల అతనికి మెడ నొప్పి, వెన్నునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ శారీరక ఇబ్బందుల కారణంగా అతను తరచూ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం స్థానిక మీడియాలో వార్తలుగా వెలుగులోకి రావడంతో అధికారుల దృష్టికి చేరింది.
Also Read: పిల్లలను కనండి.. బాబు కోరిక వైరల్!
స్పందించిన రవాణా మంత్రి..
తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఈ సమస్యపై స్పందిస్తూ, అహ్మద్‌కు అతని శారీరక పరిస్థితికి తగిన పని వాతావరణం కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. ఈ విషయం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(Revanth Reddy) దృష్టికి వెళ్లడంతో, ఆయన టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ.సజ్జనార్‌కు అహ్మద్‌కు అనువైన ఉద్యోగం కేటాయించాలని సూచించారు. బస్సుల్లో కండక్టర్‌గా పనిచేయడం అతని ఆరోగ్యానికి హానికరంగా ఉందని. డిపోలో గ్రౌండ్ స్టాఫ్‌గా లేదా ఆఫీసు సంబంధిత విధుల్లో అతన్ని నియమించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్..
అహ్మద్ సమస్య సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చనీయాంశమైంది. అతని శారీరక ఇబ్బందులను గుర్తించి, ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా చర్యలు తీసుకోవాలని పలువురు సూచించారు. టీజీఎస్ ఆర్టీసీ(TGSRTC)లో ఇటీవల కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగులకు 2.5% డీఏ ప్రకటన, మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం వంటి అనేక సంస్కరణలు చేపడుతున్న నేపథ్యంలో, ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ చర్య ఒక సానుకూల అడుగుగా భావించబడుతోంది.
అహ్మద్‌కు అనువైన ఉద్యోగం కేటాయించడం ద్వారా, అతని ఆరోగ్య సమస్యలను నివారించడమే కాక, ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతను కూడా ఇది ప్రతిబింబిస్తుంది. ఈ దిశగా త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది, దీనివల్ల అహ్మద్ తన వృత్తిని మరింత సౌకర్యవంతంగా, ఆరోగ్యంగా కొనసాగించగలుగుతాడు.