Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉందా? బ్లేడ్ లతో వైసిపి అల్లరి మూకలు చెయ్యి కోసేందుకు ప్రయత్నిస్తున్నాయా? పవన్ ఆరోపణల్లో నిజం ఎంత? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గతంలో కూడా పవన్ ఇటువంటి ఆరోపణలే చేశారు. తనను హత్య చేసేందుకు సుఫారీ సైతం ఇచ్చారని ఆరోపణలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఇప్పుడు పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో పవన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోంది.
పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఎలాగైనా గెలుపొందేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇక్కడ కానీ తాను ఓటమి పాలైతే తనను రాజకీయ సమాధి చేస్తారని పవన్ కు తెలుసు. అందుకే పిఠాపురంలో రెండు లక్షల ఓటర్లను నేరుగా కలిసేందుకు డిసైడ్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ కు ఉన్న విపరీతమైన స్టార్ డమ్ అడ్డంకిగా నిలుస్తోంది. ఈ తరుణంలో పవన్ తనపై బ్లేడ్ దాడి జరుగుతోందని చెప్పడం సంచలనం గా మారింది. జనం ఎక్కువమంది గుమిగూడినప్పుడు కిరాయి మూకలు జొరబడి సన్నని బ్లేడ్లతో కోసి గాయపరుస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.అయితే సోషల్ మీడియాలో వైసిపి రచ్చ చూసినవారు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల్లో నిజం ఉందని భావిస్తున్నారు.
అయితే పవన్ ఈ తరహా ఆరోపణలు చేయడం కొత్త కాదు. 2019 ఎన్నికలకు ముందు కూడా ఇదే రీతిలో తనకు ప్రాణ హాని తలపెట్టడానికి ప్రయత్నించారని… మొన్నటికి మొన్న వారాహి యాత్రలో చెప్పుకొచ్చారు.అయితే ఇవి ఆరోపణల వరకే పరిమితం చేశారు. రుజువు చేసే ప్రయత్నం చేయలేదు. రాజకీయ విభేదాలు ఉంటాయి కానీ.. ప్రత్యర్థి పై వ్యక్తిగత దాడికి పురిగొల్పడానికి ఎవరు సాహసించరు. అందునా విపరీతమైన అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ జోలికి వచ్చేందుకు ఎవరు ముందుకు రారు. నాయకుల అభిమానం మాటున అల్లరి మూకలు ఈ తరహా ప్రయత్నం చేయవచ్చు. కానీ దీని వెనుక రాజకీయ పార్టీల ప్రోత్సాహం ఉందని మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయం. పార్టీలపై అభిమానం ఉన్నవారు ఇటువంటి ప్రయత్నాలకు దిగితే.. సంబంధిత పార్టీలకే నష్టం. అయితే ఈ తరహా ఆరోపణలు చేసింది ఒక విపక్ష నేత. ఇందులో రాజకీయ లబ్ధి కోసం చేశారో? నిజంగా ఈ పరిణామం ఎదురయిందో? అన్నదానిపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి. సీరియస్ యాక్షన్ కు దిగాలి. రేపు జరగరానిది జరిగితే అందుకు అధికార పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. పైగా ఆరోపణలు ఎదుర్కొంటోంది ఆ పార్టీ కనుక.. ఒకసారి చెక్ చేసుకోవడం ముఖ్యం.