AP volunteer system: కూటమి( Alliance ) ప్రభుత్వమే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం వాలంటీర్ల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జగన్మోహన్ రెడ్డి ఇకనుంచి వాలంటీర్ల వ్యవస్థ జోలికి వెళ్లకూడదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తాజాగా దీనిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే పార్టీ సమావేశంలోనే మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థ అనేది ముగిసిన అధ్యయమే. కూటమి ప్రభుత్వమే కాదు… మున్ముందు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా.. వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టే అవకాశం కనిపించడం లేదు. ఆ వ్యవస్థతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైందని ఆ పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. వారు కోరుకున్నట్టుగానే వాలంటీర్ వ్యవస్థ జోలికి వెళ్లకుండా వైసిపి నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ( Gopi Reddy Srinivas Reddy )ఇటీవల పార్టీ శ్రేణులతో కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ తోనే పార్టీకి దారుణ పరాజయం ఎదురైందని అభిప్రాయపడ్డారు. తాను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ఫిర్యాదు చేశానని.. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరోసారి వలంటీర్ వ్యవస్థ జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేసినట్లు స్వయంగా పార్టీ సమావేశంలోనే వెల్లడించారు. అయితే మాజీ ఎమ్మెల్యే అభిప్రాయాన్ని ఆ పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో ఆహ్వానించాయి. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇదే అభిప్రాయంతో ఉన్నాయి.
Also Read: నాతో పెట్టుకున్నోళ్లు ఎవరూ మిగలేదు.. పైకిపోయారు.. కేఏ పాల్ వార్నింగ్
ప్రతి 50 కుటుంబాల బాధ్యత..
2019లో అధికారంలోకి వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party). వచ్చిన వెంటనే వలంటీర్ వ్యవస్థను ప్రారంభించింది. ప్రతి 50 కుటుంబాల బాధ్యతను వారికి అప్పగించింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ నాయకత్వానికి, పార్టీ శ్రేణులకు పని లేకుండా పోయింది. ప్రభుత్వం అంటే వలంటీర్ వ్యవస్థ అని ప్రజల్లో పాతుకు పోయింది. ప్రతి చిన్న అవసరానికి జనం వాలంటీర్ల చుట్టూ తిరిగారు. ఏదైనా పథకం ఎవరు అందించారని అడిగితే వాలంటీరు పేరు చెప్పడం ప్రారంభించారు ప్రజలు. అప్పట్లో వాలంటీర్ వ్యవస్థ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి లెక్క చేయలేదు. దీంతో వైసిపి శ్రేణులు ప్రజల్లో చులకన అయ్యారు. సరిగ్గా ఎన్నికల ముంగిట వాలంటీర్ వ్యవస్థను నిలిపివేసింది ఎన్నికల కమిషన్. దీంతో చాలామంది వాలంటీర్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాజీనామాలు చేయించింది. అయితే కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని.. రాజీనామాలు చేయవద్దని విజ్ఞప్తితో.. సగం మంది రాజీనామాలు చేయలేదు.
నోరు మెదపని వైసిపి..
అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతోంది. కానీ వాలంటీర్ వ్యవస్థ( volunteer system) పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం పెద్దగా మాట్లాడడం లేదు. వాలంటీర్ వ్యవస్థ మూలంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందన్నది మెజారిటీ పార్టీ శ్రేణుల అభిప్రాయం. ఒకవేళ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను సమర్థిస్తే.. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని అమలు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలుసు. అందుకే ఈ వ్యవస్థ విషయంలో కూటమి బాటలోనే నడవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం విశేషం.