Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత సంస్కరణలను వేగవంతంగా అమలు చేస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. వలసలు నిరోధం, అక్రమంగా ఉంటున్న వారిని బయటికి పంపించడం, అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించడం, డాలర్ ప్రతిపత్తిని మరింత పెంచడం, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడతానని ఎన్నికల సమయంలో ట్రంప్ వాగ్దానాలు ఇచ్చారు. వాటిని అమలు చేస్తామని తన ప్రతినిధి ద్వారా చెప్పించారు. కాగా, ట్రంప్ ఎన్నిక నేపథ్యంలో బంగ్లాదేశ్, ఇరాన్, చైనా, ఉక్రెయిన్ వంటి దేశాలు ఒకింత సంకట స్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో భారత్, ఇజ్రాయెల్, రష్యా వంటి దేశాలు సానుకూల వాతావరణాన్ని పొందే అవకాశం ఉందని సమాచారం.
హైదరాబాద్ పై ఫోకస్
ట్రంప్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ఆగర్భ శ్రీమంతుడు కూడా. అమెరికాలోని టాప్ 5 ధనవంతుల్లో అతడు కూడా ఒకడు. అతడికి అనేక రంగాలలో వ్యాపారాలు ఉన్నాయి. స్థిరాస్తి వ్యాపారంలో ట్రంప్ కంపెనీకి చాలా మంచి పేరు ఉంది. అమెరికా వ్యాప్తంగా ట్రంప్ టవర్స్ పేరుతో ఆయన బహుళ అంతస్తులను నిర్మించారు. అయితే ట్రంప్ నిర్మాణ సంస్థ గతంలోనే భారత్ లో అడుగుపెట్టింది. వాణిజ్య నగరంగా పేరుపొందిన ముంబై, కోల్ కతా, గుర్గావ్, పూణే ప్రాంతాలలో ట్రంప్ కంపెనీ బహుళ అంతస్తులు నిర్మించింది. ప్రస్తుతం ట్రంప్ అధ్యక్షుడు కాగానే మరో ఆరు అత్యంత భారీ టవర్లు నిర్మించాలని నిర్ణయించింది. ఇది గనక పూర్తయితే భారత్లో ట్రంప్ టవర్ల సంఖ్య పదికి చేరుకుంటుంది. తద్వారా అమెరికా తర్వాత అత్యధికంగా ట్రంప్ టవర్లు ఉన్న దేశంగా భారత్ నిలుస్తుంది. అయితే హైదరాబాదులో మంజీరా గ్రూప్ సంస్థలు కలిసి ట్రంప్ కంపెనీ ఈ టవర్లు నిర్మిస్తుందని తెలుస్తోంది. 2022లో టవర్ల నిర్మాణం కోసం మాదాపూర్ లోని ఖానామెట్ ప్రాంతంలో రెండు పాయింట్ 2.92 ఎకరాల భూమిని ట్రంప్ కంపెనీ కొనుగోలు చేసింది. నాడు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వేలం వేయగా ఆ భూమిని కొనుగోలు చేసింది. మొత్తం 27 అంతస్తులలో ఆ టవర్లు నిర్మించనుంది. నాలుగు పడకగదులు, ఐదు పడక గదుల అంచనాతో బహుళ అంతస్తులు నిర్మాణం కానున్నాయి. నాలుగు పడక గదుల అపార్ట్మెంట్ విస్తీర్ణం నాలుగు నుంచి ఐదువేల చదరపు అడుగులలో నిర్మించనున్నది. ఐదు పడకగదుల అపార్ట్మెంట్ విస్తీర్ణం 6000 చదరపు అడుగులలో నిర్మించనున్నది. అయితే చదరపు అడుగుకు 13,000 చొప్పున వసూలు చేయాలని అప్పట్లోనే భావించింది . ఇక అప్పటి లెక్క ప్రకారం ఒక్కో ఫ్లాట్ ధర 5.5 కోట్లుగా పేర్కొంది.. ఇది మాత్రమే కాకుండా ఇతర నగరాలలో కార్యాలయాలు, విల్లాలు, గోల్ఫ్ కోర్స్ లు నిర్మించే యోచనలో ట్రంప్ కంపెనీ ఉంది.