
తనతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఆవేశానికి లోనైన ఓ బ్యాంక్ మేనేజర్.. కట్టుకున్న భార్యను కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షికోహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రమేష్‌నగర్ ప్రాంతంలో నివసించే ఆశారాం అనే వ్యక్తి బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం అర్థరాత్రి మొదటి భార్యకు సంబంధించిన గొడవపై రెండో భార్య వినీత.. ఆయనతో వాగ్వాదానికి దిగింది. దాంతో కోపోద్రిక్తుడైన ఆశారాం.. తన వద్ద ఉన్న దేశీయ పిస్టల్ ఉపయోగించి ఆమెపైకి కాల్పులు జరిపాడు. దాంతో వినీత అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు కేసుల నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక దవాఖానకు పంపించినట్లు సీనియర్ పోలీసు అధికారి అజయ్ కుమార్ పాండే తెలిపారు.