Islamic NATO: ఆపరేషన్ సిందూర్‌తో చావు తప్పి కన్ను సొట్టబోయిన చందంగా మారింది పాకిస్తాన్. అయినా పిచ్చి ప్రేలాపనలు మాత్రం తగ్గించడం లేదు. ఇటీవల అమెరికా సహకారం పెరిగింది. దీంతో పాకిస్తాన్ మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ఖతార్‌లోని హమాస్ సమావేశంపై డ్రోన్ దాడి చేయడం పాకిస్తాన్‌కు కలిసి వచ్చింది. ఈ క్రమంలో ఇస్లామిక్ దేశాలను ఏకతాటిపైకి తీసుకురావాలని పాకిస్తాన్ ప్రయత్నం ప్రారంభించింది. ఇస్లామిక్ నాటో ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తోంది.
పాకిస్తాన్ ఇటీవల 57 ఇస్లామిక్ దేశాలను ఒక మిలటరీ కూటమిగా మార్చే ప్రణాళికలో కసరత్తు వేగవంతం చేసింది. ఉద్దేశ్యం – ఏ ఇస్లామిక్ దేశం పై దాడి జరిగినా మిగతా దేశాలు కలిసి సైనిక చర్యలు చేపట్టడం. ఇది నాటో ఒప్పందంలోని ఆర్టికల్ 5 సూత్రానికి ప్రతిరూపం.
ఇప్పటికే ఉన్న సైనిక ఒప్పందాలు
పాకిస్తాన్ ఇప్పటికే తుర్కియే, అజర్‌బైజాన్‌తో సైనిక సహకార ఒప్పందాలు కలిగి ఉంది. సెప్టెంబర్ 17, 2025న సౌదీ అరేబియాతో డిఫెన్స్ ఒప్పందం చేసుకుంది. తాజాగా సోమాలియాతో ఐదేళ్ల వ్యూహాత్మక, మిలటరీ సహకార ఒప్పందం. సోమాలియా ఉన్న హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతం ప్రపంచంలో ఆయిల్ ఎగుమతి ప్రధాన కేంద్రం. దీంతో ఇది పాకిస్తాన్‌కు అనుకూలంగా మారనుంది.
కూటమి నేపథ్యం
గత ఏడాది నుంచి ఇజ్రాయెల్ చేసిన చర్యలు అరబ్ ప్రపంచంలో భయాందోళనను పెంచాయి.
– 2024 జూలై – ఇరాన్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకార వేళ హమాస్ నేత వద్దకు డ్రోన్ దాడి.
– 2024 సెప్టెంబర్ – దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బుల్లా కమ్యూనికేషన్ పరికరాలపై దాడి.
– 2025 – యెమెన్‌లో హూతీలపై ఎయిర్‌స్ట్రైక్స్.
– 2025 సెప్టెంబర్ 9 – ఖతార్‌లో హమాస్ నాయకులపై దాడి.
ఈ పరిణామాలు ఇస్లామిక్ దేశాల మధ్య రక్షణ సహకార ఆలోచనకు బీజం వేశాయి.
పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రయోజనాలు
ఇస్లామిక్ నాటో ఏర్పడితే పాకిస్తాన్‌కు చాలా లాభం. ఇదే సమయంలో పాకిస్తాన్ ఆణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఏకైక ఇస్లామిక్ దేశం. రక్షణ బడ్జెట్‌లో అధిక స్థానం. సౌదీ, తుర్కియే రక్షణ బడ్జెట్ కూడా ఎక్కువే. ప్రపంచ 40% ఇంధన ఉత్పత్తి ఇస్లామిక్ దేశాల్లో ఉండటం వల్ల ఆర్థిక ప్రభావం. కూటమి ఏర్పడితే ఆయిల్, గ్యాస్ కన్సార్టియం ద్వారా ప్రపంచ ఆర్థిక సమీకరణలో ప్రాధాన్యం పెరగడం.
భారత్‌కు భద్రతా లెక్కలు
ఈ కూటమి ఏర్పడితే తొలి ప్రతిస్పందన ఇజ్రాయెల్‌కు. అయితే ఆపరేషన్ ‘సిందూర్’ వంటి పరిస్థితులు పునరావతమైతే భారత్‌తోనూ ఘర్షణ అవకాశాలు. భారత్ ఇప్పటికే పాకిస్తాన్–తుర్కియే సహకారం పై అప్రమత్తంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తుర్కియే డ్రోన్లతో, సైనికులతో సహాయం చేసిన రికార్డులు ఉన్నాయి.
కూటమి ఎదుర్కొనే అవాంతరాలు
అయితే ఇస్లామిక్ దేశాల మధ్య ఆలోచనా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ఏర్పాటు అంత సులభం కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇరాన్‌తో సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈకి పడదు. కానీ ఇస్లామిక్ కూటమిలో ఇవే బలమైన దేశాలు. ఆసియా ఇస్లామిక్ దేశాలు (ఇండోనేషియా, మలేషియా) మిలటరీ బ్లాక్‌లో ఆసక్తి తక్కువ. అంతర్గత రాజకీయ, జాతి విభజనలు కూటమి నిలకడను దెబ్బతీయవచ్చు.
పాకిస్తాన్ పన్నుతున్న ‘ఇస్లామిక్ నాటో’ యత్నం కేవలం రక్షణ ఒప్పందం కాదు. ఇది ఇంధన ఆధిపత్యం, భౌగోళిక రాజకీయ ప్రభావం, తూర్పు–పడమర దౌత్య పోటీ మధ్య ఒక కొత్త బ్లాక్ సష్టించే ప్రయత్నం. భారత్‌కు ముఖ్య సవాలు – ఈ కూటమిని విభేదించే దేశాలతో సంబంధాలు బలోపేతం చేసి, ఏకైక ముస్లిం బ్లాక్‌గా మారకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.